సౌత్ సినిమాలకు, హాలీవుడ్ మూవీస్ కి మధ్య Sandwich అయిపోతోన్న బాలీవుడ్...

Published: Mon, 16 May 2022 22:41:37 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సౌత్ సినిమాలకు, హాలీవుడ్ మూవీస్ కి మధ్య Sandwich అయిపోతోన్న బాలీవుడ్...

బాలీవుడ్ కష్టాల్లో ఉంది. హిందీ సినిమా దర్శకనిర్మాతలు అయోమయంలో పడిపోయారు. కారణం... వారు తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటమే కాదు.... దక్షిణాది చిత్రాలు హిందీ మార్కెట్లోకి జొరబడి ‘తగ్గేదేలే’ అంటున్నాయి!  హాలీవుడ్ సినిమాలు డైరెక్ట్ గా బరిలోకి దిగి వసూళ్లు పెంచుకుంటూపోతున్నాయి!  


కరోనా లాక్ డౌన్స్ కాలంలో దేశ వ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. 2020, 2021 సంవత్సరాలు సినిమా వాళ్లకి ‘సినిమా’ చూపించేశాయి! అయితే, 2022లో మళ్లీ బాక్సాఫీస్ వద్ద జోష్ మొదలైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా రంగాల్లో చకచకా చిత్రాలు విడుదలవుతున్నాయి. ఫ్లాప్స్ ఎదురవుతోన్నప్పటికీ హిట్స్ కూడా కొత్త ఆశల్ని చిగురింపజేస్తున్నాయి. ఎటోచ్చీ బాలీవుడ్ కే ఇంకా బ్యాడ్ టైం కంటిన్యూ అవుతోంది. 


ఈ మధ్య కాలంలో బాలీవుడ్ వైపు చూస్తే మనకు స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఒకటి తరువాత ఒకటి కనిపిస్తాయి. అక్షయ్ లాంటి సీనియర్ నటించిన ‘బచ్చన్ పాండే’ ఇలా వచ్చి అలా పోయింది. అజయ్ దేవగణ్ ‘రన్ వే 34’ కూడా ఢమాల్. యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ నటించిన ‘హీరోపంతి 2’ వారానికే ఔట్. ‘కబీర్ సింగ్’ లాంటి హిట్ ఇచ్చిన షాహిద్ కూడా రీసెంట్ గా ‘జెర్సీ’ లాంటి ఫ్లాప్ మూటగట్టుకోక తప్పలేదు. ఇక తాజాగా రణవీర్ సింగ్ లాంటి సూపర్ స్టార్ ‘జయేశ్ భాయ్ జోర్ధార్’తో వచ్చి ఏ జోరూ చూపించలేకపోయాడు. రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేసిన దాని ప్రకారం కేవలం 11.75 కోట్లు వచ్చాయట! అదే సమయంలో, మన మహేశ్ బాబు స్టారర్ ‘సర్కారు వారి పాట’కి 135 కోట్లు వసూలయ్యాయని ఆర్జీవీ ఎత్తి చూపుతున్నాడు. అందుకే, ఇక మీదట ఓటీటీలకు సినిమాలు చేసుకొమ్మని బీ-టౌన్ ఫిల్మ్ మేకర్స్ కి సలహా కూడా ఇచ్చాడు!


వర్మతో పాటూ కంగనా లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా హిందీ దర్శకనిర్మాతల్ని తప్పుబడుతోంది. ఒకవైపు ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్’, ‘పుష్ప’ లాంటి సౌత్ నుంచీ బయలుదేరిన ప్యాన్ ఇండియా సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తుంటే... ‘డాక్టర్ స్ట్రేంజ్’ లాంటి హాలీవుడ్ విజువల్ వండర్స్ కూడా ఇండియాలో బోలెడన్ని స్క్రీన్స్ ని ఆక్రమించుకుంటున్నాయి. ఎలా చూసినా హిందీ మార్కెట్లోని మాస్ జనాలు సౌత్ దర్శకులు, హీరోలు తీసుకొస్తోన్న ప్యాన్ ఇండియా సినిమాలకు జైకొడుతున్నారు. హిందీలోని క్లాస్ ఆడియన్స్ హాలీవుడ్ సినిమాలకు సై అంటున్నారు. బాలీవుడ్ నుంచీ వచ్చే సినిమాలు రెంటికి చెడ్డ రేవడి అవుతున్నాయి... 


ఏవో నాలుగు హిందీ సినిమాలు వర్కవుట్ కాకపోతే బాలీవుడ్ పనైపోయినట్టు కాదు. అదీ ఒప్పుకోవాల్సిన విషయమే. ఈ మధ్య వచ్చిన ‘గంగూబాయ్’ ఎంతోకొంత ఫర్వాలేదనిపించింది. నెక్ట్స్ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ , సల్మాన్ ఖాన్ ‘టైగర్3’ భారీ బడ్జెట్, హైలైట్స్ తో రాబోతున్నాయి. ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ కూడా ఉంది. ఇలాంటి హిందీ సినిమాలు సత్తా చాటితే మరోసారి బీ-టౌన్ బాక్సాఫీస్ గాడిలో పడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఒక వైపు సౌత్ నుంచీ వస్తోన్న ‘ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, పుష్ప’ లాంటి సినిమాలు, మరోవైపు హాలీవుడ్ నుంచీ దిగుతోన్న సూపర్ హీరో చిత్రాలు దేశంలోని ప్రేక్షకులకి కొత్తదనం అందుబాటులోకి తెస్తున్నాయి. అందువల్ల హిందీ దర్శకనిర్మాతలు తమ రొటీన్ కమర్షియల్ ఫార్ములా సినిమాల్ని పక్కన పెట్టి కొత్తగా ఆలోచించాలి. దక్షిణాది చిత్రాల మాదిరిగా ఇండియాలోని నెటివిటిని చూపాలి, హాలీవుడ్ సినిమాల మాదిరిగా అద్భుతమైన క్వాలిటిని అందించాలి. అప్పుడే ఓటీటీల్ని కాదని జనం థియేటర్స్ కి వస్తారు. లేదంటే... లెటెస్ట్ బాలీవుడ్ రిలీజ్... ‘జయేశ్ భాయ్ జోర్ధార్’ మాదిరిగా కాల్వలో కొట్టుకుపోవటమే! 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...