నల్లబెల్లం రవాణా నేరంకాదు

ABN , First Publish Date - 2022-05-28T09:35:27+05:30 IST

నల్లబెల్లం రవాణా నేరంకాదు

నల్లబెల్లం రవాణా నేరంకాదు

జప్తు చేసిన బెల్లాన్ని విడుదల చేయండి

ఎస్‌ఈబీ అధికారులకు హైకోర్టు ఆదేశం 

అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): నల్లబెల్లం నిల్వ చేయడం, రవాణా చేయడం నేరంగా పరిగణించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఇదే విషయంపై న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేసింది. ప్రస్తుత కేసులో ఓ వ్యాపారి నుంచి జప్తు చేసిన 25,250 కేజీల నల్లబెల్లాన్ని విడుదల చేయాలని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎ్‌సఈబీ) అధికారులను ఆదేశించింది. బెల్లం విలువ మేరకు పూచీకత్తు సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. 25,250 కేజీల నల్లబెల్లాన్ని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఎస్‌ఈబీ అధికారులు సీజ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ వ్యాపారి వాసిరెడ్డి గంగరాజు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బెల్లం నిల్వ చేయడం, రవాణా చేయడం నేరం కాదని, బెల్లాన్ని జప్తు చేయడానికి వీల్లేదన్నారు. ప్రభుత్వ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. బెల్లం నిల్వ చేయడం, రవాణా చేయడం నేరంగా పరిగణించడానికి వీల్లేదన్న పిటిషనర్‌ వాదనతో ఏకీభవించారు. భారీగా నిల్వ చేసిన బెల్లాన్ని ఎక్కడ నుంచి తీసుకొచ్చారో చెప్పాలని అధికారులు కోరారని, ఇందుకు పిటిషనర్‌ సరైన జవాబు ఇవ్వలేదని తెలిపారు. సరైన ఆధారాలు చూపనందున బెల్లాన్ని సీజ్‌ చేశారన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. బెల్లం కొనుగోలుకు సంబంధించి ఆధారాలు చూపించేందుకు సిద్ధమన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి బెల్లం విడుదల చేయాలని తీర్పు చెప్పారు. దిగువకోర్టు ఇచ్చిన తుది తీర్పుకు లోబడి పూచీకత్తు సొమ్ము విడుదల వ్యవహారం ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. 


Updated Date - 2022-05-28T09:35:27+05:30 IST