నీలి రంగు నక్క!

ABN , First Publish Date - 2020-12-07T05:30:00+05:30 IST

ఒక నక్క దారి తప్పి ఓ ఊర్లోకి ప్రవేశించింది. ఆ నక్కను చూసిన గ్రామస్థులు కర్రలు తీసుకుని చంపడానికి ప్రయత్నించారు. దాంతో నక్క తప్పించుకోవడం కోసం ఓ బకెట్‌లో దూరింది...

నీలి రంగు నక్క!

ఒక నక్క దారి తప్పి ఓ ఊర్లోకి ప్రవేశించింది. ఆ నక్కను చూసిన గ్రామస్థులు కర్రలు తీసుకుని చంపడానికి ప్రయత్నించారు.  దాంతో నక్క తప్పించుకోవడం కోసం ఓ బకెట్‌లో దూరింది. అది దుస్తులకు నీలిరంగు వేయడం కోసం రంగు కలిపే బకెట్‌. ఆ రంగంతా నక్కకు అంటుకుంది.


‘‘ఎలాగైతేనేం గ్రామస్థుల బారి నుంచి బయటపడ్డా! రంగు సంగతి తరువాత చూసుకోవచ్చు అనుకుంటూ’’ ఆ నక్క అడవి బాట పట్టింది. నీలి రంగు అంటుకున్న నక్కను చూసి ఇదేదో కొత్త జంతువులా ఉందని మిగతా జంతువులన్నీ భయపడి పరుగెత్తడం మొదలుపెట్టాయి. సింహం, పులి సైతం ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి జంతువును చూడలేదని భయపడ్డాయి. వాటి భయాన్ని గమనించిన నక్క ‘‘మిమ్మల్ని చక్కగా పరిపాలించడానికి దేవుడు నన్ను పంపించాడు. ఇక నుంచి నేను మీ రాజుని’’ అని అంది. చేసేదేమీ లేక అన్ని జంతువులు ఒప్పుకున్నాయి. రోజూ అవి వేటాడిన ఆహారాన్ని ముందు నక్కకు పెట్టి మిగిలింది అవి తీసుకెళ్లేవి. ఇలా రోజులు గడుస్తున్న సమయంలో ఒకరోజు రాత్రివేళ అడవిలోని నక్కలు ఊళలు వేయడం మొదలుపెట్టాయి. వాటిని చూసిన ఈ నక్క కూడా ఊళ వేయడం మొదలుపెట్టింది. అప్పుడు కొన్ని జంతువులు చూసి ఇది నక్క అని నిర్ధారించుకుని అడవిలోని మిగతా జంతువులకు చెప్పాయి. ఆ విషయం తెలిసిన వెంటనే ‘ఇంత మోసం చేస్తుందా’ అంటూ కోపంతో సింహం ఒక్క దెబ్బతో నక్కను చంపేసింది. 

Updated Date - 2020-12-07T05:30:00+05:30 IST