Britain pm elections: ప్రచారం చివరి అంకంలో రిషి సునాక్‌కు షాక్..

ABN , First Publish Date - 2022-07-31T03:21:35+05:30 IST

బ్రిటన్ ప్రధాని ఎన్నిక ప్రక్రియ చివరి అంకంలోకి వచ్చిన తరుణంలో ప్రధాన అభ్యర్థి రిషి సునాక్‌కు మరో షాక్ తగిలింది.

Britain pm elections: ప్రచారం చివరి అంకంలో రిషి సునాక్‌కు షాక్..

ఎన్నారై డెస్క్: బ్రిటన్ ప్రధాని ఎన్నిక(Britain pm elections) ప్రక్రియ చివరి అంకంలోకి వచ్చిన తరుణంలో ప్రధాన అభ్యర్థి రిషి సునాక్‌కు(Rishi Sunak) మరో షాక్ తగిలింది. ఇటీవల పోటీ నుంచి తప్పుకున్న ఓ అభ్యర్థి శనివారం రిషి ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌కు(Lizz Truss) మద్దతుగా నిలిచారు. ప్రధాని పదవికి తాను అర్హురాలినేననంటూ లిజ్ ట్రస్ తనను కన్విన్స్ చేయగలిగిందని కన్సర్వేటివ్ పార్టీ నేత ఫారిన్ ఎఫైర్స్ కమిటీ చైర్‌పర్సన్ టామ్ టుగెంఘాట్ చెప్పారు. తన మద్దతు ట్రస్‌కే అని స్పష్టం చేశారు. ప్రధాని పదవికి పోటీ పడుతున్న ఆ ఇద్దరి అభ్యర్థుల వాదనలు టీవీ డిబేట్లలో చూశానని చెప్పారు. పన్నుల్లో కోత పెడతానన్న ట్రస్ వాదనతో తాను ఏకీభవిస్తున్నానన్నారు.


‘‘లిజ్ ట్రస్.. ఇంటా బయటా కూడా బ్రిటన్ విలువలకు కట్టుబడ్డ మనిషి. ఆమె నేతృత్వంలో బ్రిటన్ మరింత సురక్షితమైన భద్రమైన దేశంగా మారుతుందనడంతో నాకు ఎటువంటి సందేహం లేదు’’ అని టామ్ కామెంట్ చేశారు. రిషి, ట్రస్ ఇద్దరూ ప్రతిభావంతులని చెప్పారు. అయితే.. ట్రస్‌కు ఉన్న కేబినెట్ హోదా రీత్యా ఆమె అంతర్జాతీయ వేదికలపై బ్రిటన్ తరపున మరింత సమర్థవంతంగా వాదనలు వినిపించగలదన్నారు. ఇప్పటివరకూ విదేశాంగ శాఖ సెక్రెటరీగా ఉన్న ఆమెకు ఆ అనుభవం కూడా తోడవుతుందని చెప్పారు. అంతకుమునుపే.. కన్సర్వేటివ్ పార్టీలోని మరో ప్రధాన నేత బెన్ వాలెస్ ట్రస్‌కు మద్దతు ప్రకటించారు. డిఫెన్స్ సెక్రెటరీగా ఉన్న ఆయన.. ట్రస్‌ను నిజాయతీపరురాలు, అనుభవజ్ఞురాలని కొనియాడారు. 

Updated Date - 2022-07-31T03:21:35+05:30 IST