భయపెడుతున్న...బ్లాక్‌ ఫంగస్‌!

ABN , First Publish Date - 2021-05-18T17:53:55+05:30 IST

బ్లాక్‌ ఫంగస్‌! వంటింట్లో కుళ్లిపోయిన కూరగాయలు, బ్రెడ్‌ ముక్కల మీద పేరుకునే ఫంగస్‌ ఇది! వాతావరణంలో కలిసి ఉండే ఈ ఫంగస్‌ స్పోర్స్‌కు మన శరీరంలోకి చేరుకుని ఇన్‌ఫెక్షన్‌ను కలుగచేసేటంత శక్తి ఉండదు.

భయపెడుతున్న...బ్లాక్‌ ఫంగస్‌!

ఆంధ్రజ్యోతి(18-05-2021)

బ్లాక్‌ ఫంగస్‌! వంటింట్లో కుళ్లిపోయిన కూరగాయలు, బ్రెడ్‌ ముక్కల మీద పేరుకునే ఫంగస్‌ ఇది! వాతావరణంలో కలిసి ఉండే ఈ ఫంగస్‌ స్పోర్స్‌కు మన శరీరంలోకి చేరుకుని ఇన్‌ఫెక్షన్‌ను కలుగచేసేటంత శక్తి ఉండదు. అయితే కొవిడ్‌ విస్తరించి ఉన్న ప్రస్తుత సమయంలో కొన్ని అంశాలు ఈ ఫంగస్‌కు అనుకూలంగా పరిణమించాయి. ఎవరికి ఈ బ్లాక్‌ ఫంగస్‌ సోకే వీలుంది? ఆ మార్గాలను కనిపెట్టేదెలా? ఏ లక్షణాలను అనుమానించాలి? ఈ విషయాల పట్ల బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలో విశేష అనుభవమున్న డాక్టర్‌ మేఘనాథ్‌ వివరిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే...


బ్లాక్‌ ఫంగస్‌ అనే పేరున్న మ్యూకోర్‌మైకోసిస్‌ స్పోర్స్‌ గాల్లో కలిసి సంచరిస్తూ ఉంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించి ఇన్‌ఫెక్షన్‌ను కలుగజేయాలంటే, సదరు వ్యక్తి వ్యాధినిరోధకశక్తి విపరీతంగా దిగజారి ఉండాలి. అయితే కొవిడ్‌ సోకడం మూలంగా, చికిత్సలో భాగంగా స్టిరాయిడ్స్‌ వాడడం మూలంగా, స్టిరాయిడ్స్‌ వాడకంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం మూలంగా... కొవిడ్‌కు ముందు నుంచీ కొంత, కొవిడ్‌తో మరికొంత, కొవిడ్‌ చికిత్సలో వాడే స్టిరాయిడ్స్‌తో ఇంకొంత.... ఇలా మొత్తంగా కలిపి, ఇమ్యూనిటీ ప్రమాదకర స్థాయికి పడిపోతుంది. అయితే ఈ లెక్కన కొవిడ్‌ బారిన పడి కోలుకున్న ప్రతి ఒక్కరికీ ఈ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ కూడా సోకాలి. కానీ అలా జరగడం లేదు. కేవలం కొందరు కొవిడ్‌ బాధితుల్లోనే ఈ ఇన్‌ఫెక్షన్‌ కనిపిస్తోంది. ఇందుకు కారణాలు ఇవే!


దీర్ఘకాలిక రుగ్మతలు: రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక రుగ్మతల చికిత్సల్లో భాగంగా వాడే స్టిరాయిడ్‌ మందుల కారణంగా వ్యాధి నిరోధకశక్తి 30ు సన్నగిల్లి ఉంటుంది. ఈ కోవకు చెందిన వ్యక్తులకు కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకడం వల్ల వ్యాధినిరోధకశక్తి మరో 30ు బలహీనపడుతుంది. కొవిడ్‌ చికిత్సలో భాగంగా అదనంగా స్టిరాయిడ్స్‌ ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ ఇంకొంత తగ్గుతుంది. దీనికి తోడు చికిత్స ప్రభావంతో శరీర కణాల్లో మృత వైరస్‌ అవశేషాలు మిగిలిపోతాయి. ఇవి బ్లాక్‌ ఫంగస్‌ శరీరంలోకి చొరబడడానికి తోడ్పడతాయి. ఇలా దీర్ఘకాలిక రుగ్మతలు కలిగిన, కొవిడ్‌ చికిత్సలో భాగంగా స్టిరాయిడ్స్‌ తీసుకున్న వారి శరీరాల్లో బ్లాక్‌ ఫంగస్‌ పెరుగుదలకు అనుకూలమైన వాతావరణం చోటుచేసుకుని ఉంటుంది. 


