ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల దందా

ABN , First Publish Date - 2022-08-08T05:56:40+05:30 IST

పట్టణంలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల దందా కొనసాగుతోంది. పుస్తకాల పేరిట విద్యార్థుల తల్లిదండ్రులపై పాఠశాలల యాజ మాన్యాలు వేలకు వేలు ఫీజుల భారం మోపుతున్నారు.

ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల దందా

పొదిలి రూరల్‌ ఆగస్టు 7 : పట్టణంలోని పలు ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల దందా కొనసాగుతోంది. పుస్తకాల పేరిట విద్యార్థుల తల్లిదండ్రులపై పాఠశాలల యాజ మాన్యాలు వేలకు వేలు ఫీజుల భారం మోపుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. పుస్తకాల ధరలపై విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశ్నించినా.., మా రేటింతే ఇకపై మీ ఇష్టం అని చెబుతున్నారని వారు వాపోతున్నారు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో మెరుగైన విద్యతోనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం ఎంతైనా వెచ్చించి నాణ్యమైన విద్యను అందించేందుకు పోటీ పడుతున్నారు. ఈ పోటీనే ప్రైవేటు పాఠశాలల పాలిట కల్ప తరవుగా మారుతోంది. ఓ వైపు ఫీజులు  మోత మోగిస్తుండగా మరో పుస్తకాల కొనుగోలు పేరుతో అదనపు భారం మోపుతున్నారు. 

పొదిలి మండలంలో మొత్తం 12 ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలున్నాయి. వీటిలో పూర్తిస్థాయి వసతులున్న పాఠశాలలను వేళ్లమీదే లెక్కపెట్టవచ్చు. మౌలిక వసతుల లేమి.., విద్యార్థులకు సరిపడా ఆటస్థలాల కొరత, తరగతి గదుల కొరత ఉంది. అయినప్పటికీ, అధికారులు మాత్రం ఆ వైపు కన్నేత్తి చూసిన పాపాన పోవడం లేదు. ఇలా అరకొర  వసతులతో పాఠశాలలు నిర్వహిస్తున్నా.., ఫీజుల వసూళ్లలో మాత్రం పోటీపడి మరి వసూలు చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు పుస్తకాల దోపిడి అదనంగా ఉంటోంది.

నిబందనల ప్రకారం.. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో కూడా ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లోని పాఠ్యాంశాలను మాత్రమే బోధించాలి. దీనికి సంబంధించి వారి విద్యార్థుల సంఖ్యను బట్టి ఎంఈవో కార్యాలయం ద్వారా వీరు పాఠ్యపుస్తకాలు తెప్పించుకోవాలి. ఇక నోటు పుస్తకాలు విద్యార్థుల అవసరాన్ని బట్టీ తల్లిదండ్రులు సమకూర్చుకోవాల్సి  ఉంటుంది. అయితే ఇక్కడ పాఠ్యపుస్తకాలకు, నోటు పుస్తకాలకు గంపగుత్తగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల విద్యార్థుల తల్లిదండ్రులను నగదు వసూలు చేస్తున్నాయి. పుస్తకాల కొనుగోలు ధరల కంటే రెట్టింపు ధరలను వసూలు చేయడం గమనార్హం.

ప్రభుత్వ ధరల ప్రకారం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్య పుస్తకాల ధరలు రూ.280 నుంచి 648  వరకు ఉన్నాయి. వీటికి తోడు అదనంగా నోటు పుస్తకాలు కొనుగోలు చేయాల్సి ఉంది. పెద్ద తరగతులకు నోటు పుస్తకాల ఖర్చు కాస్త ఎక్కువగా ఉంటుందనుకున్నా.. గరిష్ఠంగా రూ.1500 మించి ఉండదు. అన్ని కలిపి పదో తరగతికి కూడా రూ.2 వేలతో పుస్తకాల ఖర్చు సరిపోవాల్సి ఉంది. అయితే ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా పుస్తకాల ధరల మోత మోగిస్తున్నాయి. చిన్న తరగతులకే రూ.3 వేలు వసూలు చేస్తుండగా, పెద్ద తరగతులకు రూ.8 వేలు  వరకు వసూలు చేస్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఆ వైపు కన్నేత్తి చూడడం లేదు. ఒకరిద్దరూ ఫిర్యాదు చేసిన తర్వాత తమ పిల్లలను పాఠశాల యాజమాన్యాలు వేధిస్తాయోమన్న ఆందోళన నెలకొంది.  దీనిపై ఎంఈవో రఘురామయ్య మాట్లా డుతూ.. ఎక్కువ ధరలకు పుస్తకాలు అమ్ముతున్నారనే సమాచారం ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రాకపోవడంతో తామేమి చేయలేక పోతున్నామని పేర్కొన్నారు. ఇక ఈ నెల 4న ఆర్జేడీ సుబ్బారావు దర్శిలో అన్ని పాఠశాలలతో సమావేశం ఏర్పాటు చేసి ఇండెంట్‌ పెట్టిన పుస్తకాలు తప్పనిసరిగా తీసుకొని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయాలు .జరపాలని చెప్పినా..., వాస్తవంలో మాత్రం అమలుకావడం లేదు.

Updated Date - 2022-08-08T05:56:40+05:30 IST