నెత్తురోడిన రహదారులు

ABN , First Publish Date - 2022-05-28T09:02:36+05:30 IST

నెత్తురోడిన రహదారులు

నెత్తురోడిన రహదారులు

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం

నర్సీపట్నంలో చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురు యువకులు మృతి

నక్కపల్లిలో రెండు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన మరో ముగ్గురు

అనంతపురం జిల్లాలో కారు ఢీకొని ఇద్దరు రైతులు మృతి

గుంటూరు జిల్లాలో కుమార్తెతో సహా దంపతులను బలిగొన్న లారీ


నర్సీపట్నం/నక్కపలి/ఆత్మకూరు/ పెదకాకాని, మే 27: రాష్ట్రంలో శుక్రవారం రహదారులు నెత్తురోడాయి. మూడు జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 11మంది ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని అప్పన్నదొరపాలెం జంక్షన్‌ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్‌ఐ దివాకర్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాకవరపాలెం మండలం తామరం గ్రామానికి చెందిన గెడ్డం లక్ష్మణ్‌, రాచూరి దుర్గాప్రసాద్‌ (20), మైచర్ల గౌరీనాథ్‌, మాకవరపాలెం బీసీ కాలనీకి చెందిన ఎల్లపు నాగేంద్ర (20), కన్నూరు రోహిత్‌ (20) స్నేహితులు. తూర్పు గోదావరి జిల్లా తునిలో స్నేహితుడి వివాహానికి వెళుతున్నామని ఇళ్లలో చెప్పి రాత్రంతా నర్సీపట్నం, మాకవరపాలెం ప్రాంతాల్లోనే తిరిగారు. గౌరీనాథ్‌కు శుక్రవారం తెల్లవారుజామున తండ్రి ఫోన్‌ చేయడంలో ఇళ్లకు వెనుతిరిగారు. అప్పన్నదొరపాలెం జంక్షన్‌ సమీపంలో రహదారిపై ఒరిగిన చెట్ట్టును కారు నడుపుతున్న గౌరీనాథ్‌ గమనించలేదు. కంగారులో వాహనాన్ని కుడి వైపునకు తిప్పగా అక్కడున్న చెట్టును బలంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు వెనుక సీట్లో కూర్చున్న నాగేంద్ర, దుర్గాప్రసాద్‌, రోహిత్‌ అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచు కోవడంతో ముందు సీట్లో కూర్చున్న లక్ష్మణ్‌, గౌరీనాథ్‌ గాయాలతో బయటపడ్డారు. ఇదే జిల్లా నక్కపల్లి మండలంలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన కొందరు గురువారం రాత్రి టాటా మ్యాజిక్‌లో సింహాచలం అప్పన్న దర్శనానికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం శుక్రవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై గొడిచెర్ల వద్ద ఆగిఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న మరడా రమేశ్‌బాబు (37), తలారి వెంకటేశ్వరమ్మ (31) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని పోలీసులు తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నక్కపల్లి ఇసుక ర్యాంపు సమీపాన హైవే జంక్షన్‌ వద్ద శుక్రవారం తెల్లవారుజామున వ్యాన్‌ను బైక్‌ ఢీకొనడంతో ఎయిర్‌ఫోర్స్‌ విభాగానికి సంబంధించి విశాఖలో కోచింగ్‌ తీసుకుంటున్న యానాంకు చెందిన జానా ఆనంద్‌ జయశేఖర్‌రెడ్డి (20) మృతిచెందాడు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల కేంద్రం సమీపంలోని పి. సిద్దరాంపురం క్రాస్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు మృతి చెందారు. కూడేరు మండలం ఎంఎం హల్లికి చెందిన కోట్లో అక్కులప్ప (42), ఆత్మకూరు అక్కులప్ప (40) మరో వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై శుక్రవారం సాయంత్రం ఆత్మకూరు వస్తుండగా ప్రమాదం జరిగింది. అనంతపురం వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు వీరి బైకును ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి అంజి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


మృత్యురూపంలో దూసుకొచ్చిన లారీ

విజయవాడ కస్తూరిబాయ్‌ పేటకు చెందిన కొల్లిపర గోపికృష్ణ (34), శిరీష (29) భార్యాభర్తలు. వీరికి లోహిత్‌ సాయి, స్నేహ ధృతి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వేసవి సెలవులకు గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు అమ్మమ్మగారింటికి వెళ్లిన పిల్లల్ని తీసుకుని విజయవాడ వెళుతుండగా గురువారం అర్ధరాత్రి పెదకాకాని సమీపంలోని వైజంక్షన్‌ వద్ద హైవే సైడ్‌ అప్రోచ్‌ రోడ్డులో అతి వేగంగా వస్తున్న లారీ వీరి బైక్‌ను వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో గోపికృష్ణ అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన శిరీష, లోహిత్‌సాయి, స్నేహ ధృతిలను మంగళగిరి ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శిరీష, స్నేహ ధృతి (5) మృతి చెందారు. ప్రాణాపాయం నుంచి లోహిత్‌ సాయి (10) బయటపడ్డాడు. సంఘటనా స్థలంలో పెదకాకాని పోలీసులు లారీ నెంబర్‌ ప్లేటు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-05-28T09:02:36+05:30 IST