Blinkit: రూ. 2 ప్రింట్ అవుట్‌కి 9 రూపాయలు ప్లస్ డెలివరీ చార్జీలు కూడానా?: ఇదెక్కడి విడ్డూరం

ABN , First Publish Date - 2022-08-22T01:26:40+05:30 IST

గ్రోసరీ, గూడ్స్ డెలివరీ యాప్ బ్లింకిట్ (Blinkit) తాజాగా గురుగ్రామ్‌లో ప్రింటవుట్ సర్వీసులు ప్రారంభించింది.

Blinkit: రూ. 2 ప్రింట్ అవుట్‌కి 9 రూపాయలు ప్లస్ డెలివరీ చార్జీలు కూడానా?: ఇదెక్కడి విడ్డూరం

గురుగ్రామ్: గ్రోసరీ, గూడ్స్ డెలివరీ యాప్ బ్లింకిట్ (Blinkit) తాజాగా గురుగ్రామ్‌లో ప్రింటవుట్ సర్వీసులు ప్రారంభించింది. సాధారణంగా రోడ్ సైడ్ జిరాక్స్ షాపుల్లో ఒక్కో ప్రింటవుట్‌కు 2 రూపాయలు, రెండు వైపులా అయితే మూడు రూపాలయలు, లేదంటే నాలుగు రూపాయలు తీసుకుంటారు. కానీ ఈ స్టార్టప్ మాత్రం ఒక పేజీకి ఏకంగా రూ. 9, కలర్‌ ప్రింట్‌కు అయితే రూ. 19గా పేర్కొంది. ఇక్కడితో అయిపోలేదు, ప్రతి ప్రింటింగ్ ఆర్డర్‌కు డెలివరీ చార్జీలుగా రూ. 25 వసూలు చేయనున్నట్టు పేర్కొంది. స్కూల్, కాలేజీ సమయాల్లో వీధుల్లోని జిరాక్స్ సెంటర్‌లో జిరాక్స్ తీయించుకున్న వారిని బ్లింకిట్ చార్జీలు షాకింగ్‌కు గురి చేస్తాయనడంలో ఎలాంటి  సందేహం లేదు. అయితే, నెటిజన్లు మాత్రం ఈ చార్జీల విషయంలో మిశ్రమంగా స్పందిస్తున్నారు.  


జొమాటో‌కు చెందిన బ్లింకిట్ తాజా సర్వీసులపై నెటిజన్లలో కొందరు కామెంట్లతో విరుచుకుపడుతుంటే మరికొందరు మాత్రం స్వాగతిస్తున్నారు. రెండు వైపులా ప్రింటింగ్‌కు స్థానికంగా ఉండే జిరాక్స్ సెంటర్లు రెండుమూడు రూపాయలు వసూలు చేస్తున్నాయని, బ్లింకిట్ చార్జీలు చాలా దారుణంగా ఉన్నాయని అంటున్నారు. అధిక ధరల కారణంగా ఈ సర్వీసు సక్సెస్ కాబోదని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దీనిని కూడా సర్వీస్ అంటారా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. దీని కంటే లాండ్రీ చాలా చవక అని చెబుతున్నారు. 11 నిమిషాల్లోనే ప్రింటవుట్లను డెలివరీ చేస్తామని బ్లింకిట్ చెబుతోందని, అత్యవసరం అయిన వారికి ఇది చాలా చవకైన మార్గమని మరికొందరు అంటున్నారు. 

Updated Date - 2022-08-22T01:26:40+05:30 IST