బీడీ, సిగరెట్‌ నిషేధించండి: హైకోర్టు సూచన

ABN , First Publish Date - 2021-04-23T22:32:35+05:30 IST

కోవిడ్-19 రోగులను, ధూమపానం చేసేవారిని మేం ఒకే రకంగా భావిస్తున్నాం. బీడీలు, సిగరెట్లు తాగే వారికి కోవిడ్-19 ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కోవిడ్-19 ప్రభావం ఎక్కువగా ఊపిరితిత్తులపై పడుతుంది. ధూమపానం చేసే వారికి కూడా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం

బీడీ, సిగరెట్‌ నిషేధించండి: హైకోర్టు సూచన

ముంబై: కోవిడ్-19 దృష్ట్యా కొంతకాలం పాటు బీడీ, సిగరెట్ల అమ్మకాలను నిషేధించాలని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. కోవిడ్-19 వైరస్ కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతింటాయని, ధూమపానం వల్ల కూడా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం పడుతుందని హైకోర్టు తెలిపింది. గురువారం కోవిడ్-19 పరిస్థితపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పరిశీలించిన బాంబే హైకోర్టు.. ఈ విషయంపై స్పందిస్తూ కేంద్రంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి బీడీ, సిగరెట్ల నిషేధంపై సూచన చేసింది. దీనితో పాటు కోవిడ్-19 రోగులకు రెమ్‌డెవిసర్ మందులు వీలైనంత అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోగులు కానీ వారి బంధువులు కానీ మందుల కోసం ఎక్కడికో పరిగెత్తకుండా మందులను అందుబాటులో ఉంచాలని హైకోర్టు సూచించింది.


‘‘కోవిడ్-19 రోగులను, ధూమపానం చేసేవారిని మేం ఒకే రకంగా భావిస్తున్నాం. బీడీలు, సిగరెట్లు తాగే వారికి కోవిడ్-19 ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కోవిడ్-19 ప్రభావం ఎక్కువగా ఊపిరితిత్తులపై పడుతుంది. ధూమపానం చేసే వారికి కూడా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం పడుతుందని అందరికీ తెలిసిందే. దీని గురించి పబ్లిక్ డొమైన్‌లో ఎలాంటి సమాచారాన్ని ప్రభుత్వాలు పొందుపర్చలేదు. ఇది నిజంగా ప్రమాదకరమే అయితే దీనికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బీడీ, సిగరెట్ల అమ్మకాలు కొంతకాలం పాటు నిషేధిస్తే బాగుంటుందని ప్రభుత్వాలను మేం కోరుతున్నాం’’ అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

Updated Date - 2021-04-23T22:32:35+05:30 IST