ఇంకెన్నేళ్లు?

ABN , First Publish Date - 2021-11-13T06:36:11+05:30 IST

పర్యాటకాభివృద్ధి సంస్థ విజయవాడ డివిజన్‌ పరిధిలోని బోధిసిరి డబుల్‌ డెక్‌ రివర్‌ క్రూయిజర్‌ మరమ్మతులకు గురై ఏడాది దాటినా, ఇంతవరకు అందుబాటులోకి రాలేదు.

ఇంకెన్నేళ్లు?

కార్తీకంలోనూ అందుబాటులోకి రాని ‘బోధిసిరి’ 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : పర్యాటకాభివృద్ధి సంస్థ విజయవాడ డివిజన్‌ పరిధిలోని బోధిసిరి డబుల్‌ డెక్‌ రివర్‌ క్రూయిజర్‌ మరమ్మతులకు గురై ఏడాది దాటినా, ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. ఏడాది క్రితం దీనికి మరమ్మతుల కోసం టెండర్‌ పిలిచారు. ఓ సంస్థకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు పనులు కాలేదు. దీంతో బోధిసిరి పర్యాటకులకు దూరంగానే ఉండిపోయింది. పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కి కాసులు మిగిల్చే సీజన్‌ కార్తీక మాసం. ఈ సీజన్లో భవానీ ద్వీపానికి వచ్చే పర్యాటకులకు అదనపు ఆకర్షణ బోధిసిరి. ఇంత వరకూ ఇది అందుబాటులోకి రాకపోవటం వల్ల ఏపీటీడీసీ భారీ ఆదాయాన్నే కోల్పోవాల్సి వస్తోంది. ఈ మాసంలో బోధిసిరిని పార్టీల కోసం ఎక్కువ మంది బుక్‌ చేసుకుంటారు. తద్వారా ఏపీటీడీసీ భారీ ఆదాయాన్ని మూటకట్టుకుంటుంది. కార్తీక మాసానికి ముందుగానే  దీనిని ఏపీటీడీసీకి స్వాధీనం చేయాల్సిన కాంట్రాక్టర్‌ ఇప్పటి వరకు అప్పగించలేదు. బిల్లుల చెల్లింపులో జాప్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కృష్ణానదిలో హరిత బెర్మ్‌పార్క్‌, భవానీ ద్వీపం మధ్య నదిలోనే రౌండ్లు తిరుగుతూ ఉండే ఈ క్రూయిజర్‌ పైన పార్టీలు జరుగుతాయి. కింద ఉన్న ఏసీ చాంబర్‌లో డిన్నర్‌ ఏర్పాట్లు చేస్తారు. ‘సాహిత్య నౌకా విహారం’ పేరిట ప్రతి నెలా సాహితీ సమావేశాలు కూడా ఈ బోధిసిరిలో జరిగాయి. న్యూ ఇయర్‌కు ముందుగానైనా అందుబాటులోకి తీసుకువస్తారో లేదో వేచి చూడాల్సిందే. 

Updated Date - 2021-11-13T06:36:11+05:30 IST