‘బొమ్మ’ ఏమవుతుందో?

ABN , First Publish Date - 2022-06-27T04:59:04+05:30 IST

సినిమా టికెట్ల విక్రయాలకు సంబంధించి ప్రభుత్వం, ఎగ్జిబిటర్ల మధ్య వివాదం ముదురుతోంది.

‘బొమ్మ’ ఏమవుతుందో?

ఎగ్జిబిటర్లు, ప్రభుత్వం మధ్య ఆనలైన వివాదం

ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ ద్వారా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం

ఎంవోయూ చేసుకోవాలంటూ ఎగ్జిబిటర్లపై ఒత్తిడి

టికెట్ల డబ్బు చెల్లింపుపై స్పష్టత కరువు

ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలంటున్న ఎగ్జిబిటర్లు 

ఇప్పటికే పలు జిల్లాల్లో హాళ్లు మూసేస్తున్నట్లు ప్రకటన

నేడు జిల్లాలో కీలక సమావేశం?



‘ఆనలైనలో సినిమా టికెట్లు మేమే విక్రయిస్తాం. వసూళ్ల సొమ్ము నేరుగా మా ఖాతాల్లోకి చేరుతుంది. అందులో సేవా పన్నును మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని మీ ఖాతాల్లోకి జమ చేస్తాం. దీనికి అంగీకరిస్తూ ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీతో ఒప్పందం చేసుకోవాలి. లేకపోతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’.

- థియేటర్ల యజమానులకు ప్రభుత్వం జారీ చేసిన అల్టిమేటం. 



నెల్లూరు, జూన 26 (ఆంధ్రజ్యోతి) : సినిమా టికెట్ల విక్రయాలకు సంబంధించి ప్రభుత్వం, ఎగ్జిబిటర్ల మధ్య వివాదం ముదురుతోంది. ఆనలైన ద్వారా ప్రభుత్వమే విక్రయాలు జరిపేలా ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీతో నెలరోజుల్లోపు ఒప్పందం చేసుకోవాలని ఈ నెల 2వ తేదీన ప్రభుత్వం ఎగ్జిబిటర్లకు ఉత్వర్వులిచ్చింది. ఆ గడువు త్వరలో ముగి యనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన మేరకు ఎంవోయూ చేసుకోవాలంటూ రెవెన్యూ అధికారులు ఎగ్జిబిటర్లను ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని ప్రదర్శన దారులతో జాయింట్‌ కలెక్టర్‌ ఓ సారి సమావేశమయ్యారు. ఆ సందర్భంగా పలు అంశాలను ఎగ్జిబిటర్లు ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రభుత్వం ఎన్ని రోజుల్లోపు డబ్బులు తిరిగి జమ చేస్తుందన్నదానిపై జీవోలో స్పష్టత లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని జేసీని కోరగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకె ళుతామని సమాధానమిచ్చారు. అయితే గడువు ముగుస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్‌ యజమానుల సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేయలేదు. ఈ నేపథ్యంలో సోమవారం మరోమారు ఎగ్జిబిటర్లతో జేసీ సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ కీలక భేటీలో అటు అధికార యంత్రాంగం, ఇటు ఎగ్జిబిటర్లు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. 


ఎంతో మంది.. ఎంతో ఖర్చు


సినిమా అనేది ఒకరితో కూడుకున్నది కాదు. నిర్మాతల మొదలు డిసి్ట్రబ్యూటర్లు, సబ్‌ డిస్ర్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల వరకు అంతా సక్రమంగా పనిచేస్తేనే వ్యవస్థ నడుస్తుంది. డిసి్ట్రబ్యూటర్లు అటు సబ్‌ డిసి్ట్రబ్యూటర్లు, ఇటు థియేటర్‌ యజమానుల నుంచి కొంత మొత్తాన్ని అడ్వాన్సుగా తీసుకుని, మరికొంత రోజువారీ వడ్డీకి అప్పు తెచ్చి నిర్మాతలకు చెల్లించి సినిమాను కొనుగోలు చేస్తారు. సినిమా ప్రదర్శన మొదలయ్యాక రెండు, మూడు రోజుల్లోనే ఎగ్జిబిటర్లు, సబ్‌ డిసి్ట్రబ్యూటర్లు మిగిలిన మొత్తాన్ని డిసి్ట్రబ్యూటర్లకు చెల్లిస్తుంటారు. వారు నిర్మాతలకు అందజేస్తుంటారు. ఇదంతా ఎప్పటికప్పుడు జరిగి పోతూ ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. 


సకాలంలో ఇస్తారా..?


సినిమా టికెట్ల విషయంలో పారదర్శకత కోసమే ఆనలైన విధానం తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా ప్రభుత్వానికి రావాల్సిన పన్ను పూర్తిస్థాయిలో జమవుతుందని చెబుతోంది. ఇంత వరకు బాగానే ఉంది. అయితే సినిమా ప్రదర్శనలో కీలకమైన థియేటర్ల యజమానుల హక్కులు కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా అన్నదే చర్చగా మారింది. టికెట్ల డబ్బు సకాలంలో తిరిగి ఇస్తూ, కొన్ని సమస్యలను పరిష్కరిస్తే ఆనలైనలో టికెట్ల విక్రయానికి ఆంధ్రప్రదేశ రాష్ట్ర ఫిల్మ్‌, టెలివిజన, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన(ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ)తో ఎంవోయూ చేసుకోవడానికి ఎటు వంటి అభ్యంతరం లేదని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఓటీటీ హవా కొనసాగు తున్న తరుణంలో ఎంత పెద్ద సినిమా అయినా రెండు వారాలకు మించి థియేటర్లలో ప్రదర్శించే పరిస్థితి లేకుండాపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నేరుగా టికెట్లు విక్రయించి ఆ సొమ్మును సకాలంలో థియేటర్ల యజమానులకు తిరిగి ఇవ్వకపోతే పెద్ద సమస్యే ఎదురవుతుంది. ఈ అంశమే ఇప్పుడు ఎగ్జిబిటర్లను కలవరపె డుతోంది. దీనికితోడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. తమకు ఇవ్వాల్సిన టికెట్‌ డబ్బును ఎన్ని రోజుల్లో జమ చేస్తారో స్పష్టంగా చెప్పాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అదే సమయంలో టికెట్లు విక్రయించాక ఏవైనా కారణాలతో సినిమా ప్రదర్శించలేకపోతే ప్రేక్షకులకు తిరిగి ఎలా డబ్బు  చెల్లించాలన్నదానిపై కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇటువంటి మరికొన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తే తాము ఒప్పందం చేసుకునేందుకు ముందుకొస్తామని అంటున్నా రు. ఇదిలాఉండగా, ప్రభుత్వ వైఖరితో తాము సినిమాలను ప్రదర్శించలేమని, రేపటి నుంచి థియేటర్లు మూసివేస్తున్నట్లు గోదావరి జిల్లాల ఎగ్జిబిటర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత వివాదానికి ఎప్పుడు ‘తెర’ పడుతుందా.. అని సగటు ప్రేక్షకుడు ఎదురు చూస్తున్నాడు. 

Updated Date - 2022-06-27T04:59:04+05:30 IST