ltrScrptTheme3

పవన్‌ వినమ్రత కలిగిన వ్యక్తి: బొమన్‌ ఇరానీ

Dec 17 2020 @ 19:13PM

వైరస్‌ అంటే ఇప్పుడందరూ కరోనా వైరస్‌ పేరు చెబుతారు కానీ.. వైరస్‌ అంటే ఒకప్పుడు బొమన్‌ ఇరానీ పేరు చెప్పేవారు. ఆయన నటించిన '3 ఇడియట్స్‌' చిత్ర విడుదల తర్వాత అందరికీ బొమన్‌.. వైరస్‌గా మారిపోయారు. ఆ తర్వాత ఎన్నో మంచి మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. టాలీవుడ్‌లోనూ ఆయన కొన్ని విజయవంతమైన సినిమాలలో నటించారు. ఇక కరోనాతో కొంతకాలంగా ఇంటికే పరిమితమైన బొమన్‌ ఇరానీ.. మళ్లీ షూటింగ్స్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో ముచ్చటించారు.  


*లాక్‌డౌన్‌లో షూటింగ్స్‌ లేవు. ఇంటి వద్దే ఉన్నారు.. ఎలా అనిపించింది? ఆ టైమ్‌లో ఏమేం చేశారు?

బొమాన్‌ ఇరానీ: నిజమే.. గడిచిన కొన్ని సంవత్సరాలుగా నేను చాలా బిజీబిజీగా గడుపుతూ వచ్చాను. విపరీతంగా తిరిగేవాడిని. విమాన ప్రయాణాలు విపరీతంగా ఉండేవి. మాకంటే మీరే ఎక్కువగా గాల్లో ఎగురుతున్నారని విమాన సిబ్బంది నాతో జోక్‌ చేసేవారు. ఇలా గడుపుతున్న నాకు ఒక రోజంతా ఇంట్లో ఉండటమంటే చాలా చిరాకు అనిపించింది. లాక్‌డౌన్‌ మొదలవ్వగానే తెలిసిపోయింది. ఇది ఇప్పట్లో పూర్తయ్యేది కాదని. 21 డేస్‌ కాదు.. ఇది చాలా రోజులు కొనసాగుతుందని అనిపించింది. అలాగే జరిగింది. ఈ టైమ్‌లో నన్ను నేను బిజీగా ఉంచుకోవడానికి చాలా ప్రయత్నించాను. ఎప్పుడూ సంతోషంగా ఉండడానికే ప్రయత్నించాను. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఏమేం పనులు చేయాలో ప్లాన్‌ చేసుకునేవాడిని. వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులతో నిత్యం ఇంటర్నెట్‌ ద్వారా మాట్లాడుతూ ఉండేవాడిని. కరోనా కారణంగా చాలా మంది డిప్రెషన్‌కు గురయ్యారు. ఆర్థికంగానూ చితికిపోయారు. అటువంటి వారందరినీ సంతోషపెట్టే పనులు చేయాలనిపించింది. ఈ క్రమంలో మిత్రుడు జానీ లివర్‌తో కలిసి పనిచేయడం మరో మంచి అనుభవం. అతని ద్వారా ఎందరిలోనో సంతోషం నింపే ప్రయత్నం చేశాం. ప్రత్యేకించి దివ్యాంగులైన పిల్లలను సంతోషపెట్టడం సంతృప్తినిచ్చింది. ఇలా నన్ను నేను బిజీగా ఉంచుకుంటూ ఈ లాక్‌డౌన్‌ టైమ్‌ గడిపేశాను. 


*మీ పాజిటివ్‌ దృక్పథం అద్భుతం.. మీరు మంచి ఫొటోగ్రాఫర్‌ అని మాకు తెలుసు. ఈ ఏడెనిమిది నెలల కాలంలో కొత్తగా ఏం నేర్చుకున్నారు?

బొమాన్‌ ఇరానీ: ఈ సమయంలో నేనూ కొంత వర్క్‌ చేశాను. అంతకుమించి యువ ఫొటోగ్రాఫర్లతో ముచ్చటించడం ఇంకా బాగుంది. వారి కెమెరాల్లో బంధించిన ఫొటోలను చూడటం ఇంకా సంతోషకరంగా అనిపించింది. అలాగే, ఈ లాక్‌డౌన్‌ కాలంలో యువ రచయితలతోనూ నా సంభాషణ సాగింది. సినిమాకు రచన ఎంతో ముఖ్యం. ఎంత ప్రతిభ కలిగిన దర్శకుడైనా చేతిలో సరైన స్ర్కిప్ట్ లేకుండా రాణించలేడు. రచనా రంగంలో నేనూ కొంత కాలం వర్క్‌ చేశాను. నాకూ గురువులున్నారు. ఆ అనుభవాన్ని యువ రచయితలతో పంచుకున్నాను. ఈ క్రమంలో 210 క్లాసులు నడిచాయి. ఇది సక్సెస్‌ఫుల్‌గా సాగిన ప్రయత్నమనే చెబుతాను. అంతిమంగా సినిమాకు స్ర్కిప్టే ప్రాణం. 


ఇంకా ఈ ఇంటర్వ్యూలో నటుడిగా ఎలా మారారు? నటనతో అందరి మనసులు దోచుకోవడానికి కారణం? టాలీవుడ్‌లో మొదటి అవకాశం ఎలా వచ్చింది? టాలీవుడ్‌ స్టార్లతో ఉన్న అనుబంధం? అత్తారింటికి దారేది సినిమాకి ఎలా ఒప్పించారు? మొదటి ఫిల్మ్‌.. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో నటించడం ఎలా అనిపించింది? లాక్‌డౌన్‌ తర్వాత అవకాశాలు ఎలా ఉన్నాయి? తెలుగులో ఎవరెవరితో టచ్‌లో ఉన్నారు? తప్పక చేయాలనుకుంటున్న పాత్ర? ఇప్పటి వరకు చేసిన పాత్రల్లో నచ్చిన పాత్రలు? వంటి ఎన్నో ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. అవేంటో తెలుసుకోవాలంటే పై వీడియో చూడాల్సిందే.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.