బోర్డులు, కార్పొరేషన్‌ పదవులు రద్దు

ABN , First Publish Date - 2022-07-13T16:54:21+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా మంగళవారం బోర్డులు, కార్పొరేషన్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, నామినేటెడ్‌ సభ్యులకు గేట్‌పాస్‌ ఇచ్చింది. మొత్తం 47

బోర్డులు, కార్పొరేషన్‌ పదవులు రద్దు

                                     - త్వరలోనే తాజా నియామకాలు 


బెంగళూరు, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా మంగళవారం బోర్డులు, కార్పొరేషన్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, నామినేటెడ్‌ సభ్యులకు గేట్‌పాస్‌ ఇచ్చింది. మొత్తం 47 ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రస్తుతం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, నామినేటెడ్‌ సభ్యుల పదవులను తక్షణం రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. రానున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పాతవారి స్థానంలో పలువురు కొత్తవారికి అవకాశాలు లభించనున్నాయని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా బోర్డులు, కార్పొరేషన్‌ అధ్యక్ష పదవులు రద్దయి కొత్తవారి నియామకం జరగడం ఆనవాయితీగా వస్తోంది. బీఎస్‌ యడియూరప్ప అధికారాన్ని త్యజించిన అనంతరం బసవరాజ్‌ బొమ్మై ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినప్పటికీ గతంలో నియమితులైనవారే అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. తాజాగా ఈ పదవుల నుంచి యడియూరప్ప వర్గీయులను తొలగించడంతో సహజంగానే బీజేపీలో ఉత్కంఠత నెలకొంది. వర్షపీడిత ప్రాంతాల పర్యటన అనంతరం ముఖ్యమంత్రి బొమ్మై అధిష్టానం పెద్దలతోనూ, రాష్ట్ర కోర్‌ కమిటీ నేతలతోనూ చర్చించిన తర్వాత ఈ పదవులను భర్తీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుత అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, నామినేటెడ్‌ సభ్యులకు ఒకే కలంపోటుతో ఉద్వాసన పలికినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణకు ముందే బోర్డులు, కార్పొరేషన్‌ అధ్యక్ష పదవులను భర్తీ చేస్తారని వినిపిస్తోంది. ఈ తాజా పరిణామాలతో ఆశావహుల్లో ఉ త్సాహం మళ్లీ చిగురించింది. 


Updated Date - 2022-07-13T16:54:21+05:30 IST