కాగ్‌ కళ్లకు గంతలు!

ABN , First Publish Date - 2022-06-26T07:44:19+05:30 IST

కాగ్‌ కళ్లకు గంతలు!

కాగ్‌ కళ్లకు గంతలు!

ఖర్చుల్లో 18,644 కోట్లు తగ్గించి చూపిన సర్కారు

ఇందులో కేంద్ర పథకాల నిధులు కూడా..

వాటిని సస్పెన్స్‌ ఖాతాకు బదిలీ చేయాలన్న ఏజీ

ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ

49,000 కోట్ల అప్పు దాచే మాస్టర్‌ ప్లాన్‌ ఇది

ఇప్పటికి బయటపడింది 18,644 కోట్లు

కాగ్‌ తవ్వింది కొంతే.. తెలియాల్సింది ఎంతో

కార్పొరేషన్ల చాటున మరో 30,000 కోట్లు

ఆ వివరాలివ్వాలని 3 నెలలుగా కోరుతున్న కాగ్‌

అప్పులు, ద్రవ్యలోటు ఇలాగే తగ్గించారా బుగ్గన?

ప్రశ్నిస్తున్న పలువురు ఆర్థిక నిపుణులు


చంద్రబాబు హయాంతో పోల్చితే గత మూడేళ్లలో రాష్ట్రం చేసిన అప్పులు, ద్రవ్యలోటు.. రెండూ తక్కువేనని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సెలవిచ్చారు. అయితే.. ఈ ‘తగ్గుదల’ వెనుక జగనన్న మతలబును కాగ్‌ ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది. పీడీ ఖాతాలు, కార్పొరేషన్లను వాడుకుని ఖర్చులను తగ్గించి చూపుతూ.. మరిన్ని అప్పులు చేసే ఎత్తు వేసినట్టు తాజాగా కనుగొంది. ఇలా ఖర్చుల్లో రూ.18,644 కోట్లను తగ్గించి చూపినట్టు గుర్తించింది. కార్పొరేషన్‌ ద్వారా చేసిన ఖర్చులకు కాగ్‌ అడుగుతున్న లెక్కలు కూడా అందితే.. ఈ ఖర్చు మరింత పెరుగుతుంది. వాటన్నింటినీ కలిపితే 1.74 లక్షల కోట్లుగా చూపించిన వ్యయం.. రూ.రెండులక్షల కోట్లు దాటిపోతుంది. ఆ మేరకు అప్పులు, ద్రవ్యలోటు... రెండూ పెరిగిపోతాయి. దీంతో.. ‘అప్పులు, లోటును తగ్గించేది ఇలాగేనా బుగ్గనా!’ అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

(అమరావతి, ఆంధ్రజ్యోతి)

జరిగిపోయిన ఖర్చులు, అప్పులు వీలైనంత మేర తగ్గించి చూపించుకోవాలనుకుంటున్న జగన్‌ సర్కారు అంకెల మాయాజాలానికి కాగ్‌ చిన్న బ్రేక్‌ వేసింది. జరిగిపోయిందంటూ చెప్పిన రూ.18,644 కోట్ల ఖర్చును మళ్లీ ఎందుకు పీడీ ఖాతాల నుంచి మైనస్‌ చేశారని ప్రశ్నిస్తూ ఏజీ కార్యాలయం... రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. తక్షణమే ఆ మొత్తాలను సస్పెన్స్‌ ఖాతాలోకి బదిలీ చేయాలని కోరింది. ఇందులో కేంద్ర పథకాల నిధులు, ఆ పథకాలకు సంబంధించి రాష్ట్రం వాటా, ఇంకా ఇతర నిధులు ఉన్నట్టు ఏజీ కార్యాలయం గుర్తించింది. జగన్‌ సర్కార్‌ ఈ నిధులను మైనస్‌ చేయడం వల్ల 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం ఖర్చు రూ.1,74,750 కోట్లుగా కాగ్‌ తన ప్రాథమిక నివేదికలో ప్రచురించింది. కానీ, ఇప్పుడు వాటిని ప్రభుత్వం దాచినట్టు ఏజీ కార్యాలయం గుర్తించింది కాబట్టి వాటిని కూడా మొత్తం ఖర్చులో కలుపుతారు. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తం ఖర్చు రూ.1,93,394 కోట్లకు చేరుకుంటుంది. అంటే ఆ మేర ప్రభుత్వం చేసిన అప్పులు కూడా పెరుగుతాయి. ఆర్థిక సంవత్సరం ముగిేసనాటికి పీడీ ఖాతాల్లో ఉన్న బ్యాలెన్స్‌ ప్రభుత్వ అప్పుగా పరిగణిస్తారు. ఆయా శాఖలకు, సంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తాన్ని పీడీఖాతాల్లో ఉన్న బ్యాలెన్స్‌ సూచిస్తుంది. అంటే అది ప్రభుత్వానికి ఉన్న అప్పుగా లెక్కేస్తారు. వీటన్నింటినీ అప్పుల్లో కలిపితే మళ్లీ కొత్త అప్పులు పుట్టవన్న ఉద్దేశంతో జగన్‌ ప్రభుత్వం పీడీ ఖాతాల్లో ఉన్న బ్యాలెన్సులను వీలైనంత వరకు మైనస్‌ చేేససి ఆ మేర అప్పులు తగ్గించి చూపే ప్రయత్నం చేసింది. కానీ కాగ్‌ దగ్గర దొరికిపోయింది. 


