బోరిస్‌ యాత్ర

ABN , First Publish Date - 2022-04-26T06:28:44+05:30 IST

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన భారత పర్యటన స్వదేశంలో ఇంత వివాదాస్పదం అవుతుందని ఊహించి ఉండరు. పార్టీ గేట్ వ్యవహారంలో నిండామునిగిన బోరిస్ ఆ ఉక్కపోత భరించలేక ఉపశమనం కోసం...

బోరిస్‌ యాత్ర

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన భారత పర్యటన స్వదేశంలో ఇంత వివాదాస్పదం అవుతుందని ఊహించి ఉండరు. పార్టీ గేట్ వ్యవహారంలో నిండామునిగిన బోరిస్ ఆ ఉక్కపోత భరించలేక ఉపశమనం కోసం భారత్ వెళ్ళారని విమర్శించినవారికి, ఇప్పుడు మరో రాజకీయాస్త్రం దొరికింది. బోరిస్‌ భారత్‌లో చేసిన ‘జేసీబీ’ విన్యాసాలను బ్రిటన్ మీడియా తప్పుబడుతున్నది. బ్రిటిష్ ప్రధానిగా ఉంటూ, అక్కడ నీ చర్యలూ చేష్టలతో తప్పుడు సందేశాలు ఇస్తే ఎలా? అని పత్రికలు విమర్శిస్తున్నాయి.


నాలుగు మంచిమాటలు మాట్లాడి, వ్యాపార ఒప్పందాలు చేసుకుపోవాలన్న లక్ష్యంతో వచ్చారు కనుక బోరిస్ నుంచి విమర్శలు, విశ్లేషణలవంటివేమీ ఎవరూ ఆశించలేదు. ఆయన వ్యవహరణ కూడా అందుకు తగిననట్టుగానే ఉన్నది. జేసీబీ ఫ్యాక్టరీ సందర్శన, ఆరంభోత్సవం కూడా ఎంతో ముందుగా నిర్ణయించుకున్నదే. కానీ, ఆయన అహ్మదాబాద్‌లో అడుగుపెట్టడానికి ముందురోజు భారతదేశ రాజధానిలో కొన్ని కీలక ఘటనలు చోటుచేసుకున్నాయి. పాలకుల ఆదేశాల మేరకు అధికారులు జహంగీర్‌పురి ప్రాంతంలోకి అరడజను జేసీబీలను ఉపయోగించి ప్రధానంగా మైనారిటీలకు చెందిన దుకాణాలను, ఇళ్ళను, మసీదు గేటునూ కూల్చివేశారు. ఆ ఆదేశాలు ఇచ్చిన ఢిల్లీ మునిసిపాలిటీ మోదీ పార్టీ పాలనలో ఉన్నదనీ, అక్రమ నిర్మాణాలన్న పేరిట యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొద్దివారాలుగా ఈ తరహా కూల్చివేతల వ్యవహారం నడుస్తున్నదనీ, రహస్య ఎజెండా ఇదీ అంటూ బ్రిటన్ ప్రధానికి ఆయన సలహాదారులు చెప్పి ఉంటే బాగుండేది. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరుచేస్తూ కొన్ని గంటలపాటు జేసీబీలు దూకుడుగా వ్యవహరించాయని తెలిసివుంటే, బోరిస్ కాస్తంత అదుపులో ఉండేవారేమో. జేసీబీ సంస్థ అధినేత లార్డ్ బాంఫోర్డ్ టోరీ పార్టీకి అత్యంత ఆప్తుడు కనుక కార్యక్రమం ఆగదు కానీ, పాత సినిమా హీరోలాగా బోరిస్ అక్కడ విన్యాసాలు చేసేవారు కాదేమో.


ఉక్రెయిస్ విషయంలో ఆయన భారతదేశాన్ని అంత బలంగా వెనకేసుకురావడం కూడా చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అమెరికా మాటకీ, చర్యకీ వంతపాడుతూ ప్రపంచానికి హెచ్చరికలు చేసే బ్రిటన్ ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంలో భారతదేశం రష్యావైపు ఉన్నప్పటికీ పల్లెత్తుమాట అనకుండా మంచిమాటలతో సరిపెట్టడం గమనించాలి. పుతిన్‌తో మోదీ పలుమార్లు మాట్లాడి రష్యాకు బుద్ధి చెప్పారంటూ జాన్సన్ ప్రశంసించడం విచిత్రం. రష్యాకు పరోక్షంగా కూడా సహకరించడానికి వీల్లేదన్న ఆమెరికా ఆదేశాలను భారత్ బేఖాతరు చేస్తున్నప్పటికీ పలు ఒప్పందాలకు సిద్ధపడటమూ విశేషమే. బ్రెగ్జిట్ అనంతర బ్రిటన్ ఆర్థిక కష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. భారత్ వంటి భారీ మార్కెట్ ఉన్న దేశాలతో వ్యాపార ఒప్పందాలు కుదర్చుకోవడం దానికి అత్యంత అవసరం. ఉభయదేశాల మధ్యా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మరో విడత చర్చల అనంతరం దీపావళికల్లా ఖరారవుతుందని అంటున్నారు. ఆర్థిక, వ్యాపార, వాణిజ్యాల్లో బ్రిటన్ మనమీద  ఆధారపడి వున్నందున ఉపాధులు, వీసాల విషయంలో దానిని మరింత దారికితెచ్చేందుకు భారత్ ప్రయత్నిస్తున్నది.


2019లో బ్రిటన్ ప్రధాని అయిన బోరిస్ భారత్‌లో పర్యటనకు పలుమార్లు సంకల్పించినా, తరువాత కరోనా మహమ్మారి వల్ల కనీసం రెండుసార్లు వాయిదావేయక తప్పలేదు. బోరిస్ మాజీ భార్య ప్రముఖ రచయిత కుష్వంత్ సింగ్ సమీప బంధువని అంటారు. ఈ పర్యటనలో తనకు ఘన స్వాగతసత్కారాలు దక్కినందుకు బోరిస్ పరమానందభరితుడైనాడు. తన పర్యటన యావత్తూ మోదీనీ, దేశాన్నీ ప్రశంసలతో ముంచెత్తుతూ ముగించేశారు. కానీ, నట్టింట్లో పార్టీగేట్ వ్యవహారం నానాటికీ మరింత బిగుసుకుంటూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత లాక్‌డౌన్ కాలంలో నిబంధనలను బేఖాతరుచేసి సన్నిహిత మిత్రులతోనూ, పార్టీ నేతలతోనూ ఆయన మూడుపర్యాయాలు విందువినోదాల్లో పాల్గొన్నారన్నది అభియోగం. అది నిజం కాదని నిండుసభలో అబద్ధం ఆడిన నేరం ఆయనను వెంటాడుతున్నది. ఇప్పుడు ఏర్పడిన హౌస్ కమిటీ ఆయనను దోషిగా నిర్థారిస్తే పదవినుంచి తప్పుకోవలసి వస్తుంది. నాలుగుదశాబ్దాల క్రితం లేబర్‌ పార్టీ ప్రధాని జేమ్స్‌ కాల్‌హాన్‌ మాత్రమే భారత పర్యటనలో భాగంగా గుజరాత్‌ సందర్శించారట. వెనక్కువెళ్ళిన కొద్దినెలల్లోనే ఆయన పదవిపోగొట్టుకున్న విషయాన్ని కొందరు ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు.

Updated Date - 2022-04-26T06:28:44+05:30 IST