ఢిల్లీ దిగ్బంధం

ABN , First Publish Date - 2020-12-03T07:25:51+05:30 IST

సాగు చట్టాలపై ఆగ్రహంతో కదం తొక్కిన రైతులు దేశ రాజధానిని దిగ్బంధం చేశారు. ఎటు చూసినా రైతులే. ఒక ప్రవాహంలా ఢిల్లీకి చేరుకుంటున్నారు.

ఢిల్లీ దిగ్బంధం

5 సరిహద్దుల మూసివేత..

వేలాదిగా యూపీ నుంచి రైతుల చేరిక.. 

చట్టాల్ని రద్దు చేయాల్సిందే


తక్షణమే పార్లమెంట్‌ సమావేశం నిర్వహించాలి

ఇదే చివరి అవకాశం.. ప్రభుత్వానికి రైతు నేతల హెచ్చరిక

35 రైతు సంఘాల చర్చ.. చట్టాలపై అభ్యంతరాల విశదీకరణ

ఆందోళనలో పాల్గొంటున్నది పంజాబ్‌ రైతులొక్కరే కాదు

చీలికకు యత్నించొద్దు.. అన్ని రాష్ట్రాల రైతుల్నీ పిలవాలని డిమాండ్‌

పంజాబ్‌ సీఎంతో నేడు షా భేటీ.. రైతులతో మరో దఫా చర్చలు


న్యూఢిల్లీ, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): సాగు చట్టాలపై ఆగ్రహంతో కదం తొక్కిన రైతులు దేశ రాజధానిని దిగ్బంధం చేశారు. ఎటు చూసినా రైతులే. ఒక ప్రవాహంలా ఢిల్లీకి చేరుకుంటున్నారు. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని అనేక జిల్లాల నుంచి రైతులు ఢిల్లీ పొలిమేరలకు వచ్చారు. ఇప్పటికే చేరుకున్న లక్షల మందికి తోడు వీరంతా వచ్చి చేరడంతో ఢిల్లీ చుట్టుపక్కలంతా ఎటు చూసినా అన్నదాతలే. వారి నిరసన హోరే వినిపిస్తోంది. ట్రాక్టర్లు, ట్రాలీల్లో నిత్యావసరాల్ని తెచ్చుకుని రోడ్లపైనే బైఠాయించారు. పరిస్థితి మరింత తీవ్రంకావడంతో కేంద్రం పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ను సంప్రదించింది. రైతులతో గురువారం ఉదయం మరో దఫా చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా..  అమరీందర్‌ సింగ్‌తో సమావేశం కానున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఉదయం 9-30కి ఈ సమావేశం జరగనుంది.


ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నది ఎక్కువగా పంజాబీ రైతునేతలే కావడంతో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. చేసిన చట్టాలను రద్దు చేయడానికి ససేమిరా అంటున్న కేంద్రం ఈ ప్రతిష్టంభనను వీడేందుకు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రమైన పంజాబ్‌తో మంతనాలు సాగించడం విశేషం. కాగా ఇప్పటిదాకా హరియాణా వైపు నున్న సంఘూ, టిక్రీ సరిహద్దు పాయింట్ల వద్దే ఎక్కువమంది రైతులుండడంతో అక్కడ రహదార్లను మూసేశారు. తాజాగా- పశ్చిమ యూపీ జిల్లాలు- మీరట్‌, ఫిరోజాబాద్‌, ఇటావా, నొయిడాల నుంచి వేలమంది ట్రాక్టర్లలో రావడంతో నొయిడా లింక్‌రోడ్డు దారితీసే చిలియా సరిహద్దును కూడా మూసేయాల్సి వచ్చింది. వీటికి తోడు గుర్గాం-ఢిల్లీలను కలిపే రెండు సరిహద్దు పాయింట్లు- ఝజ్జర్‌- బహదూర్‌గఢ్‌లను మూసివేశారు. గాజీపూర్‌వైపూ ఇదే పరిస్థితి. దీంతో దేశరాజధానికి దారితీసే ఐదు ప్రధాన రహదారులను మూసేసినట్లయింది. ఘజియాబాద్‌, ఝరోడా, ఝతిక్డా, ఔచండీ మార్గాల్లో రాకపోకలను ఆపేశారు.


ఎన్‌హెచ్‌-24, డీఎన్‌డీ (ఢిల్లీ నొయిడా ఎక్స్‌ప్రెస్‌  హైవే)లను,  హరియాణ వైపుకు వెళ్లే ధన్సా, దౌరాలా, ఎన్‌హెచ్‌-8లను మాత్రమే ఉపయోగించండని ట్రాఫిక్‌ పొలీస్‌ పదేపదే విజ్ఞప్తులు చేస్తున్నారు. రైతుల ఆందోళనవల్ల ఢిల్లీకి చేరే రూట్లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. పోలీసుల బ్యారికేడ్లు, ఇనుప కంచెలు, ఆఖరికి సిమెంటు దిమ్మలు కూడా ఏర్పరిచి అన్నదాతలు ముందుకుపోకుండా నిలువరిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌, ఇండోర్‌ల నుంచి కూడా రైతులు ఢిల్లీకి బయల్దేరడంతో మున్ముందు పరిస్థితిని అదుపు చేయడం కష్టమవుతుందని పోలీస్‌ అధికారులు అంటున్నారు.


