RS, MLC అభ్యర్థుల ఖరారుపై Bommai కసరత్తు

ABN , First Publish Date - 2022-05-21T19:54:35+05:30 IST

రాజ్యసభ, విధాన పరిషత్ ఎన్నికల కసరత్తును కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్...

RS, MLC అభ్యర్థుల ఖరారుపై Bommai కసరత్తు

న్యూఢిల్లీ: రాజ్యసభ (RS), విధాన పరిషత్ (MLC) ఎన్నికల కసరత్తును కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చేపట్టారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి బీజేపీ కర్ణాటక ప్రధాన కార్యదర్శి, ఇన్‌చార్జి అర్జున్ సింగ్‌తో శనివారంనాడు ఆయన చర్చలు జరిపారు. అయితే, పెండింగ్‌లో ఉన్న క్యాబినెట్ విస్తరణ అంశం ఈ చర్చల్లో ప్రస్తావనకు రాలేదు.


పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు శుక్రవారంనాడు ఢిల్లీకి వెళ్లిన బసవరాజ్ బొమ్మై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిని కలసుకున్నారు. పార్టీ స్టేట్ కమిటీలోకి ఎవరిని తీసుకోవాలనే విషయంపై అరుణ్ సింగ్‌ను  కలిసి చర్చించారు. కాగా, షెడ్యూల్ ప్రకారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలవాల్సి ఉన్నప్పటికీ ఆయన బిజీగా ఉండటంతో కలుసుకోలేదని బొమ్మై చెప్పారు. అయితే ఫోనులో తాను అమిత్‌షాతో మాట్లాడానని, అరుణ్ సింగ్‌ను కలవమని చెప్పడంతో ఆయనను కలుసుకున్నానని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. బీజేపీ నేతలు ఒకటి రెండ్రోజుల్లో అభ్యర్థుల జాబితా పంపుతారని అన్నారు. ఆదివారం ఉదయం దేవోస్ వరల్డ్ ఎకానమీ ఫోరంలో పాల్గొనేందుకు సీఎం వెళ్తున్నందున దీనికి ముందే అభ్యర్థుల జాబితా ఖరారు చేయాలని సీఎం అనుకుంటున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నారు.


కౌన్సిల్ ఎన్నికల కోసం నామినేషన్ల గడువు ఈనెల 24తో ముగియనుండగా, రాష్ట్రం నుంచి రాజ్యసభకు జరిగే ఎన్నికల కోసం నామినేషన్ల గడువు ఈనెల 31తో ముగుస్తుంది. కౌన్సిల్ ఎన్నికలు జూన్ 3న, రాజ్యసభ ఎన్నికలు జూన్ 10న జరుగుతాయి. 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా, రెండు సీట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలుచుకుంటామని, మరో సీటు జేడీ(ఎస్)తో మద్దతుతో గెలుస్తామని బీజేపీ ధీమాతో ఉంది. ఏడు కౌన్సిల్ సీట్ల కోసం 12 మందికి పైగా పేర్లను కేంద్ర ఎన్నికల ప్యానెల్‌కు బీజేపీ రాష్ట్ర యూనిట్ సిఫారసు చేసింది. వీరిలో మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడి పేరు కూడా ఉంది.

Updated Date - 2022-05-21T19:54:35+05:30 IST