బోసిపోయిన.. మార్కెట్‌

ABN , First Publish Date - 2022-10-01T05:24:33+05:30 IST

ఒకప్పుడు రాష్ట్రంలోనే మోడ ల్‌ మార్కెట్‌గా నిలవాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్‌ నేడు బోసిపో యింది. రూ.3.40 కోట్లు ప్రభుత్వ నిధులు వెచ్చించి 2013 మేలో అప్పటి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదు గా ప్రారంభించారు. అత్యాధునిక ప్రమాణాలతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతుల కల్పన చేశా రు. గత నాలుగేళ్ల కిందట వరకు కళకళలాడిన మార్కెట్‌ యార్డు నేడు శిథిలావస్థకు చేరింది.

బోసిపోయిన.. మార్కెట్‌
నిర్మానుష్యంగా ఉన్న వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని దుకాణ సముదాయం

పాములు, విషపురుగులకు ఆవాసం
శిథిలావస్థకు చేరిన భవనాలు   
రూ.కోట్ల నిధులు వృథా   
వాల్మీకిపురం, సెప్టెంబరు 30:
ఒకప్పుడు రాష్ట్రంలోనే మోడ ల్‌ మార్కెట్‌గా నిలవాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్‌ నేడు బోసిపో యింది. రూ.3.40 కోట్లు ప్రభుత్వ నిధులు వెచ్చించి 2013 మేలో అప్పటి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదు గా ప్రారంభించారు. అత్యాధునిక ప్రమాణాలతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతుల కల్పన చేశా రు. గత నాలుగేళ్ల కిందట వరకు కళకళలాడిన మార్కెట్‌ యార్డు నేడు శిథిలావస్థకు చేరింది. వాల్మీకిపురంతో పాటు సమీప మండల గ్రామాలకు అనుకూలంగా ఉండే వ్యవ సాయ మార్కెట్‌ పట్ల రైతులు సైతం మొగ్గుచూపకపోవడం గమనార్హం. ఒకప్పుడు 100 నుంచి 150 టన్నుల దాకా నిత్యం టమోటా వచ్చే వాల్మీకిపురం మార్కెట్‌కు ప్రస్తుతం చూద్దామన్నా టమోటా కనిపించడం లేదు. మండలంలో పంట సాగు అంతంత మాత్రం ఉండడం, ట్రేడర్లు ఇక్కడి మార్కెట్‌ పట్ల ఆసక్తి చూపకపోవడంతో యార్డు అభివృద్ధి శూన్యంగా మారింది. ఉన్న అరకొర కూడా దళారుల ప్రమేయంతో రైతులకు నష్టం వాటిల్లుతోందన్న విమర్శలు ఉన్నాయి. రైతులు లేక, వ్యాపారాలు సాగక యార్డులోని దుకాణ సముదాయం కూడా వెలవెలబోతోంది. మార్కెట్‌ యార్డుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పథంలో నడిచేలా చూడాలని, తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే వ్యవసాయ మార్కెట్‌ కనుమరుగు కావడం తథ్యమని పలువురు అంటున్నారు.

భవనాలు శిథిలం..
వ్యవసాయ మార్కెట్‌ పాలక భవనాలు మినహా ఆవరణలోని భవనాలు శిథిలాలను తలపిస్తున్నాయి. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన రైతు విశ్రాంత గదులు ప్రారంభం నుంచి ఇప్పటిదాకా వినియోగంలోకి తెచ్చిన దాఖలాలు లేవు. రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంట్‌ కూడా శిథిలంగా మారుతోంది. మరుగుదొడ్లు అసాంఘిక కార్యకలాపాలకు, పాములకు ఆవాసాలుగా మారిపోయాయి. ఎటు చూసినా అరణ్య వాతావరణం తలపిస్తోంది. మార్కెట్‌ ప్రారంభం రోజున వెలిగిన విద్యుత్‌ దీపాలు మళ్లీ ఇప్పటిదాకా వెలిగిన పాపాన పోలేదు. నిత్యం మార్కెట్‌ ఆవరణలో చీకటిపడగానే మందుబాబుల ఆగడాలు ఎక్కువవుతున్నాయి.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం..
వ్యవసాయ మార్కెట్‌ అభివృద్ధికి ప్రత్యామ్నాయ ఏర్పా ట్లకు పరిశీలిస్తున్నాం. స్థానికంగా మార్కెట్‌లో ట్రేడర్లు ఆసక్తి చూపకపోవడంతోనే వ్యాపార లావాదేవీలు పూర్తిగా కుంటుపడ్డాయి. యార్డు ఆవరణం విశాలంగా ఉండటంతో పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు, ఇతరత్రా వ్యాపారాల నిమిత్తం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు కూడా పంపాము. వచ్చే సీజన్‌ నాటికి యార్డులో వసతులు పూర్తి స్థాయిలో మెరుగుపరుస్తూ, ప్రత్యామ్నాయంగా పూల వ్యాపారాలు తదితరం పరిశీలించి మార్కెట్‌ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం.
- జగదీష్‌, మార్కెట్‌ కమిటీ సెక్రటరీ, వాల్మీకిపురం



Updated Date - 2022-10-01T05:24:33+05:30 IST