చీలికకు యత్నాలు: రైతునేతలు

 ప్రభుత్వంతో జరిగిన ఓ దఫా చర్చలు అసంపూర్తిగా ముగియడం, గురువారంనాడు మరోమారు చర్చలు జరగనుండడంతో అందులో ఏం తేల్చుకోవాలన్న విషయమై 35 రైతు సంఘాల నేతలు సింఘూ సరిహద్దు వద్ద సమావేశమై చర్చించారు. ప్రభుత్వం చేసిన సాగుచట్టాలపై తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఇవ్వాల్సిందిగా వ్యవసాయశాఖ కోరడంతో- ఆ చట్టాల్లోని ఒక్కో పాయింట్‌ మీదా తమ వైఖరిని రైతులు విశదీకరించారు. నిజానికి తమ అభ్యంతరాలను అక్టోబరు 2నే ప్రభుత్వానికి అందజేశారు. గురువారం మరోమారు వాటినే అందజేస్తారు.  ’కేవలం పంజాబ్‌కు చెందిన రైతులే ఇందులో పాల్గొంటున్నారని అంటున్నారు. ఇది తప్పు. అన్ని రాష్ట్రాల రైతు సంఘాల నేతలనూ చర్చలకు పిలవాలని మేం డిమాండ్‌ చేస్తున్నాం. మాలో చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది.’’ అని క్రాంతికారీ కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ దర్శన్‌పాల్‌ పేర్కొన్నారు. డిసెంబరు 5న దేశవ్యాప్త నిరసనకు పిలుపునిస్తున్నట్లు ప్రకటించిన ఆయన- ఆ రోజున ప్రతీ రాష్ట్రంలో రైతు సంఘాలు నరేంద్ర మోదీ ప్రభుత్వ దిష్టిబొమ్మలను, కార్పొరేట్ల దిష్టిబొమ్మలను తగలెట్టాలని కోరారు.


3వ తేదీ సమావేశం ప్రభుత్వానికి ఓ ఆఖరి అవకాశమని, చట్టాల్ని ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ప్రభుత్వం కూలిపోతుందని మహారాష్ట్ర లోక్‌సంఘర్ష్‌ మోర్చా నేత ప్రతిభా షిండే హెచ్చరించారు. అటు ప్రభుత్వం తరఫున హోంమంత్రి అమిత్‌ షా నివాసంలో వ్యవసాయమంత్రి నరేంద్ర తోమర్‌, వాణిజ్య-రైల్వే శాఖ మంత్రి పీయూశ్‌ గోయెల్‌, జేపీ నడ్డా సమావేశమయ్యారు. 3వ తేదీ సమావేశంలో అనుసరించబోయే వ్యూహాన్ని చర్చించారు. రైతుల ఆందోళనపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, అమరీందర్‌ మధ్య వాగ్యుద్ధం నడిచింది. అరవింద్‌ కేజ్రీవాల్‌ బీజేపీ చెప్పినట్లు వ్యవహరిస్తున్నారని అమరీందర్‌ దుయ్యబట్టారు. ఇక హరియాణలో బీజేపీ ప్రభుత్వానికి మద్ధతిస్తున్న ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు. 


సీఎంల కీచులాట

రైతుల ఆందోళన సీఎంల మధ్య మాటలయుద్ధానికి దారితీస్తోంది. రెండ్రోజుల కిందట హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టార్‌ పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌తో ఘర్షణ పడగా- తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, అమరీందర్‌ మధ్య వాగ్యుద్ధం నడిచింది. అరవింద్‌ కేజ్రీవాల్‌ బీజేపీ చెప్పినట్లు వ్యవహరిస్తున్నారని, రైతుల క్షేమానికి ప్రయత్నించి ఉండాల్సిందని, రహస్యంగా, అన్నాయంగా మాట్లాడుతున్నారని అమరీందర్‌ దుయ్యబట్టారు. దీనికి కౌంటర్‌ ఇచ్చిన కేజ్రీవాల్‌- ఢిల్లీ స్టేడియాలను రైతుల ప్రదర్శనలకు అనుమతిచ్చేందుకు ఒప్పుకోనందుకే ఇలా మాట్లాడుతున్నారని, ఢిల్ల మైదానాలు జైళ్లలా మార్చడానికి తనకు ఇష్టం లేదని, అమరీందర్‌ ఇంత దిగజారి మాట్లాడతారనుకోలేదని దుయ్యబట్టారు.  


8 నుంచి ట్రక్కుల సమ్మె

రైతులకు సంఘీభావంగా ఈ నెల 8 నుంచి సమ్మెకు దిగుతున్నట్లు అఖిల భారత మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌ (ఏఐఎంటీసీ) ప్రకటించింది. ‘‘ఆందోళనల వల్ల ఇప్పటికే ఉత్తర భారతావనికి భారీగా సరుకు రవాణా దెబ్బతింది. యూపీ, పంజాబ్‌, హరియాణా, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్లకు కూరగాయలు, సరుకుల రవాణాకు ఆటంకం కలుగుతోంది. అయినప్పటికీ 65ు లారీలు వీటిని తీసుకెళ్లేట్లు చూస్తున్నాం. 8 లోగా కేంద్రం రైతు ఆందోళనలను పరిష్కరించకపోతే మేమూ రవాణాను నిలిపేస్తాం. మొదట ఉత్తరభారతంతో ఆరంభించి దేశమంతా సమ్మె కొనసాగేట్లు చేస్తాం’’ అని ఏఐఎంటీసీ నేత కుల్తారన్‌ సింగ్‌ అత్వాల్‌ వెల్లడించారు. కూరగాయలు, పళ్లు ఏరోజుకారోజు సరఫరా కావాలని, మందులూ అత్యవసరమేనని అన్నారు. 

Updated Date - 2020-12-03T07:25:51+05:30 IST