నీలి చిత్రాలు.. మనసును మార్చజాలవు!

ABN , First Publish Date - 2020-09-06T13:41:48+05:30 IST

నీలి చిత్రాలు తరచుగా చూసే అలవాటున్న వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది? వారిపై వాటి ప్రభావం ఎంత వరకు పడుతుంది? శారీరక సంతృప్తి

నీలి చిత్రాలు.. మనసును మార్చజాలవు!

శృంగారంలో సంతృప్తికి ఏ లోటూ ఉండదు

శారీరక, మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావమూ చూపవు

252 మందిపై తాజా అధ్యయనంలో వెల్లడి

న్యూయార్క్‌, సెప్టెంబరు 5: నీలి చిత్రాలు తరచుగా చూసే అలవాటున్న వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది? వారిపై వాటి ప్రభావం ఎంత వరకు పడుతుంది? శారీరక సంతృప్తిని కలిగిస్తాయా లేదా వారిని లైంగికంగా ఉన్మాదిలా మారుస్తాయా? సమాజంలో ఆందోళన రేకెత్తిస్తున్న ఈ ప్రశ్నలకు ఇప్పటివరకు శాస్త్రీయంగా కచ్చితమైన సమాధానం లభించలేదు. ఈ అంశంపై గతంలో జరిగిన కొన్ని అధ్యయనాలు సానుకూల ఫలితాలను ఇస్తే.. మరికొన్ని అధ్యయనాలు పూర్తి ప్రతికూల ఫలితాలను అందించాయి. కాగా, తాజాగా జరిగిన ఓ అధ్యయనం మాత్రం నీలి చిత్రాలు, అశ్లీల సాహిత్యం.. మనిషి మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావమూ చూపించవని, అలాగే.. వారికి శారీరక సంతృప్తిని కూడా కలిగించవని తేల్చి చెప్పింది. ఈ అధ్యయనం సెక్సువల్‌ అండ్‌ రిలేషన్‌షిప్‌ థెరపీలో ఇటీవల ప్రచురితమైంది. దీని ప్రకారం.. నీలి చిత్రాలను చూసే వారి మానసిక స్థితిపై దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది. అందులో చూపించేది పూర్తిగా నిజం అని నమ్మేవారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నమ్మనివారిపై ఎటువంటి ప్రభావమూ పడదు. అలాగే, నీలి చిత్రాలు విపరీతంగా చూసే వారికి శృంగార జీవితంలో ఎప్పటికీ సంతృప్తి లభించదు అనే మాట పూర్తిగా అవాస్తవమని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. నీలి చిత్రాల వీక్షణానికి, శృంగార జీవితంలో సంతృప్తికి ఎటువంటి సంబంధమూ లేదని తేల్చింది. ఈ అధ్యయనంలో భాగంగా మొత్తం 252 మంది స్త్రీ, పురుషులపై పరిశోధకులు సర్వే నిర్వహించారు. వారిని ఆన్‌లైన్లో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. వారి సమాధానాలను విశ్లేషించిన పరిశోధకులు.. నీలి చిత్రాలు చూసే అలవాటు మనిషి మానసిక, శారీరక స్థితిపై ఎలాంటి ప్రభావమూ చూపించదని తేల్చారు. అలాగే, దీనిపై మరింతగా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొన్నారు.

Updated Date - 2020-09-06T13:41:48+05:30 IST