సదస్సులో మాట్లాడుతున్న డీఈవో రాఘవరెడ్డి
రాయచోటిటౌన్, మే 18: మారుతున్న కాలానికి అనుగుణంగా బోధనలో నూతనత్వం అవసరమని అన్నమయ్య జిల్లా డీఈవో రాఘవరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఫయాజ్ కల్యాణ మండపంలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యా సదస్సులో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తేనే ప్రభుత్వ బడులలో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల ఖాళీల భర్తీ, పదోన్నతుల్లో సమస్యలు వస్తున్నాయన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను సత్వరం పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణానిధి మూర్తి మాట్లాడుతూ సమస్యలతో సతమతమయ్యే ఉపాధ్యాయులు వృత్తి ధర్మాన్ని సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహించలేరన్నారు. తక్షణమే సీపీఎస్ రద్దు ప్రక టించాలన్నారు. మోడల్ స్కూల్, కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ కొండూరు శ్రీనివాసరాజు, కడప అన్నమయ్య జిల్లాల సంయుక్త అధ్యక్షులు రామకృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి జగ్గారి వెంకటసుబ్బయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, పీఆర్టీయూ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.