ఎల్‌వీబీ, డీబీఎస్ బ్యాంకుల విలీనంపై స్టేకు బోంబే హైకోర్టు నో

ABN , First Publish Date - 2020-11-27T02:58:03+05:30 IST

లక్ష్మీ విలాస్ బ్యాంకు (ఎల్‌వీబీ), డీబీఎస్ బ్యాంక్ ఇండియా విలీన ప్రక్రియపై స్టే విధించేందుకు బోంబే హైకోర్టు నిరాకరించింది...

ఎల్‌వీబీ, డీబీఎస్ బ్యాంకుల విలీనంపై స్టేకు బోంబే హైకోర్టు నో

ముంబై: లక్ష్మీ విలాస్ బ్యాంకు (ఎల్‌వీబీ), డీబీఎస్ బ్యాంక్ ఇండియా విలీన ప్రక్రియపై స్టే విధించేందుకు బోంబే హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్న ఈ రెండు బ్యాంకుల విలీనాన్ని సవాల్ చేస్తూ సంక్షోభంలో చిక్కుకున్న లక్ష్మీ విలాస్ బ్యాంకు, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రమోటర్లు బోంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ నితిన్ జందార్, జస్టిస్ మిలింద్ జాదవ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ‘‘విలీన ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని మేము తిరస్కరిస్తున్నాం. ఆర్బీఐ, ఎల్‌వీబీ, డీబీఎస్ బ్యాంక్ ఇండియా సహా ప్రతివాదులు అఫిడవిట్లు దాఖలు చేసిన తర్వాత డిసెంబర్ 14న మళ్లీ ఈ పిటిషన్లపై విచారణ చేపడతాం...’’ అని కోర్టు పేర్కొంది. కాగా ఎల్‌వీబీ డిపాజిటర్లు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ఎల్‌వీబీ, డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ విలీనానికి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-11-27T02:58:03+05:30 IST