Maharashtra Social Reformers: సాంఘిక సంస్కర్తల రచనలపై అవగాహన కల్పించండి : హైకోర్టు

ABN , First Publish Date - 2022-07-21T21:51:25+05:30 IST

కాలంలోపాటు ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని మహారాష్ట్ర (Maharashtra

Maharashtra Social Reformers: సాంఘిక సంస్కర్తల రచనలపై అవగాహన కల్పించండి : హైకోర్టు

ముంబై : కాలంలోపాటు ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వాన్ని బోంబే హైకోర్టు (Bombay High Court) ఆదేశించింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ (Dr. Baba Saheb Ambedkar) వంటి సాంఘిక సంస్కర్తల రచనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పింది. అనేక మంది సాంఘిక సంస్కర్తల చేతిరాత ప్రతులను రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిందని, కానీ దురదృష్టవశాత్తూ వాటి గురించి చాలా మందికి తెలియదని పేర్కొంది. 


డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాహిత్యాన్ని ప్రచురించే కార్యక్రమాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిలిపేసిందని వెలువడిన మీడియా కథనాలపై హైకోర్టు స్వీయ విచారణ జరుపుతోంది. 2021 డిసెంబరులో ఈ కేసును విచారణకు చేపట్టింది. 


అనేక మంది సాంఘిక సంస్కర్తల సాహిత్యాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిందని, ఇది చాలా అద్భుతమైన ప్రాజెక్టు అని జస్టిస్ ప్రసన్న వరలే, జస్టిస్ కిషోర్ సంత్ డివిజన్ బెంచ్ గురువారం పేర్కొంది. అయితే ఈ ప్రచురణల గురించి చాలా మందికి అవగాహన లేదని తెలిపింది. వీటి గురించి ప్రభుత్వం అవగాహన కల్పించాలని చెప్పింది. 


‘‘అనేక మంది సాంఘిక సంస్కర్తల రచనలను మహారాష్ట్ర ప్రభుత్వం ప్రచురించింది. కానీ వాటి గురించి ఎందరికి తెలుసు? దశాబ్దాల క్రితం ఈ పుస్తకాలను ప్రచురించారు. వీటిలో కొన్ని చాలా అద్భుతమైనవి. జాగ్రత్తలు తీసుకోలేదు. పాఠకులను పుస్తకాల దుకాణాలకు తీసుకురావాలి’’ అని ధర్మాసనం పేర్కొంది. 


‘‘మీరు (రాష్ట్ర ప్రభుత్వం) కాలంతోపాటు మీ ఆలోచనా ధోరణిని మార్చుకోవాలి. గతంలో ప్రజలు పుస్తకాల దుకాణాలకు వెళ్ళేవారు, కానీ ఇప్పుడు అన్నీ ఇంటి గుమ్మం దగ్గరే అందుబాటులో ఉంటున్నాయి. ప్రచురణకర్తలు ప్రజలను దుకాణాలకు రప్పించుకోవాలి’’ అని జస్టిస్ వరలే అన్నారు. అవగాహన కల్పించడానికి ఎటువంటి చర్యలను చేపట్టడం లేదన్నారు. దృఢమైన, సకారాత్మక (Positive) కృషి చేయాలని తెలిపారు. ప్రభుత్వ పుస్తకాల దుకాణాలు ఎక్కడ ఉన్నాయో చాలా మందికి తెలియవని చెప్పారు. 


తాను కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వ అఫిడవిట్‌లో తెలియజేయలేదని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేయడం, దానిలోని సభ్యుల పేర్లు, ఏమైనా సమావేశాలు జరిగాయా? ఆ సభ్యులకు ఇచ్చే పారితోషికం వంటి వివరాలేవీ లేవని పేర్కొంది. రెండు వారాల్లోగా అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాది పూర్ణిమ కాంతారియాను ఆదేశించింది. ప్రభుత్వ వైఖరి సంతృప్తికరంగా లేదని జస్టిస్ వరలే అన్నారు. 


ప్రభుత్వ న్యాయవాది పూర్ణిమ కాంతారియా మాట్లాడుతూ కళాశాలలు, విద్యా సంస్థలకు డాక్టర్ అంబేద్కర్ రచనలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, ఈ మాటలను కమిటీ చెప్పాలని తాము కోరుకుంటున్నామని, ప్రభుత్వం చెప్పాలని కాదని తెలిపింది. పుస్తకాలు పాఠకులకు చేరుతున్నట్లు కమిటీ ఓ ప్రకటన చేయాలని పేర్కొంది. ఈ పుస్తకాలు సమంజసమైన సమయంలో ప్రచురితమయ్యేందుకు తగిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందా? అనే విషయం అవసరమని తెలిపింది. 


Updated Date - 2022-07-21T21:51:25+05:30 IST