వెదురుకుప్పంలో నాటుబాంబుల కలకలం !

ABN , First Publish Date - 2021-07-25T06:38:45+05:30 IST

వెదురుకుప్పంలో శుక్రవారం రాత్రి నాటుబాంబులు పోలీసులకు పట్టుబడటంతో కలకలం చెలరేగింది

వెదురుకుప్పంలో నాటుబాంబుల కలకలం !
పోలీసులు స్వాధీనం చేసుకున్న నాటుబాంబులు

వన్యప్రాణుల వేటకా? హత్యలకా?

ఉలిక్కిపడ్డ వెదురుకుప్పం


 వెదురుకుప్పం, జూలై 24: వెదురుకుప్పంలో శుక్రవారం రాత్రి నాటుబాంబులు పోలీసులకు పట్టుబడటంతో కలకలం చెలరేగింది. అవి వన్యప్రాణుల వేటకా? హత్యలకా? పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. ఇరవై నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లె పంచాయతీ మహేశ్వరపురానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఒక సంచిలో సుమారు ఇరవై నాటుబాంబులను, కోడిపుంజును పెట్టుకుని స్కూటర్‌లో దేవళంపేట వైపు బయలుదేరారు. మార్గమధ్యంలో గొడుగుచింత వద్ద పోలీసులను చూసి నాటుబాంబుల సంచి చేతిలో ఉన్న వ్యక్తిని వదిలేసి మిగతా ఇద్దరు బైక్‌లో పరారయ్యారు. సంచితో ఉన్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం. కార్వేటినగరం సీఐ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో లోతుగా దర్యాప్తు చేపట్టారని తెలిసింది. ఈ కేసు పురోగతి కోసం మహేశ్వరపురానికి పోలీసులు వెళ్లారు. ఇంతకీ ఆ నాటు బాంబులు దేని కోసం తరలిస్తూ పట్టుపడ్డారో అంతుచిక్కడం లేదు. వన్యప్రాణుల వేటకా? హత్యలకా? తెలియడం లేదు.  


బ్రాహ్మణపల్లె మరోసారి తెరపైకి..


గతంలో బ్రాహ్మణపల్లె నాటుబాంబులకు ప్రసిద్ధి అని ప్రచారం. అప్పట్లో వన్యప్రాణులైన అడవిపందులు, జింకలు, దుప్పిల కోసం నాటుబాంబులు పెట్టేవారని ప్రచారం ఉంది. ఈ ప్రాంతంలోనే నాటుబాంబులను తయారీ చేసేవారని సమాచారం. అయితే బ్రాహ్మణపల్లెలో పొలాల వద్ద గొడవలు చోటుచేసుకోవడంతో ఇరువర్గాలు రెచ్చిపోయి 1983-1985 మధ్య కాలంలో నాటుబాంబులు వేసుకున్నారు. ఆ సమయంలో  ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి ఆ తర్వాత చనిపోయాడు. ఆ  ఘటనతో బ్రాహ్మణపల్లె కాస్త బాంబుల బ్రాహ్మణపల్లెగా పేరుగాంచింది. 


పోలీసులకు సవాల్‌గా....


 మండలంలో నాటు బాంబుల కలకలం పోలీసులకు సవాల్‌గా మారింది. ఒక్క బ్రాహ్మణపల్లె పంచాయతీలోనే కాదు... మాంబేడు, తిరుమలయ్యపల్లె, కురివికుప్పం, గంటావారిపల్లె, పల్లాలు, ఆళ్లమడుగు పంచాయతీల్లో కూడా వన్యప్రాణుల వేటకు నాటు బాంబుల వాడకం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి నాటుబాంబులకు కేవలం వన్యప్రాణులే కాకుండా గోవులు సైతం ఇదివరలో చనిపోయిన ఘటనలు ఉన్నాయి. వన్యప్రాణుల వేటగాళ్లు ఈ నాటుబాంబులను విచ్చలవిడిగా వాడుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా పోలీసు వర్గాలు పసిగట్టి నాటుబాంబుల తయారీదారులు, వేటగాళ్ల ఆటలకు కళ్లెం వేయాలని పలువురు కోరుతున్నారు. 



Updated Date - 2021-07-25T06:38:45+05:30 IST