హ్యుమిడిఫయర్‌: ఆక్సిజన్‌ థెరపీలో భాగంగా ఉపయోగించే హ్యుమిడిఫయర్స్‌లో శుభ్రమైన, స్టెరైల్‌ నీటిని వాడకపోవడం మూలంగా కూడా బ్లాక్‌ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉంది.


మధుమేహం: మధుమేహం సహజంగానే వ్యాధినిరోధకశక్తిని కొంతమేరకు కుంటుపరుస్తుంది. చికిత్సలో భాగంగా దీర్ఘకాలం వాడే స్టిరాయిడ్స్‌తో ఇమ్యూనిటీ సన్నగిల్లి ఉంటుంది. ఇలాంటి వారికి కొవిడ్‌తో, కొవిడ్‌ చికిత్సతో షుగర్‌ పెరిగి... ఇలా వ్యాధినిరోధకశక్తి ఆందోళనకర స్థాయికి దిగజారుతుంది. ఈ అంశాలన్నీ బ్లాక్‌ ఫంగస్‌ సోకడానికి మార్గాలను సులువు చేసేవే! కాబట్టే మిగతా వారితో పోలిస్తే, మధుమేహులు ఈ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి.


ఎలా ప్రవేశిస్తుంది?

మన శరీరంలో ప్రవేశించే ప్రతి శత్రువుకు ఒక మార్గం కావాలి. బ్లాక్‌ ఫంగస్‌కు ముక్కు ప్రధానమైన మార్గం. గాలిలో కలిసిన ఫంగస్‌ స్పోర్స్‌ శ్వాసతో పాటు ముక్కులోకి ప్రవేశిస్తాయి. చర్మం మీద పరుచుకునే స్పోర్స్‌ దెబ్బలు, గాయాలు, కోతల ద్వారా కూడా శరీరంలోకి ప్రవేశించే వీలుంది. ఐ.సి.ఎమ్‌.ఆర్‌ (ఇండియన్‌ కౌన్సెల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) ఈ ఫంగస్‌ శరీరంలోకి చేరుకునే వీలున్న అవకాశాల గురించి ఇలా చెబుతోంది....


అదుపు తప్పిన మధుమేహం

స్టిరాయిడ్స్‌ వాడకం మూలంగా వ్యాధి నిరోధకశక్తి సన్నగిల్లడం

దీర్ఘకాలం పాటు ఐసియు/ఆస్పత్రి చికిత్స

కొ మార్బిడిటీ (మధుమేహం, అధిక రక్తపోటు, ఇతరత్రా వ్యాధులు), అవయవ మార్పిడి చేయించుకున్న వాళ్లు, కేన్సర్‌ రోగులు

వోరికోనజోల్‌ థెరపీ (తీవ్రమైన ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌కు అందించే చికిత్స)


లక్షణాలు ఇవే!

సాధారణంగా చర్మపు ఇన్‌ఫెక్షన్‌ రూపంలో ముఖంలోని గాలి గదుల్లో మ్యుకోర్‌మైకోసిస్‌ మొదలవుతుంది. నుదురు, చెవులు, చెంపలు, కళ్ల మధ్య భాగం, దంతాల వెనక కపాలంలో ఉండే గాలి గదుల్లోకి ముక్కు ద్వారా ఈ ఫంగస్‌ చేరుకుంటుంది. ఆ ప్రదేశాల నుంచి కళ్లు, ఊపిరితిత్తులు, మెదడుకు పాకుతుంది. ప్రధానంగా కనిపించే లక్షణాలు...


విపరీతమైన తలనొప్పి 

దవడల నొప్పి

కళ్లు ఎర్రబడడం 

కళ్లు, ముక్కు దగ్గరి చర్మం వాచి, ఎర్రబడడం

డబుల్‌ విజన్‌

ముఖంలో నొప్పి

దగ్గినప్పుడు ముదురు రంగు ద్రవం వెలువడడం

శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది

ఈ లక్షణాలలో ఏది కనిపించినా వెంటనే ఇ.ఎన్‌.టి డాక్టర్‌ను సంప్రతించడం అవసరం. నాసల్‌ ఎండోస్కోపీ ద్వారా ఈ ఫంగస్‌ను తేలికగా గుర్తించే వీలుంది. తత్వం, తీవ్రతలను బట్టి చికిత్సతో బ్లాక్‌ ఫంగస్‌ను నయం చేసుకోవచ్చు.


