ఆపద్బాంధవులు

ABN , First Publish Date - 2021-07-25T04:52:22+05:30 IST

శాంతిభద్రతల పరిరక్షణలోనే కాదు.. ఆపదలోనూ అండగా ఉంటామని చాటి చెబుతున్నారు సిద్దిపేట జిల్లా పోలీసులు. ప్రమాదాల్లో గాయపడినా, అత్యవసర సమయాల్లో రక్తం కావాలంటే మేమున్నామంటూ ముందుకొస్తున్నారు. అన్నిదానాల కన్నా రక్తదానం మిన్న అంటూ ఎంతోమంది ప్రాణాలకు ఊపిరిపోస్తున్నారు. వీరి సేవలకు ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.

ఆపద్బాంధవులు

రక్తదానంలో పోలీసుల ఔదార్యం

అత్యవసర సమయంలో ఆసరాగా నిలుస్తూ..

రక్తదాతలుగా మారిన 292 మంది ఖాకీలు

కరోనా రోగులకూ ఊతంగా 50 మంది ప్లాస్మాదానం

ఆదర్శంగా సిద్దిపేట జిల్లా పోలీసులు


‘మిరుదొడ్డి మండలం మోతె గ్రామానికి చెందిన ఐదునెలల పసిపాప సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతుండగా అత్యవసరంగా ఏబీ పాజిటివ్‌ బ్లడ్‌ అవసరం పడింది. వెంటనే సీపీ ఆఫీస్‌ పీఆర్వో, హెడ్‌కానిస్టేబుల్‌ మల్లికార్జున్‌రెడ్డి, సిద్దిపేట ఏసీపీ గన్‌మెన్‌, కానిస్టేబుల్‌ శ్రీనివా్‌సలు స్పందించి రెండు యూనిట్ల రక్తం ఇచ్చి ఆ పాపను రక్షించారు.’

శాంతిభద్రతల పరిరక్షణలోనే కాదు.. ఆపదలోనూ అండగా ఉంటామని చాటి చెబుతున్నారు సిద్దిపేట జిల్లా పోలీసులు. ప్రమాదాల్లో గాయపడినా, అత్యవసర సమయాల్లో రక్తం కావాలంటే మేమున్నామంటూ ముందుకొస్తున్నారు. అన్నిదానాల కన్నా రక్తదానం మిన్న అంటూ ఎంతోమంది ప్రాణాలకు ఊపిరిపోస్తున్నారు. వీరి సేవలకు ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జూలై 24 : సిద్దిపేట జిల్లాలో రెండేళ్ల నుంచి పోలీస్‌ అధికారులు, సిబ్బంది రక్తదానంపై దృష్టి పెట్టారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలుస్తున్నారు. రక్తదానం, ప్లాస్మాదానం, ప్లేట్‌ లెట్లను దానం చేయడంలో పోటీపడుతున్నారు. ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో రక్తం కావాలంటే పోలీసులకే ముందుగా సమాచారం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.


292 మంది రక్తదాతలు

రక్తదానం చేయాలంటే చాలామంది వెనుకాముందు ఆలోచిస్తుంటారు. కానీ వీరు మాత్రం నిరంతరం సిద్ధంగానే ఉంటున్నారు. ఒకరిని చూసి ఒకరు రక్తం ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. గడిచిన రెండేళ్లలో జిల్లాలోని అన్ని పోలీ్‌సస్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 292 మంది పోలీసులు రక్తదానం చేశారు. ఎంతోమంది ప్రాణాలను రక్షించారు. ఇందులో ఐదుసార్లకుపైగా రక్తదానం చేసిన వారు 30 మంది ఉన్నారు. సిద్దిపేట జిల్లాలోనే కాదు. చుట్టుపక్కల జిల్లాల్లోనూ రక్తం అవసరం ఉన్నదంటే పరుగులు పెడుతున్నారు. 


కరోనా బాధితులకు ప్లాస్మాదానం..

ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైర్‌సను నియంత్రించడంలోనూ వీరి పాత్ర అనిర్వచనీయం. ఓ వైపు లాక్‌డౌన్‌ను పర్యవేక్షిస్తునే మరోవైపు పరిస్థితి విషమంగా ఉన్న కరోనా బాధితులకు ప్లాస్మాదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఇప్పటివరకు జిల్లాలోని 50 మంది పోలీసులు ప్లాస్మాతోపాటు ప్లేట్‌ లెట్లు కూడా దానం చేశారు. ఓ వైపు ఆస్పత్రుల్లో ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పటికీ.. సహసం చేసి ప్లాస్మాదానం చేశారు. ఇప్పటికి కూడా ఎవరికైనా ప్లాస్మా అవసరం ఉంటే సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. 


50 సార్లు రక్తదానం చేశాను

రక్తదానం అనేది నా జీవితంలో ఒక భాగమైంది. అందుకే ఇప్పటికి 50 సార్లు రక్తదానం చేశాను. కరోనా సమయంలో 5 సార్లు బాధితులకు ప్లాస్మా ఇచ్చాను. 12 సార్లు ప్లేట్‌లెట్స్‌ దానం చేశాను. రక్తం కోసం చాలా ఇబ్బందులు పడుతుంటారు. 2012లో మా నాన్న సర్జరీ విషయంలోనూ రక్తం కావాల్సి వస్తే మా బంధువులు, మిత్రులు ముందుకొచ్చారు. అప్పటి నుంచి నేను కూడా ఎవరికి అవసరం పడినా రక్తదానం చేస్తాను. ఇతర జిల్లాల్లో కూడా రక్తం ఇచ్చాను. నా భార్య రేఖా ప్రియదర్శిని 8 సార్లు రక్తం ఇచ్చింది. 

-శేఖర్‌, కానిస్టేబుల్‌, రాయపోల్‌ పీఎస్‌ 


ఓ ప్రాణాన్ని రక్షించామనే తృప్తి చాలు

నేను ఇప్పటికి నాలుగుసార్లు రక్తదానం చేశాను. మొన్నటి లాక్‌డౌన్‌లో ఓ వ్యక్తికి అత్యవసరంగా బ్లడ్‌ రీప్లేస్‌ చేయాల్సి రాగా, ఆ సమయంలో ఆస్పత్రుల్లోకి వెళ్లాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ విషయం నాకు తెలియడంతో వెంటనే వెళ్లి రక్తదానం చేశాను. ఓ ప్రాణాన్ని రక్షించామనే తృప్తి జీవితాంతం ఉంటుంది. ప్రజలతో మమేకమై విధులు నిర్వహించాలని, ఆపదలో అండగా ఉండాలని మా సీపీ సార్‌ చెబుతుంటారు. మమ్మల్ని చూసి చాలా మంది రక్తదానానికి ముందుకొస్తున్నారు. 

- స్వాతి, హెడ్‌కానిస్టేబుల్‌, సీసీఆర్‌బీ  


సామాజిక బాధ్యత ఉండాలి

పోలీసుగా వృత్తి నిర్వహణతోపాటు సామాజిక బాధ్యత కూడా అవసరం. పోలీసులను చాలామంది గ్రహిస్తుంటారు. అందుకే ప్రతీ పోలీస్‌ ఒక రోల్‌మాడల్‌గా ఉండాలని సామాజిక సేవపై దృష్టి పెట్టాం రక్తదానం, ప్లాస్మాదానం, అవయవ దానాల్లో మా పోలీసులు ఆదర్శంగా నిలుస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఎంతోమంది ప్రాణాలకు రక్షణగా నిలబడి యువతకు, ఇతర ప్రజల్లోనూ సేవాభావాన్ని పెంపొందిస్తున్నారు. శాంతిభద్రతలు, సామాజిక బాధ్యత రెండు కళ్ల లాంటివి. 

-జోయల్‌ డేవిస్‌, సీపీ, సిద్దిపేట


Updated Date - 2021-07-25T04:52:22+05:30 IST