పొలాల్లో గుట్టలుగా శవాలు.. అమానుష ఘటన

ABN , First Publish Date - 2020-11-30T02:58:39+05:30 IST

నైజీరియాలో అమానుషం చోటుచేసుకుంది. పొలంలో పనులకు వెళ్లిన 43 మంది రైతులను మిలిటెంట్లు అతి కిరాతకంగా...

పొలాల్లో గుట్టలుగా శవాలు.. అమానుష ఘటన

నైజీరియాలో అమానుషం.. 43 మంది రైతులను పొట్టనబెట్టుకున్న మిలిటెంట్లు

బోర్నో: నైజీరియాలో అమానుషం చోటుచేసుకుంది. పొలంలో పనులకు వెళ్లిన 43 మంది రైతులను బోకో హరమ్ మిలిటెంట్లు అతి కిరాతకంగా చంపేశారు. వీరిలో కొందరిపై కాల్పులు జరపగా, మరికొంత మంది రైతులను చేతులు, కాళ్లూ కట్టేసి గొంతు కోసి చంపేశారు. ఆదివారం జరిగిన ఈ అమానవీయ ఘటనతో నైజీరియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇస్లామిక్ మిలిటెంట్ల పనిగా నైజీరియా భావిస్తోంది. నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. చనిపోయిన వారందరికీ నైజీరియా ప్రభుత్వం సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించింది. అయితే.. ఇంకా చాలా మంది రైతులు అదృశ్యమైనట్లు తెలిసింది. కనిపించకుండా పోయిన వారిలో 10 మంది మహిళలు కూడా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు ముహ్మద్ బుహారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై యావత్ దేశం చింతిస్తోందని ఆయన చెప్పారు.


బోర్నో రాష్ట్ర గవర్నర్ బాబాగానా జులం ఈ ఘటనపై స్పందిస్తూ.. నైజీరియాలోని సమాఖ్య ప్రభుత్వం మరింత మంది సైనికులను నియమించాలని, ఈ రాష్ట్ర ప్రజల రక్షణ కోసం సివిలియన్ జాయింట్ టాస్క్ ఫోర్స్ సభ్యులు, సివిల్ డిఫెన్స్ ఫైటర్స్ మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆయన చెప్పారు. తమ రాష్ట్రంలో ప్రజలు ఒక పక్క కరువుతో, ఆకలితో అలమటిస్తూ చనిపోతున్నారని, మరోపక్క పొలం పనులకు వెళ్లి పంటలు సాగు చేసుకుంటున్న సందర్భంలో ఇలా ప్రాణాలు కోల్పోతున్నారని బాబాగానా జులం నైరాశ్యం వ్యక్తం చేశారు. గత సంవత్సర కాలంగా నైజీరియాలో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో.. పంటలు సాగు చేసుకుని కడుపు నింపుకునేందుకు ప్రయత్నిస్తున్న రైతుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోవడం శోచనీయం.

Updated Date - 2020-11-30T02:58:39+05:30 IST