బోర్డులు పెట్టారు.. కానీ...!

ABN , First Publish Date - 2020-12-04T05:01:04+05:30 IST

అనధికార లేఅవుట్‌లో ప్లాట్ల క్రయ విక్రయాలు ఎప్పుడో జరిగిపోయాయి. ఆయా లేఅవుట్లకు ఎటువంటి అనుమతులు లేవని తెలిసి కూడా శృంగవరపుకోట మేజర్‌ పంచాయతీ అధికారులు ఇళ్ల నిర్మాణా లకు అనుమతులు ఇచ్చేశారు.

బోర్డులు పెట్టారు.. కానీ...!
ఎస్‌.కోట పంచాయతీ పరిధిలో అనధికార లేఅవుట్‌లో వెలసిన ఇళ్ల నిర్మాణాలు

  అనధికార లేఅవుట్‌లని తెలిసి ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు 

  ఎస్‌కోట పంచాయతీ అధికారుల తీరుపై అనుమానాలు 

 శృంగవరపుకోట, డిసెంబరు 3: అనధికార లేఅవుట్‌లో ప్లాట్ల క్రయ విక్రయాలు ఎప్పుడో జరిగిపోయాయి. ఆయా లేఅవుట్లకు ఎటువంటి అనుమతులు లేవని తెలిసి కూడా శృంగవరపుకోట మేజర్‌ పంచాయతీ అధికారులు ఇళ్ల నిర్మాణా లకు అనుమతులు ఇచ్చేశారు. దీంతో చాలా వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఖాళీగా ఉన్న ప్లాట్లలో స్థలాలు కొనొద్దంటూ పంచాయతీ సిబ్బంది సూచిక బోర్డులు ఏర్పాటు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విశాఖ, విజయనగరం పట్టణాలకు సమీపంలో ఉండడంతో పాటు అరకు పర్యాటక ప్రాంతానికి ముఖద్వారం కావడంతో ఎస్‌కోటలో ఇళ్ల నిర్మాణాలకు, ప్లాట్ల కొనుగోలుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. దీంతో రియల్టర్లు ఇక్కడ ఉన్న భూములు, ఖాళీ స్థలాలను కొనుగోలు చేసి లేఅవుట్లుగా తీర్చిదిద్దుతున్నారు. అయితే పంచాయతీకి వదలాల్సిన స్థలం కానీ, భూ బదలాయింపు కానీ చేయడం లేదు. ఉడా అనుమతులు తీసుకోవడం లేదు. అయినప్పటికీ కొనుగోలుదారులు ముందుకు వస్తున్నారు. లొసుగులను అసరా చేసుకుంటున్న కొంత మంది అధికారు లు ఇళ్ల నిర్మాణాలకు అనుమతుల మంజూరు చేస్తున్నారు. పంచాయతీకి కట్టాల్సిన ఫీజు కంటే మరింత అధికంగా వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారు. పంచాయతీ కార్యనిర్వాహక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అనధికార లేఅవుట్లలో ఎక్కడా ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేదని ఈవోపీఆర్డీ ఎంవీఏ శ్రీనివాసరావు ఆంధ్రజ్యోతికి స్పష్టం చేశారు. ఇప్పటికైనా అనధికార లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయకుండా ఉండేందుకు ఈ విధంగా నోటీస్‌ బోర్డులను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.  

 

Updated Date - 2020-12-04T05:01:04+05:30 IST