బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 ఉత్పత్తిని పునరుద్ధరించాలి

ABN , First Publish Date - 2022-08-18T06:11:40+05:30 IST

ర్కెట్‌లో ఉక్కు ఉత్పత్తులకు గిరాకీ వున్నప్పటికీ కావాలనే ఈ ఏడాది జనవరి నుంచి బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 ఉత్పత్తి నిలిపివేశారని, తక్షణమే ఈ ఉత్పత్తులను పునరుద్ధరించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు.

బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 ఉత్పత్తిని పునరుద్ధరించాలి

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు

కూర్మన్నపాలెం, ఆగస్టు 17: మార్కెట్‌లో ఉక్కు ఉత్పత్తులకు గిరాకీ వున్నప్పటికీ కావాలనే ఈ ఏడాది జనవరి నుంచి బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 ఉత్పత్తి నిలిపివేశారని, తక్షణమే ఈ ఉత్పత్తులను పునరుద్ధరించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి 552వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు అదానీ, అంబానీలను సీఎం జగన్‌ ఆహ్వానిస్తే స్వాగతిస్తామని, కానీ ఉక్కు కర్మాగారాన్ని వారికి అప్పగిస్తామంటే మాత్రం సహించేది లేదన్నారు. హిందూస్థాన్‌ జింక్‌, ఎయిర్‌ ఇండియా సంస్థలు ఈ కార్పొరేట్ల వల్లే నష్టపోయాయన్నారు. గత ఏడాది లాభాల్లో నడిచిన ఉక్కు పరిశ్రమను గత నాలుగు నెలల్లో రూ.400 కోట్ల పైచిలుకు నష్టం వచ్చేలా యాజమాన్యం ఉన్నతాధికారులతో చేయించిన విన్యాసాలు కార్మికులకు, ప్రజలకూ విధితమేనన్నారు. సరైన సమయంలో ఈ దౌర్భాగ్య ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ఉక్కు ఉద్యోగులు, బీఎఫ్‌ కార్మికులు పాల్గొన్నారు.

పోరాటమే ధ్యేయంగా కావాలి

ఉక్కుటౌన్‌షిప్‌: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, అందుకు పోరాటమే ధ్యేయంగా ఉక్కు ఉద్యోగులు ఆందోళనల్లో పాల్గొనాలని గుర్తింపు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ పిలుపునిచ్చారు. స్టీల్‌ ప్లాంట్‌లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 552 రోజులుగా కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో కనీసం చలనం లేదని, అందువల్ల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వీటిని పరిష్కరించేందుకు యాజమాన్యం ముందుకు రావాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేఎస్‌ఎన్‌ రావు, జె.రామకృష్ణ, రాజుబాబు, వై.శ్రీనివాసరావు, సీహెచ్‌ శ్రీనివాస్‌, జ్యోతిప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-18T06:11:40+05:30 IST