పాఠశాలలకు పుస్తకాలు

ABN , First Publish Date - 2021-08-03T05:56:52+05:30 IST

ఈ నెల 16 నుంచి పాఠశాలలు తెరుచుకోనుండడంతో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది.

పాఠశాలలకు పుస్తకాలు

1 నుంచి 8 తరగతులకు మొదటి సెమిస్టర్‌ పుస్తకాలు సిద్ధం

16న స్కూళ్లు తెరిచిన రోజే విద్యార్థులకు పంపిణీ


గాజువాక, ఆగస్టు 2: ఈ నెల 16 నుంచి పాఠశాలలు తెరుచుకోనుండడంతో  విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. జిల్లాలోని 43 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన  26,63,246 పాఠ్య పుస్తకాలు ఈ ఏడాది మే మొదటి వారంలోనే విజయవాడలోని పాఠ్యపుస్తకాల ముద్రణ కేంద్రం నుంచి ఆటోనగర్‌లో గల జిల్లా ప్రభుత్వ పాఠ్య పుస్తకాల విక్రయ కేంద్రానికి వచ్చాయి. వాటిని జిల్లా విద్యాశాఖ అధికారులు జూన్‌, జూలై నెలల్లో మండల రిసోర్స్‌ సెంటర్‌లకు తరలించారు. ఆయా మండల రిసోర్స్‌ సెంటర్ల నుంచి పాఠశాలలకు పంపిణీ చేశారు.  నూతన విద్యా విఽధానంలో 1 నుంచి 5 తరగతుల వరకు మూడు సెమిస్టర్లుగా పుస్తకాలు విభజించారు. 6,7,8 తరగతులకు రెండు సెమిస్టర్లు ఉంటాయి, 9, 10 తరగతులకు పాత విధానమే కొనసాగుతుంది. దీంతో 1 నుంచి 8 తరగతులకు మొదటి సెమిస్టర్‌, 9,10 తరగతులకు మొత్తం సిలబస్‌తో కూడిన పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తారు. ఏడో తరగతి సిలబస్‌ మారిందని, కొత్త పుస్తకాలు వచ్చేశాయని జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులకు పాఠశాలలు తెరిచిన మొదటి రోజునే పుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు.


కరోనా కేసులు 50


విశాఖపట్నం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసులు తగ్గాయి. ఆదివారం 170 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, సోమవారం 50 మందికి  వైరస్‌ సోకినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. వీటితో మొత్తం  కేసుల సంఖ్య 1,53,176కు చేరింది. ఇందులో 1,50,512 మంది కోలుకోగా, మరో 1611 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, కొవిడ్‌ బారినపడి ఇప్పటివరకు 1053 మంది మృతిచెందారు. 


60 వేల డోసుల కొవిషీల్డ్‌, 20 వేల డోసుల కొవాగ్జిన్‌ రాక

జిల్లాకు 80 వేల డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చింది. ఇందులో 60 వేలు డోసుల కొవిషీల్డ్‌, 20 వేల డోసుల కొవాగ్జిన్‌ వున్నట్టు అధికారులు తెలిపారు. వీటిని గ్రామీణ, నగర పరిధిలోని వ్యాక్సిన్‌ కేంద్రాలకు సరఫరా చేసినట్టు చెప్పారు. భారీమొత్తంలో రావడంతో వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-08-03T05:56:52+05:30 IST