దళిత మహిళల సాంఘిక బహిష్కరణ.. వైసీపీ నేత మద్దతుతో దుశ్చర్య

ABN , First Publish Date - 2020-09-23T17:05:48+05:30 IST

‘వారితో ఎవరూ మాట్లాడకూడదు. వారి ఇళ్లకూ వెళ్లకూడదు. శుభకార్యాలకు..

దళిత మహిళల సాంఘిక బహిష్కరణ..  వైసీపీ నేత మద్దతుతో దుశ్చర్య

చంద్రగిరి(చిత్తూరు): ‘వారితో ఎవరూ మాట్లాడకూడదు. వారి ఇళ్లకూ వెళ్లకూడదు. శుభకార్యాలకు పిలవకూడదు. సహాయం చేయకూడదు’ అంటూ ఆరు నెలల కిందట ముగ్గురు ఒంటరి దళిత మహిళలను సాంఘిక బహిష్కరణ చేశారు. ఈ పంచాయితీ పోలీసుల సాక్షిగా జరిగిందంటూ ఆ మహిళలు వాపోయారు. తరచూ దళితవాడ పెద్దల దౌర్జన్యాలు పెరగడంతో మీడియా ఎదుటకు వచ్చామన్నారు చంద్రగిరి మండలం బూడిదగట్టు దళితవాడకు చెందిన కళావతి, సుహాసిని, కామేశ్వరి. తమకు ఎదురైన ఆవేదనను మంగళవారం మీడియాకు వెల్లడించారు.


వారు చెప్పిన ప్రకారం.. కుటుంబ కలహాల కారణంగా భర్తలను వదిలేసి కళావతి, సుహాసిని, కామేశ్వరి పదేళ్ల కిందట పుట్టింటికి చేరుకున్నారు. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ఇంటి స్థలాలు మంజూరయ్యాయి. తమ ప్రమేయం లేకుండా ఇంటి స్థలాలు మంజూరు చేయించుకోవడంపై దళితవాడ పెద్దలు ఆగ్రహించారు. ఆ ఊరిలో సెంటు భూమి కూడా ఇచ్చేందుకు వీలులేదని తీర్మానం చేశారు. దీనిపై వారు రెవెన్యూ అధికారులకు, పోలీసులకు మార్చి 6న ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐ రామచంద్రారెడ్డి దూషిస్తూ.. అవహేళనగా మాట్లాడి, గ్రామంలోనే సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో వారు ఆ ప్రాంత వైసీపీ నాయకుడిని కలవగా.. దళితవాడ పెద్దలపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేసి, వాళ్లు చెప్పినట్లు వినకపోతే తీవ్ర ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.


మళ్లీ దళితవాడ పెద్దలు పోలీసుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి ఆ ముగ్గురిని బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. ఊరిలో వారితో ఎవరూ మాట్లాడకూడదని, శుభ కార్యాలకు పిలవకూడదని, వారి ఇళ్లకు ఎవరూ వెళ్లకూడదని, సహాయం చేయరాదని ఆంక్షలు విధించారు. దీంతో మార్చి రెండో వారం నుంచి ఈ మహిళలను బహిష్కరించారు. రెండు నెలలు క్రితం సుహాసిని, కామేశ్వరి వైసీపీ నేత వద్దకు వెళ్లి తమ గోడును విన్నవించారు. ఆయన ఆదేశాల మేరకు ఒక్కొక్కరు రూ.5 వేల జరిమానా చెల్లిస్తే బహిష్కరణ ఎత్తివేస్తామని దళితవాడ పెద్ద చెప్పారు. దీనిపై దళిత సంఘాలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ తమపై దౌర్జన్యం చేస్తుండటంతో ఇప్పుడు మీడియాను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. 


బహిష్కరణపై ఫిర్యాదు చేస్తే కేసు పెడతాం 

ప్రభుత్వమిచ్చే ఇంటి స్థలాలకు గ్రామ పెద్దలు అడ్డుకుంటున్నారని బూడిదగట్టు దళితవాడకు చెందిన ముగ్గురు ఒంటరి మహిళలు గతంలో తనకు ఫిర్యాదు చేశారని సీఐ రామచంద్రారెడ్డి తెలిపారు. వీరిని ఎస్‌ఐ చిన్నరెడ్డప్ప వద్దకు పంపానన్నారు. తాను వారిని దూషించలేదన్నారు. కాగా, ఎస్‌ఐ చిన్నరెడ్డప్ప వద్దకు కొందరు గ్రామ పెద్దలు వచ్చి ఈసమస్యను పంచాయితీ నిర్వహించి పరిష్కరించుకొంటామని చెప్పడంతో వారు వెళ్లిపోయారన్నారు. ఆ తర్వాత వారు రాలేదని, బహిష్కరణపై వారు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని చెప్పారు. 


Updated Date - 2020-09-23T17:05:48+05:30 IST