టీఆర్‌ఎస్‌కు నల్లాల షాక్‌!

ABN , First Publish Date - 2022-05-20T08:16:10+05:30 IST

టీఆర్‌ఎ్‌సకు షాక్‌ తగిలింది. ఒకవైపు ‘గులాబీ’ నేతలు కాంగ్రె్‌సను చచ్చిన పాముతో పోల్చుతుంటే, మరోవైపు అదే కాంగ్రె్‌సలోకి అధికార పార్టీ నుంచి కీలక వలస చోటుచేసుకుంది.

టీఆర్‌ఎస్‌కు నల్లాల షాక్‌!

  • పార్టీని వీడిన ఓదెలు కుటుంబం
  • ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
  • ఆయన మాజీ ఎమ్మెల్యే, భార్య జడ్పీ చైర్‌పర్సన్‌
  • ‘అధికారం’ వదులుకొని వెళ్లడంపై సర్వత్రా చర్చ
  • అవమాన భారమే కారణమంటున్న సన్నిహితులు
  • జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న
  • సమయంలో సీఎం కేసీఆర్‌ ఊహించని పరిణామం
  • రాహుల్‌ పర్యటన తర్వాత టీఆర్‌ఎస్‌కు తొలి ఝలక్‌


న్యూఢిల్లీ/మంచిర్యాల/హైదరాబాద్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎ్‌సకు షాక్‌ తగిలింది. ఒకవైపు ‘గులాబీ’ నేతలు కాంగ్రెస్‌ను చచ్చిన పాముతో పోల్చుతుంటే, మరోవైపు అదే కాంగ్రెస్‌లోకి అధికార పార్టీ నుంచి కీలక వలస చోటుచేసుకుంది. టీఆర్‌ఎ్‌సకు చెందిన మంచిర్యాల జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి, ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఇద్దరు తనయులతో కలిసి పార్టీని వీడారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన దళిత నేత నల్లాల ఓదెలు ‘కారు’ దిగడం.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఊహించని పరిణామంగా భావిస్తున్నారు. వరంగల్‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సభ విజయవంతమైన ఊపులో ఉన్న కాంగ్రెస్‌.. ఈ చేరిక ద్వారా అధికార టీఆర్‌ఎ్‌సకు తొలి ఝలక్‌ ఇచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాక నల్లాల కుటుంబం అధికార పార్టీని వీడడం, జడ్పీ చైర్‌పర్సన్‌గా భాగ్యలక్ష్మికి ఇంకా రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉన్న సమయంలో కాంగ్రెస్‌లోకి వెళ్లడం రాజకీయంగానూ సంచలనం సృష్టించింది. తమకు టీఆర్‌ఎ్‌సలో ఎదురవుతున్న అవమాన భారాన్ని భరించలేకనే, నల్లాల కుటుంబం కాంగ్రెస్‌లోకి వెళ్లిందని వారి సన్నిహితులు చెబుతున్నారు.


వాస్తవానికి మలి దశ తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్‌ తరఫున  ఓదెలు క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీకి, అధినేత కేసీఆర్‌కు విధేయుడిగా ఉన్నారు. పార్టీ అభ్యర్థిగా 2009, 2014 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మధ్యలో..తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్‌ కోసం అధినేత కేసీఆర్‌ ఆదేశం మేరకు 2010లో రాజీనామా చేసి.. ఉప ఎన్నికలో తిరిగి గెలుపొందారు. అయినప్పటికీ, 2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో అనూహ్యంగా ఓదెలుకు చెన్నూరు నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కలేదు. ఓదెలు స్థానంలో బాల్క సుమన్‌కు టికెట్‌ కేటాయించారు.   ఓదెలు(మాదిగ)ను కాదని, నాన్‌-లోకల్‌, మాల సామాజిక వర్గానికి చెందిన సుమన్‌కు టికెట్‌ ఇవ్వటంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఓదెలును పార్టీ అధిష్ఠానం బుజ్జగించటంతో ఆయన సుమన్‌ గెలుపు కోసం పనిచేశారు. అయితే, 2018 ఎన్నికల్లో చెన్నూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా సుమన్‌ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకటేశ్‌ నేతను ఆరు నెలలు తిరగకుండానే, టీఆర్‌ఎ్‌సలో చేర్చుకొని లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి టికెట్‌ ఇచ్చి గెలిపించుకోవడం నల్లాల కుటుంబానికి మింగుడుపడలేదు. ఆ తర్వాత బుజ్జగింపు పర్వంలో భాగంగానే ఓదెలు భార్య భాగ్యలక్ష్మికి మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్‌గా పార్టీ అవకాశం కల్పించినా.. మంచిర్యాల జిల్లా అధ్యక్ష పదవి విషయంలో ఓదెలుకు మళ్లీ భంగపాటే ఎదురైంది. ఎమ్మెల్యే బాల్క సుమన్‌కే  పార్టీ జిల్లా అధ్యక్ష పదవి దక్కటంతో నల్లాల కుటుంబం మరింత నిరాశకు గురైనట్లు సమాచారం. 


ముందే తెలుసు: టీఆర్‌ఎస్‌ వర్గాలు

నల్లాల ఓదెలు టీఆర్‌ఎస్‌ను వీడుతారని తమకు ముందే తెలుసునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన తొలుత బీజేపీలో చేరాలని అనుకున్నప్పటికీ, ఆ పార్టీపై కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో వ్యతిరేకత ఉం డటంతో కాంగ్రెస్‌లో చేరారని.. విశ్లేషిస్తున్నాయి. 


ఉద్యమకారులకు అన్యాయం

మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న తనను కాదని వలస వచ్చిన వ్యక్తికి పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టడం, గతంలోనూ వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి ఎంపీ సీటు ఇవ్వడంతో తాను మనస్తాపానికి గురైనట్లు ఓదెలు వెల్లడించారు. ‘‘2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నాపై అపనమ్మకంతో టికెట్‌ ఇవ్వలేదు. అప్పటి నుంచి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారని ఆశించాం. నా సతీమణికి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవి ఇచ్చినప్పటికీ ప్రొటోకాల్‌ను పాటించడం లేదు. ఎమ్మెల్యే సుమన్‌ మమ్మల్ని వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మా ఇంటిపై నిఘా వేయడమే కాకుండా ఫోన్‌ను ట్యాప్‌ చేసి మా కుటుంబ సభ్యులను జైలుకు పంపిస్తానని బెదిరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న వారు ఈ రోజు టీఆర్‌ఎ్‌సలో కనిపించడం లేదు. వీటిని సహించలేకనే టీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రెస్‌లో చేరాను’’ అని వివరించారు. నల్లాల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తాము టీఆర్‌ఎ్‌సలో ఉండటం బాల్క సుమన్‌కు ఇష్టం లేదని ఆరోపించారు. పార్టీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నందునకాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు. తాను పార్టీ మారినందున జడ్పీ చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.


ఓదెలుకు సముచిత స్థానం: రేవంత్‌

ఓదెలు దంపతులకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తెలిపారు. పార్టీలో సీనియర్‌ నేతలకు ఇస్తున్న గౌరవం, మర్యాద.. ఓదెలు కుటుంబానికి ఉంటాయని ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీనే రాష్ట్ర సమస్యలు పరిష్కరిస్తారన్న విశ్వాసంతో ఓదెలు కాంగ్రెస్‌లో చేరారని తెలిపారు. నల్లాల భాగ్యలక్ష్మికి ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ, వరంగల్‌ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌పై పూర్తి విశ్వాసంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

Updated Date - 2022-05-20T08:16:10+05:30 IST