ఇవేం మద్దతు ధరలు!

ABN , First Publish Date - 2020-10-15T06:09:09+05:30 IST

అన్నం పెట్టే రైతు కంటే వ్యాపారస్థుడే దేశానికి ముఖ్యమన్న రీతిలో కేంద్రప్రభుత్వ విధానాలు ఉంటున్నాయి. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతాంగాన్ని కార్పొరేట్...

ఇవేం మద్దతు ధరలు!

అన్నం పెట్టే రైతు కంటే వ్యాపారస్థుడే దేశానికి ముఖ్యమన్న రీతిలో కేంద్రప్రభుత్వ విధానాలు ఉంటున్నాయి. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతాంగాన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టడానికి ఉద్దేశించినవే. రైతాంగం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఎంత దిగువన ఉన్నదో- ఇటీవల మోదీ ప్రభుత్వం పంటలకు ప్రకటించిన మద్దతు ధరలను పరిశీలిస్తే అర్థమవుతుంది. దేశంలో 24 పంటలకు ప్రతి సంవత్సరం కేంద్రప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటిస్తోంది. 2020-–21 సంవత్సరానికి ప్రకటించిన మద్దతు ధరల్లో వాస్తవానికి అయ్యే సేద్యపు ఖర్చులకు, ప్రభుత్వం నిర్ణయించే సేద్యపు ఖర్చులకు పొంతనే లేదు. సేద్యపు ఖర్చు, కౌలు ఖర్చు, కుటుంబ శ్రమ, అప్పులకు వడ్డీ కలిపి ఎకరా సేద్యానికి దాదాపు రూ.60వేలు ఖర్చు అవుతుంది. కేంద్రప్రభుత్వం మాత్రం పంట ఖర్చును రూ.25వేలుగా నిర్ణయించి, దానిపై యాభైశాతం ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం వరి క్వింటా ఉత్పత్తి ఖర్చును రూ.1,250గా నిర్ణయించి దానిపై యాభైశాతం పెంచి మద్దతు ధరను రూ.1,725గా ప్రకటించి స్వామినాథన్ సిఫార్సులు అమలు జరిపినట్లు చెప్పుకుంటోంది. స్వామినాథన్ సిఫారసుల్లో కౌలు ఖర్చు లేదు. కుటుంబ శ్రమ పది వేలు మాత్రమే ఉంది. దీన్ని కూడా ప్రభుత్వం సేద్యపు ఖర్చుల్లో చేర్చలేదు. రాష్ట్ర ప్రభుత్వం వరి క్వింటాలకు రూ.2,853 మద్దతు ధరను ప్రకటించాలని కోరినా దాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. అనేకమంది వ్యవసాయ నిపుణులు క్వింటా వరి ఉత్పత్తి ఖర్చు రూ.2,050 పైగా అవుతుందని పేర్కొన్నారు. దీని ప్రకారం మద్దతు ధరను రూ.3,075గా ప్రకటించాలి. 


ప్రభుత్వం ప్రకటించిన పత్తి మద్దతు ధర కూడా ఇందుకు భిన్నంగా లేదు. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం పొట్టి పింజ క్వింటా ఉత్పత్తి ఖర్చు రూ.7,980. రైతాంగం దీనిన 8వేలుగా చూపుతున్నారు. వ్యవసాయశాఖ అంచనాపై యాభైశాతం ధర పెంచితే క్వింటాల్ ధర రూ.12వేల వరకు ఉండాలి. కేంద్రం మాత్రం మీడియం పత్తికి 260పెంచి, రూ.5,515, లాంగ్ స్టేపుల్ పత్తికి 270పెంచి రూ.5825 మద్దతు ధరను ప్రకటించింది. అలాగే మిరప పంటకు ప్రకటించిన మద్దతు ధర ప్రకారం రైతుకు పెట్టుబడి కూడా రాదు. ఎకరా మిరప సాగుకు రూ.లక్షా యాభై వేల నుంచి రూ.లక్షా ఎనభై వేల దాకా ఖర్చు అవుతుంది. సగటు దిగుబడి 25 నుంచి 30 క్వింటాళ్ళు ఉంటుంది. క్వింటా ఉత్పత్తి ఖర్చు రూ.10వేలు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.7వేలు. యాభైశాతం పెంచితే రూ.15వేలు ఉండాలి. అలాగే క్వింటా పసుపు ఉత్పత్తి ఖర్చు రూ.9వేలు. దానికి 50శాతం పెంచితే మద్దతు ధర రూ.13,500 ఉండాలి. ప్రభుత్వం ప్రకటించింది రూ.6,850 మాత్రమే. ఇవే కాదు, తక్కిన పంటలకు కూడా మద్దతు ధరలు ఇలాగే ఉన్నాయి. 


రైతాంగ సమస్యలు పరిష్కారం కావాలంటే, పంటలకు న్యాయమైన ధరలు ప్రకటించటం అత్యవసరం. అంతేగాక, కాంట్రాక్టు, కార్పొరేట్ సేద్యానికి అనుమతి ఇవ్వగూడదు. ప్రభుత్వ సంస్థలే రైతుల నుంచి పంటలు కొనుగోలు చేయాలి. రైతులకు ఇచ్చే సబ్సిడీని గణనీయంగా పెంచాలి. రైతులందరికీ సంస్థాగత రుణాలు ఇవ్వాలి.  


– బొల్లిముంత సాంబశివరావు

రాష్ట్ర రైతు కూలీ సంఘం కార్యవర్గ సభ్యుడు

Updated Date - 2020-10-15T06:09:09+05:30 IST