సరిహద్దుల్లో జోరుగా పేకాట

ABN , First Publish Date - 2022-06-28T06:39:54+05:30 IST

రాష్ట్ర సరిహద్దులోని అటవీ ప్రాంతంలో జోరుగా పేకాట సాగు తోంది.

సరిహద్దుల్లో జోరుగా పేకాట

  • చేతులు మారుతున్న లక్షలాది రూపాయలు 
  • పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటూ విమర్శలు 

ఎటపాక, జూన్‌26: రాష్ట్ర సరిహద్దులోని అటవీ ప్రాంతంలో జోరుగా పేకాట సాగు తోంది. గత కొన్ని రోజులుగా తునికిచెరు వు- బొజ్జిగుప్ప గ్రామాల మధ్యలో అటవీ ప్రాంతంతో పాటు మేడివాయిలోని పాల్‌ రాజు ఇంజనీరింగ్‌ కళాశాల వెనుక భాగం లో ఓ మామిడితోటలో యథేచ్ఛగా పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా పేకాట డెన్‌ కొనసా గుతోంది. ఈ డెన్‌లు పోలీస్‌ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉండడంతో సర్వ త్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు తెర వెనుక అనుమ తులు ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. భద్రాచలానికి చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి పేకాట దందాను నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ప్రదేశాల్లో ఎవరికీ అనుమానం రాకుండా ఉండేం దుకు  వారంలో సగం రోజుల పాటు ఒక చోట, మరో సగం రోజులు ఒక చోట శిబిరాలను నిర్వహిస్తూ లక్షలు గడిస్తున్నారు. అయితే ఈ డెన్‌ల వద్ద కిలోమీటర్ల దూరంలోనే ప్రైవేటు సిబ్బంది కాపలాగా ఉంటారు. పేకాట ఆడేందుకు వచ్చే జూదగాళ్లకు తప్ప మిగతా వారికి ప్రవేశం ఉండదు. లోపలికి సెల్‌ఫోన్ల అనుమతి ఉండదు.  పేకాటకు వచ్చే జూదగాళ్లకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఈ శిబిరాల్లో రోజుకు రూ.లక్షల్లో చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంపాడుతోపాటు ఎటపాక పరిసర గ్రామాల జూదగాళ్లు ఎక్కువగా వెళ్తుంటారు. ఇదిలా ఉంటే ఎటపాక పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలోనే ఈ పేకాట జూద శిబిరాలు  సాగుతున్నా పోలీసులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై సీఐ గజేంద్రకుమార్‌ను వివరణ కోరగా పేకాట నిర్వహణ విషయం తమ దృష్టికి రాలేదని , వెంటనే నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకంటామని చెప్పారు. 

Updated Date - 2022-06-28T06:39:54+05:30 IST