నెత్తురోడుతున్న రహదారులు

ABN , First Publish Date - 2022-05-21T05:29:42+05:30 IST

రహదారులు నెత్తురోడుతున్నాయి. ముఖ్యంగా పడమటి ప్రాంత మండలాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

నెత్తురోడుతున్న రహదారులు
150వ మైలు వద్ద జరిగిన ప్రమాదంలో మృతిచెందిన జగదీష్‌ (ఫైల్‌ ఫొటో)

పడమట పెరిగిన రోడ్డు ప్రమాదాలు

వారంరోజుల్లో 10 మంది మృతి

పలువురికి గాయాలు..ఆగని ప్రమాదాలు


మదనపల్లె క్రైం, మే 20: రహదారులు నెత్తురోడుతున్నాయి. ముఖ్యంగా పడమటి ప్రాంత మండలాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వారం రోజుల్లో ఆరు ప్రమాదాలు జరిగి 10 మంది మృతి చెందగా, మరి కొందరు గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని జనం ఆందోళన చెందుతున్నారు.  కాగా అతివేగం, ఓవర్‌లోడు, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, రోడ్లు వెడల్పుగా లేకపోవడం, ప్రమాదకర మలుపులు, యాక్సిడెంట్‌ జోన్లవద్ద వేగనిరోధకాలు ఏర్పాటు చేయకపోవడం, మైనర్లు వాహనాలను డ్రైవ్‌ చేయడం తదితర కారణాలతో  రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో అయినవాళ్లను పోగొట్టుకుని  కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.   

మదనపల్లె డివిజన్‌ పరిధిలో అనేక ప్రమాదకర మలుపులు, యాక్సిడెంట్‌ జోన్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రమాదం జరిగిందంటే మరణం తప్పదు. ముఖ్యంగా అమ్మచెరువుమిట్ట, తానామిట్ట, మొలకలదిన్నెక్రాస్‌, దొమ్మన్నబావి, ఎగువ చెన్నామర్రి, దిగువ చెన్నామర్రి, కూనితోపు, లాభాల గంగమ్మగుడి సమీపంలోని మలుపు, బొమ్మనచెరువు మలుపు, తట్టివారిపల్లె జంక్షన్‌, కాశీరావుపేట, చీకిలబైలు మలుపు, ఎర్రగానిమిట్ట, బైపా్‌సరోడ్డులో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగి ఎంతో మంది మృత్యువాత పడ్డారు. పలువురు వికలాంగులయ్యారు. ప్రమాదాలను అరికట్టడంలో పోలీసు, రవాణాశాఖ అధికారులు విఫలమైనట్లు ఆరోపణలు వినబడుతున్నాయి.  


వారం రోజుల్లో జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే...

ఈనెల 13న పుంగనూరు మండలం నేతిగుట్లపల్లె పంచాయతీ కురవూరుకు చెందిన జగదీష్‌, గణేష్‌, శివాజీలు కమ్మిపనులు చేసేందుకు ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వస్తూ.. దారిలో 150వ మైలు వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో జగదీష్‌, గణే్‌షలు మృతి చెందగా, శివాజీ తీవ్రంగా గాయపడ్డాడు. 

అదేరోజు మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ బొగ్గిటివారిపల్లెకు చెందిన మహేష్‌ కూలి పనులు చేసేందుకు మొలకలదిన్నెక్రా్‌సకు వచ్చాడు. పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికెళ్లేందుకు ఆటోకోసం రోడ్డుపై నిలబడి ఉండగా, ఎదురుగా వస్తున్న టెంపో ఢీకొంది. ప్రమాదంలో మహేష్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. 

ఈనెల 16న గుర్రంకొండ మండలం చెర్లోపల్లె పంచాయతీ దిగువ తొట్లివారిపల్లెకు చెందిన సతీ్‌షకుమార్‌రెడ్డి, హేమంత్‌లు సొంత పనులపై ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వచ్చారు. తిరిగి స్వగ్రామానికి బయలుదేరి వెళుతుండగా, దారిలో గోశా ఆస్పత్రి వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో సతీష్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, హేమంత్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

అదేరోజు తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లెకు చెందిన అజీరా, ఆమె పిల్లలు జోయా, జునెద్‌, చిన్నాన్న కుమారుడు ఖాదర్‌బాషాలు ద్విచక్రవాహనంలో మదనపల్లెలో జరిగే బంధువుల జన్మదిన వేడుకలకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా.. దారిలో తానామిట్ట వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ప్రమాదంలో వీరు నలుగురూ మరణించారు.

ఈనెల 17న కురబలకోట మండలం మొలకవారిపల్లెకు చెందిన హుస్సేన్‌సాబ్‌ సొంతపనులపై మండలంలోని అంగళ్లుకు వెళ్లాడు. అక్కడి నుంచి సీటీఎంవైపు నడిచి వెళుతుండగా, వెనుక నుంచి వస్తున్న ఐషర్‌ వాహనం ఢీకొంది. ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

తాజాగా ఈనెల 19న పీటీఎం మండలం మడుమూరుకు చెందిన కృష్ణారెడ్డి సొంతపనులపై కురబలకోటకు వచ్చాడు. మండలంలోని కోటకొండ మార్గంలో మినీటెంపోలో వెళుతుండగా, దారిలో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో కృష్ణారెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.


నివారణకు చర్యలు తీసుకుంటున్నాం..

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా రోజూ నాకాబందీ నిర్వహించి వాహన తనిఖీలు చేపడుతున్నాం. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను డ్రైవ్‌ చేస్తున్న చోదకులకు జరిమానా విధిస్తున్నాం. అలాగే కేసులు కూడా నమోదు చేసి వాహనాలను సీజ్‌ చేస్తున్నాం. ప్రమాదాలపై సదస్సులు ఏర్పాటు చేసి చైతన్యం తీసుకొస్తున్నా..వాహనదారుల్లో కనీస అవగాహన లేకుండాపోతోంది. అవగాహనలేమితోనే తర చూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రమాదాలకు కళ్లెం వేస్తాం. ప్రమాదాలపై ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలి.  

                      -కె.రవిమనోహరాచారి, డీఎస్పీ, మదనపల్లె. 

Updated Date - 2022-05-21T05:29:42+05:30 IST