పేలుడుతో దద్దరిల్లిన కాందహార్.. భారీగా ప్రాణనష్టం

ABN , First Publish Date - 2021-10-15T21:43:24+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా షియా ముస్లింలే లక్ష్యంగా ఉగ్రవాదులు

పేలుడుతో దద్దరిల్లిన కాందహార్.. భారీగా ప్రాణనష్టం

కాందహార్: ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా షియా ముస్లింలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. షియా ముస్లింలు ప్రార్థనలు నిర్వహించే మసీదుల్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడడం ద్వారా వందల సంఖ్యలో ప్రాణాలు తీస్తూ రక్తపాతం సృష్టిస్తున్నారు.


ఈ నెల 8న ఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌లో షియా ముస్లింలే లక్ష్యంగా ఓ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన నుంచి తేరుకోకముందే ఈసారి కాందహార్ బాంబు దాడితో దద్దరిల్లింది. దక్షిణ ప్రావిన్స్‌లోని పోలీస్ డిస్ట్రిక్ట్-1 (పీడీ-1) సమీపంలో ఇమామ్ బార్గా మసీదులో భారీ పేలుడు సంభవించింది.


ప్రార్థనల్లో ఉన్న ముస్లింలు ఈ పేలుడులో తునాతునకలైపోయారు. శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతుల సంఖ్యపై అధికారులు ఇప్పటి వరకు ఓ నిర్ధారణకు రాలేకపోతున్నారు. పేలుడుకు ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత ప్రకటించలేదు. 


Updated Date - 2021-10-15T21:43:24+05:30 IST