మూడు వాహనాలపై ముచ్చటగా..

ABN , First Publish Date - 2021-10-13T06:48:52+05:30 IST

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మంగళవారం స్వామివారు మూడు వాహనాలపై అనుగ్రహించారు.

మూడు వాహనాలపై ముచ్చటగా..
గజవాహనంపై మలయప్పస్వామి

 హనుమ, సర్వభూపాల, గజవాహనాలపై శ్రీవారి అనుగ్రహం

తిరుమల, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మంగళవారం స్వామివారు మూడు వాహనాలపై అనుగ్రహించారు. ఉదయం హనుమంత వాహనంపై, సాయంత్రం సర్వభూపాలవాహనంలో, రాత్రి గజవాహనంపై కొలువుదీరి దర్శనభాగ్యాన్ని కల్పించారు. రంగనాయక మండపంలో ఉత్సవమూర్తులను అలంకరించిన తర్వాత ఊరేగింపుగా కల్యాణోత్సవ మండపానికి తీసుకెళ్లి దివ్యప్రబంధం, వేదపారాయణం పఠనంతో పాటు మంగళవాయిద్యాల నడుమ హారతి, నైవేద్యం సమర్పించి వాహనసేవ వైదిక కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో రెండవ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్న క్రమంలో మరోసారి స్వర్ణరథ వైభవాన్ని భక్తులు చూసే అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికీ రథంపై గోవిందుడి వైభవాన్ని భక్తులందరూ చూసిన అనుభూతి కల్పించేందుకు టీటీడీ సర్వభూపాల వాహనంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని కొలువదీర్చారు. సర్వభూపాల వాహనం ముందు గుర్రాల బొమ్మలు, విశేష అలంకరణ చేసి సర్వరథం తరహాలో తీర్చిదిద్దారు. రాత్రి 7 గంటలకు గజవాహనంపై మలయప్పస్వామి దర్శనమిచ్చారు. జీయర్‌స్వాములు,టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు రాంభూపాల్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఏడవరోజైన బుధవారం ఉదయం 9 గంటలకు సూర్యప్రభ , రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవలు జరగనున్నాయి.





Updated Date - 2021-10-13T06:48:52+05:30 IST