బోజో విజయం

ABN , First Publish Date - 2022-06-08T07:19:29+05:30 IST

బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవి నిలబెట్టుకున్నారు. ఆయనను కన్సర్వేటివ్ పార్టీ నాయకుడిగా, ప్రధానిగా తప్పించేందుకు స్వపక్ష ఎంపీలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కగలిగారు...

బోజో విజయం

బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవి నిలబెట్టుకున్నారు. ఆయనను కన్సర్వేటివ్ పార్టీ నాయకుడిగా, ప్రధానిగా తప్పించేందుకు స్వపక్ష ఎంపీలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కగలిగారు. ఈ విజయాన్ని నిర్ణయాత్మకం, చరిత్రాత్మకం అంటూ అభివర్ణించిన బోరిస్ ఇకముందు మనమంతా ఏకతాటిపై పనిచేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆయన తన విజయాన్ని ఎంత పొగుడుకున్నా ఒక్కముక్కలో చెప్పాలంటే, ఓ ముప్పైరెండు మంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేసి ఉంటే ఈ పాటికి ఇంటిదారిపట్టేవారు. బోరిస్ కు మద్దతుగా మొత్తం 359మంది కన్సర్వేటివ్ ఎంపీల్లో 211మంది మాత్రమే అంటే 59శాతం ఓటువేశారంటే, 41శాతంమంది వ్యతిరేకించారని అర్థం. బహిరంగంగా ఆయన పక్కన నిలబడినవారు కూడా ఈ రహస్య ఓటింగ్ సందర్భంగా వ్యతిరేకంగా వ్యవహరించేందుకు అవకాశం ఏర్పడింది. 


కరోనా తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు, నిబంధనలను ఉల్లంఘించి తాను, తన ప్రభుత్వంలోని మరికొందరు నేతలతో కలసి తన నివాసంలో మద్యం విందుల్లో మునిగితేలినందుకు ఆయన గతనెలాఖరులో పార్లమెంటులో లెంపలేసుకొని, క్షమాపణలు వేడుకున్న విషయం తెలిసిందే. పార్టీగేట్ గా ప్రసిద్ధిచెందిన ఈ వ్యవహారంలో నిజాలు నిగ్గుతేల్చేందుకు స్యూ గ్రే కమిషన్ ఏర్పడి, అది తన తుదినివేదికను పార్లమెంటుకు సమర్పించేవరకూ బోరిస్ అబద్ధాలు, అర్థసత్యాలతో పార్లమెంటునూ, ప్రజలనూ వంచిస్తూనే వచ్చారు. కమిషన్ తన నివేదికలో బోరిస్ బృందాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. వీళ్ళంతా గంటల తరబడి విపరీతంగా తాగుతూ, కరోకే పాటలు పాడుతూ, ఒళ్ళుతెలియని స్థితిలో ప్రభుత్వ ఆస్తులను నాశనం చేస్తూ, ఒక దశలో కొట్టుకున్నారంటూ ఆ పార్టీలు ఎలా జరిగాయో కూడా కమిషన్ తన నివేదికలో వివరించింది. ఒక పక్క ప్రజలు లాక్ డౌన్ నిర్బంధంలో ఉంటూ, ఆస్పత్రులకు పరిగెడుతూ, ఆప్తులను కోల్పోయి ఏడుస్తున్న అత్యంత విషాదకరమైన కాలంలో, ఆ దేశ ప్రధాని ఇలా పార్టీల్లో తాగితందనాలాడారని విన్నప్పుడు ఎవరికైనా తీవ్రమైన బాధ, అసహ్యం కలగడం సహజం. కమిషన్ తనను ఇలా నడివీధిలో నిలబెట్టేసిన తరువాత తరువాత బోరిస్ చేసేదేమీ లేక చట్టసభలో నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. ఆయనను ఓడించకపోయినప్పటికీ, ఈ అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా పార్టీ తన పరువు కాస్తంతైనా కాపాడుకుంది.


బోరిస్ పట్ల ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఉక్రెయిన్ యుద్ధం ఆయన పార్టీకి చెందిన అత్యధికశాతం ఎంపీల చేతులు కట్టేసింది. తన పదవిని కాపాడుకోవడానికి బోరిస్ ఉక్రెయిన్ యుద్ధాన్ని చక్కగా వాడుకున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా బోరిస్ ను ఆకాశానికి ఎత్తేస్తూవచ్చారు. అవిశ్వాస తీర్మానానికి కాస్తంత ముందు జెలెన్ స్కీతో బోరిస్ జాన్సన్ జరిపిన టెలిఫోన్ సంభాషణలో రష్యా సేనల దూకుడుకు ఎలా కళ్ళెం వేయాలో చర్చించారట. యుద్ధంలో ఉక్రెయిన్ పక్షాన బ్రిటన్ మిగతా మిత్రదేశాలకంటే ముందు రంగంలో నిలవడమేకాక, భారీ ఎత్తున ఆయుధసహాయాన్ని, ఇతరత్రా సరఫరాలను అందించింది. ఒకపక్క యుద్ధం జరుగుతూండగా ఉక్రెయిన్ రాజధాని వీధుల్లో బోరిస్ పర్యటించారు కూడా. ఈ కారణంగానే, అవిశ్వాస తీర్మానంలో బోరిస్ నెగ్గుకొచ్చినందుకు ఉక్రెయిన్ ఎగిరిగంతేసిది. పార్టీలోని 59శాతం మంది ఎంపీలు బోరిస్ పక్షాన నిలిచినప్పటికీ, ఆయనపై వ్యతిరేకత తీవ్రస్థాయిలోనే ఉన్నదని ఈ అవిశ్వాస తీర్మానం తేల్చేసింది. బోరిస్ నిలబడినప్పటికీ పార్టీ చీలిపోయిందని ఈ ఫలితాలు చెబుతున్నాయి. నిబంధనల ప్రకారం మరో ఏడాది వరకూ అవిశ్వాస తీర్మానానికి వీల్లేదు. కానీ, రెండు కీలకమైన కన్సర్వేటివ్ స్థానాలకు త్వరలో జరగబోయే ఉపఎన్నికల్లో పార్టీకి ఏమాత్రం విజయావకాశాలు లేవని అంటున్నందున బోరిస్ నాయకత్వానికి కొత్త సవాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉన్నది. ఒకరు లైంగికదాడి ఆరోపణలమీదా, మరొకరు నిండుసభలో నీలిచిత్రాలు వీక్షిస్తున్న అభియోగంమీదా ఖాళీ చేయాల్సివచ్చిన స్థానాలు ఇవి. అలాగే, పార్టీ గేట్ విచారణ కూడా ఇప్పట్లో ముగిసేది కాదు. పార్లమెంటు ప్రివిలేజెస్ కమిటీ ఒకటి బోరిస్ సభను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవపట్టించాడని కనుక తేల్చితే ఆయనను కాపాడేవారే ఉండరు. రెండేళ్ళక్రితం ఎన్నికలకు పోయి అద్భుత విజయాన్ని అందుకున్న బోరిస్ జాన్సన్ కేవలం నిర్లక్ష్యం, అధికారగర్వంతో చేజేతులా చెడ్డపేరు తెచ్చుకొని అప్రదిష్టపాలైనాడు. ఈయూతో చక్కని సయోధ్య నెరపుతూ దేశాన్ని బ్రెగ్జిట్ బాధలనుంచి బయటపడవేసిన బోరిస్, కరోనా నియంత్రణలో కంటే పార్టీగేట్ వ్యవహారంలో అపఖ్యాతి పాలవడం విచిత్రం.

Updated Date - 2022-06-08T07:19:29+05:30 IST