
న్యూఢిల్లీ: బీజేపీ నేత తజిందర్ భగ్గా (Tajinder Bagga)ను ఢిల్లీలో పంజాబ్ పోలీసులు అరెస్టు చేసిన వ్యవహారం ముదురుతోంది. ఈ వ్యవహారంపై ఢిల్లీ బీజేపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind kejriwal) నివాసం వెలుపల శనివారం నిరసన ప్రదర్శనలకు దిగడం ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రదర్శకులను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయడంతో తోపులాట చోటుచేసుకుంది. దీంతో మంజిందర్ సింగ్ సిర్సాతో సహా సుమారు 50 నుంచి 70 మంది కార్యకర్తలను పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
తజిందర్ బగ్గాను పంజాబ్ పోలీసులు శుక్రవారం నిర్బంధించి పంజాబ్‌కు తరలించే ప్రయత్నించడం, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి ఆయన తిరిగి ఇంటికి చేరుకున్నారు. బీజేపీ నుంచి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నివాసం చుట్టూ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ముందస్తు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య శనివారంనాడు తేజేందర్ బగ్గాను, ఆయన తండ్రి ప్రిత్‌పాల్‌ను వారి నివాసంలో కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, బగ్గా నోరు నొక్కేందుకు కేజ్రీవాల్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.