నియంత్రణ ఇలా!

కొవిడ్‌ సోకిన సమయంలో స్టిరాయిడ్లు ఇస్తూ, లేదా ఇవ్వకుండా చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచడం

సరైన సమయంలో, సరైన మోతాదులో, పరిమిత కాలం పాటు స్టిరాయిడ్లను వాడడం

యాంటీ ఫంగల్స్‌, యాంటీ బయాటిక్స్‌ను విచక్షణతో వాడుకోవడం

ఆక్సిజన్‌ థెరపీలో ఉపయోగించే హ్యుమిడిఫయర్లలో శుభ్రమైన, స్టెరైల్‌ నీటిని వాడుకోవడం

కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత మరీ ముఖ్యంగా మధుమేహులు, క్రమం తప్పకుండా చక్కెర స్థాయిని పరీక్షించుకుంటూ ఉండడం

బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాల మీద ఓ కన్నేసి ఉండడం


హ్యుమిడిఫయర్ల వాడకం ఇలా... 

వీటిలో డిస్టిల్డ్‌ లేదా స్టెరైల్‌ నీళ్లు మాత్రమే వాడాలి. మరిగించని పంపు నీళ్లు, మినరల్‌ వాటర్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. మాగ్జిమం ఫిల్‌ లైన్‌కు 10 మిల్లీమీటర్ల దిగువ వరకే నింపుకోవాలి. రోజుకు రెండు సార్లు వాటర్‌ లెవల్‌ పరీక్షిస్తూ, అవసరమైనప్పుడు పరిమాణం పెంచుకుంటూ ఉండాలి. వారానికి ఒకసారి హ్యుమిడిఫయర్‌ విడి భాగాలను 30 నిమిషాల పాటు తేలికపాటి యాంటీసెప్టిక్‌ ద్రావణంలో నానబెట్టి, శుభ్రమైన నీళ్లతో కడిగి, ఆరబెట్టి వాడుకోవాలి. 


ఆ పేరు వెనక?

మ్యూకోర్‌మైకోసిస్‌ నిజానికి బ్లాక్‌ ఫంగస్‌ కాదు. నల్లని పిగ్మెంట్‌తో కూడిన గోడలు కలిగి ఉండే ఈస్ట్‌ను వైద్య పరిభాషలో బ్లాక్‌ ఫంగస్‌ అంటారు. కానీ మ్యుకోర్‌మైకోసిస్‌ అలా ఉండదు. కాకపోతే ఈ ఫంగస్‌ కణజాలానికి రక్తసరఫరాను అడ్డుకుని, నల్లగా మారుస్తుంది. కాబట్టి దీన్ని బ్లాక్‌ ఫంగస్‌ అని పిలుస్తున్నాం


చేయవలసినవి                                    

హైపర్‌గ్లైసీమియాను అదుపులో ఉంచుకోవాలి. 

కొవిడ్‌ - 19 నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత షుగర్‌ లెవల్స్‌ పరీక్షించుకుంటూ ఉండాలి

స్టిరాయిడ్లను అవసరం మేరకే వాడుకోవాలి.   

ఆక్సిజన్‌ థెరపీలో భాగంగా హ్యుమిడిఫయర్లలో శుభ్రమైన, స్టెరైల్‌ నీళ్లు వాడుకోవాలి. 


చేయకూడనివి

లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.

సమయం వృధా చేయకూడదు.

ఫంగస్‌ తత్వాన్ని పరీక్షించే పరీక్షలకు  వెనకాడకూడదు.   

కొవిడ్‌ చికిత్సలో భాగంగా కొవిడ్‌ బాధితులు, ముక్కు దిబ్బెడను సాధారణ బ్యాక్టీరియల్‌  సైనసైటిస్‌గా భావించకూడదు.

యాంటీబయాటిక్స్‌/యాంటీఫంగల్‌ మందులు ఆచితూచి వాడాలి.


-డాక్టర్‌ మేఘనాధ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మా ఇ.ఎన్‌.టి హాస్పిటల్‌ గ్రూప్‌, హైదరాబాద్‌

Updated Date - 2021-05-18T17:53:55+05:30 IST