మోపెడ్‌ను ఢీకొన్న బొలెరో

ABN , First Publish Date - 2021-05-10T05:21:35+05:30 IST

జాతీయ రహదారిపై రాజానగరం-నరేంద్రపురం జంక్షన్‌లో మోపెడ్‌ను బొలెరో వాహనం ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు.

మోపెడ్‌ను ఢీకొన్న బొలెరో
మోపెడ్‌ను ఢీకొన్న బొలెరో

వృద్ధుడి మృతి
రాజానగరం, మే 9: జాతీయ రహదారిపై రాజానగరం-నరేంద్రపురం జంక్షన్‌లో మోపెడ్‌ను బొలెరో వాహనం ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఎస్‌ఐ జుబేర్‌ అందించిన వివరాలు ప్రకారం.. రాజానగరంలోని అగ్రహారం ప్రాంతానికి చెందిన ముద్దాడ తాతారావు(75) తన టీవీఎస్‌ మోపెడ్‌లో పెట్రోలు పోయించుకునేందుకు ఆదివారం నరేంద్రపురం జంక్షన్‌ వద్ద జాతీయ రహదారి దాటుతున్నాడు. ఇదే సమయంలో వైజాగ్‌ వైపు నుంచి వేగంగా వస్తున్న బొలెరో వాహనం మోపెడ్‌ను ఢీకొని రోడ్డు డివైడర్‌ పైకి దూసుకెళ్లింది. తాతారావు తలకు, కాలుకు బలమైన గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న బంధువులు అతడిని రాజానగరం పీహెచ్‌సీకి ఆటోలో తీసుకొచ్చారు. కొన ఊపిరితో ఉన్న తాతారావు కాలుకు వైద్యులు కట్టుకడుతుండగా ప్రాణాలు విడిచినట్టు వైద్య సిబ్బంది తెలిపారు. తలకు బలమైన గాయం కావడం వల్లే అతను మరణించినట్టు పోలీసులు తెలిపారు.  తాతారావు కుమారుడు అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.


వైద్యుల తీరుపై బంధువుల మండిపాటు


ప్రమాదంలో గాయపడిన తాతారావును ఆటోలో సకాలంలో పీహెచ్‌సీకి తరలించినా వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్లే మృతిచెందాడని  బంధువులు పీహెచ్‌సీ వైద్యుల తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. 24 గంటల ఆస్పత్రిగా ఉన్న పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు నిత్యం విధులు నిర్వహించాల్సి ఉండగా కనీసం ఒకరు కూడా విధుల్లో లేకపోవడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటూ వైద్య సిబ్బందిపై మండిపడ్డారు.

Updated Date - 2021-05-10T05:21:35+05:30 IST