పాక్‌తో సరిహద్దులు మరింత శత్రు దుర్భేద్యం

ABN , First Publish Date - 2021-09-03T02:18:55+05:30 IST

పాక్ సరిహద్దుల్లోని అట్టారీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద రేడియేషన్ డిటెక్షన్

పాక్‌తో సరిహద్దులు మరింత శత్రు దుర్భేద్యం

న్యూఢిల్లీ : పాక్ సరిహద్దుల్లోని అట్టారీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద రేడియేషన్ డిటెక్షన్ ఎక్విప్‌మెంట్ (ఆర్‌డీఈ)ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మన దేశంలోకి అక్రమంగా తరలివచ్చే రేడియోయాక్టివ్ మెటీరియల్, ఆయుధాలను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. భారత్ ఏర్పాటు చేసిన తొలి ఆర్‌డీఈ ఇది. 


ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం, అక్రమంగా మన దేశంలోకి వచ్చే ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రేడియోయాక్టివ్ పదార్థాలను గుర్తించే ఆర్‌డీఈని అట్టారీ సరిహద్దుల్లో ఏర్పాటు చేశారు. ఇది ట్రక్‌ను పూర్తిగా తనిఖీ చేయగలదు. 


ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిశ్రా మాట్లాడుతూ, ఈ పరికరాన్ని ఫుల్ బాడీ ట్రక్ స్కానర్ అంటారన్నారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి, చట్టవ్యతిరేక వస్తువులను అక్రమంగా తరలించే ట్రక్‌లను పూర్తిగా ఎక్స్-రే తీస్తుందన్నారు. రేడియోయాక్టివ్ మెటీరియల్స్ చట్టవిరుద్ధంగా, అక్రమంగా రవాణా కాకుండా నిరోధించేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. 


పాకిస్థాన్‌తో వాణిజ్యాన్ని భారత్ నిలిపేసింది. అయితే ఆఫ్ఘనిస్థాన్ నుంచి పాకిస్థాన్ గుండా అట్టారీ సరిహద్దుల నుంచి డ్రైఫ్రూట్స్, పండ్లు వస్తూ ఉంటాయి. రోజుకు దాదాపు 30 ట్రక్కులు వస్తాయి. 


Updated Date - 2021-09-03T02:18:55+05:30 IST