దాచివేతకు మాస్టర్‌ప్లాన్‌...

2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ.49,000 కోట్ల అప్పును దాచేసి, ఆ మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా మళ్లీ అప్పు చేయాలని జగన్‌ ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. ఇందులో భాగంగానే పబ్లిక్‌ డెట్‌ కింద చేసిన రూ.55,000 కోట్ల అప్పులో రూ.30,000 కోట్లు దాచేసి ఏజీకి కేవలం రూ.25,000 కోట్లు అప్పు చేసినట్టు మాత్రమే పంపారు. దాన్నే కాగ్‌ తన ప్రాథమిక నివేదికలో ప్రచురించింది. అలాగే, గత ఆర్థిక సంవత్సరంలో వివిధ కార్పొరేషన్ల నుంచి తెచ్చిన రూ.30,000 కోట్ల అప్పును అసలు చూపలేదు. దీనిపై ఏజీ కార్యాలయం ఎన్ని లేఖలు రాసినా ప్రభుత్వం సమాధానం ఇవ్వడం లేదు. దీంతో కార్పొరేషన్‌ అప్పులకు సంబంధించి ప్రభుత్వం ఇంకా సమాధానం ఇవ్వలేదని.. దాని కోసం ఎదురుచూస్తున్నామని కాగ్‌ తన నివేదికలో రాసుకుంది. ఇప్పుడు తాజాగా బయటపడిన రూ.18,644 కోట్ల ఖర్చుతో కలిపి ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,93,394 కోట్ల ఖర్చు చేసినట్టు అర్థమవుతోంది. ఈ మొత్తానికి ప్రభుత్వం కార్పొరేషన్ల మాటున అప్పు తెచ్చి చేసిన ఖర్చు రూ.30,000 కోట్లు కూడా కలిపితే ఆ ఏడాది ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు రూ.2,23,394 కోట్లకు చేరుతుంది. కానీ, 2021-22లో రాష్ర్టానికి వచ్చిన ఆదాయం రూ.1.50,000 కోట్లు మాత్రమే. కానీ, ఖర్చు దానిని దాటిపోయింది. ఆదాయం, ఖర్చుకి మధ్య రూ.73,394 కోట్ల వ్యత్యాసం ఉంది. అంటే ఈ మొత్తాన్ని ప్రభుత్వం అప్పుగా తెచ్చింది. కానీ, కాగ్‌ నివేదికలో 2021-22లో కేవలం రూ.25,000 కోట్ల అప్పు మాత్రమే తెచ్చామని ప్రభుత్వం చూపించింది. అంటే రూ.48,394 కోట్ల అప్పును దాచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మొత్తం ఖర్చు రూ.2,23,394 కోట్లలో అప్పుల రీపేమెంట్‌కి రూ.15,000 కోట్లు, పెట్టుబడి వ్యయం కింద రూ.18,000 కోట్లు ఖర్చు చేశారు. కాబట్టి గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.40,394 కోట్లుగా ఉండే అవకాశాలున్నాయి. అలాగే, ద్రవ్యలోటు రూ.73,394 కోట్లుగా ఉంటుంది. కానీ, జగన్‌ సర్కార్‌ తన మాయలెక్కలతో దాదాపు రూ.48,000 కోట్ల అప్పులను దాచేసి ఆ మేర రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు తగ్గించి చూపించుకుని, కొత్త అప్పులకు మార్గం సుగమం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. 


శ్వేతపత్రం విడుదల చేస్తారా ?

జగన్‌ సర్కారు చేస్తున్న అప్పులు, ఈ ఏడాది కాగ్‌కి పంపిస్తున్న తప్పుడు లెక్కలపై పలు వివాదాలు ముసురుకుంటున్న నేపథ్యంలో... అప్పులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తుంది అన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే జగన్‌ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అప్పటి అప్పులపై, గత ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా చేస్తారేమోనని అంతా భావిస్తున్నారు. అయితే, ప్రభుత్వం తాను తగ్గించి చూపిస్తున్న అప్పులతో శ్వేతపత్రం విడుదల చేసి రాష్ర్టానికి, వివిధ కార్పొరేషన్లకు అప్పులిచ్చిన బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, నాబార్డు, ఈఏపీ రుణాలిప్పించిన కేంద్రం, అప్పులిప్పించిన ఆర్‌బీఐ నుంచి ఆ శ్వేతపత్రానికి ఆమోదం తీసుకోగలరా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తగ్గించి చూపించిన అప్పుల జాబితాలో ఆర్‌బీఐ ఇప్పించిన అప్పులు, కార్పొరేషన్లకు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇచ్చిన అప్పులు ఉన్నాయి. కాబట్టి వారు ఇచ్చిన అప్పులను తగ్గించి చూపిేస్త ఆయా సంస్థలు ఊరుకుంటాయా? 2021-22లో తమ ప్రభుత్వం చేసిన అప్పులు ఇవే అంటూ కాగ్‌కి పంపిన అప్పుల జాబితానే ఈ సంస్థలకూ పంపి జగన్‌ సర్కారు ఆమోదం పొందగలదా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. 

Updated Date - 2022-06-26T07:44:19+05:30 IST