
న్యూఢిల్లీ : అస్సాం-అరుణాచల్ ప్రదేశ్ మధ్య సరిహద్దు వివాదం వచ్చే ఏడాదికల్లా పరిష్కారమవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన శనివారం తిరప్ జిల్లా, నరోత్తమ్ నగర్లో ఉన్న రామకృష్ణ మిషన్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయనతోపాటు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రామకృష్ణ మిషన్ ఆశ్రమం స్వర్ణోత్సవాల సందర్భంగా అమిత్ షా, కిరణ్ రిజిజు ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలావుండగా, ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు, అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభిస్తారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమా బల్ (SSB) సిబ్బందితో మాట్లాడతారు. దేశ సరిహద్దులను, అంతర్గత భద్రతను కాపాడే బాధ్యతను ITBP, SSBలు నిర్వహిస్తున్నాయి.
లోహిత్ జిల్లాలోని పరశురామ్ కుండ్ వద్ద భగవాన్ పరశురామ్ (Parasuram) 51 అడుగుల ఎత్తయిన విగ్రహానికి అమిత్ షా శనివారం శంకుస్థాపన చేస్తారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఆయన నమ్సయి టౌన్లో సోషల్ ఆర్గనైజేషన్స్ సమావేశంలో మాట్లాడతారు. అనంతరం అక్కడికి సమీపంలోని గోల్డెన్ పగోడా టెంపుల్లో ప్రార్థనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారు.
ఇవి కూడా చదవండి