ముక్కు దగ్గర ఉండే బ్లాక్‌హెడ్స్ కనిపించకుండా పోవాలంటే..

ABN , First Publish Date - 2022-05-30T18:09:42+05:30 IST

ముక్కు దగ్గర ఉండే బ్లాక్‌హెడ్స్‌ ముఖారవిందాన్ని దెబ్బతీస్తుంటాయి. వీటిని తొలగించుకోవడానికి కొత్తిమీర, పసుపుతో చేసిన ఫేస్‌ప్యాక్‌ బాగా ఉపయోగపడుతుంది

ముక్కు దగ్గర ఉండే బ్లాక్‌హెడ్స్ కనిపించకుండా పోవాలంటే..

ఆంధ్రజ్యోతి(30-05-2022)

ముక్కు దగ్గర ఉండే బ్లాక్‌హెడ్స్‌ ముఖారవిందాన్ని దెబ్బతీస్తుంటాయి. వీటిని తొలగించుకోవడానికి కొత్తిమీర, పసుపుతో చేసిన ఫేస్‌ప్యాక్‌ బాగా ఉపయోగపడుతుంది. కొత్తిమీర ఒక కట్ట, రెండు టీ స్పూన్ల పసుపును తీసుకుని మిక్సీలో వేసి పేస్టులా తయారుచేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఈ ప్యాక్‌ని ముఖానికి పట్టించి ఉదయాన్నే చల్లటి నీటితో కడిగేసుకోవాలి. వారంలో రెండు రోజులు ఇలా చేస్తే ఒక్క బ్లాక్‌హెడ్‌ కూడా కనిపించదు. 


పొడి చర్మానికి...

డ్రైస్కిన్‌ ఉన్న వారు పెరుగు, శనగపిండితో చేసిన ప్యాక్‌ని వాడాలి. శనగపిండి క్లీన్సింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తే, పెరుగు మాయిశ్చర్‌ను అందిస్తుంది. ఈ ప్యాక్‌ ఎలా తయారుచేసుకోవాలంటే రెండు టేబుల్‌స్పూన్ల శనగపిండిలో ఒక టేబుల్‌స్పూన్‌ పెరుగు, ఒక టీస్పూన్‌ తేనె వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి పట్టించి కాసేపయ్యాక కడిగేసుకోవాలి.


మొటిమల మచ్చలు పోవాలంటే..

ముల్తానీ మట్టిలో మెగ్నీషియం క్లోరైడ్‌ ఉంటుంది. ఇది మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. రెండు టీస్పూన్ల ముల్తానీ మట్టిలో అర టీస్పూన్‌ గంధం, కొద్దిగా పసుపు, కాస్త నిమ్మరసం వేసి పేస్టులా చేసి ముఖానికి పట్టించాలి. బాగా ఆరిన తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.


స్కిన్‌ టోన్‌ పెరగాలంటే...

ముఖారవిందం పెరగాలంటే కుంకుమపువ్వుతో చేసిన ఫేస్‌ప్యాక్‌ వాడాలి. ఈ ప్యాక్‌తో  నల్లటి వలయాలు కూడా దూరమవుతాయి. నాలుగైదు కుంకుమపువ్వు రేకులు తీసుకుని రెండు టీస్పూన్ల నీళ్లలో నానబెట్టాలి. ఇలా రాత్రంతా నానబెట్టిన నీళ్లలో ఒక టీస్పూన్‌ పాలు, కొన్ని చుక్కల కొబ్బరినూనె వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరిన తరువాత కడిగేసుకోవాలి.


జిడ్డుచర్మమైతే...

చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించడంలో నిమ్మ బాగా పనిచేస్తుంది. తేనెలో యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీసెప్టిక్‌ గుణాలుంటాయి. ఇవి నూనె అధికంగా ఉత్పత్తి కావడాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల మొటిమల బాధ తగ్గిపోతుంది. ఒక చిన్నబౌల్‌లో నిమ్మరసం తీసుకుని తేనె కలిపి ముఖానికి అప్లై  చేసుకోవాలి. పావుగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. 

Updated Date - 2022-05-30T18:09:42+05:30 IST