బోసిపోయిన పెంచలకోన

ABN , First Publish Date - 2022-01-25T05:35:12+05:30 IST

పెంచలకోన క్షేత్రంలో 16 మంది బారిన పడినట్లు ప్రచారం జరగడంతో సోమవారం భక్తులు లేక వెలవెలపోయింది.

బోసిపోయిన పెంచలకోన
భక్తులు లేక వెలవెలబోతున్న శ్రీవారి ఆలయం

కొవిడ్‌ బారిన 16 మంది.. బోసిపోయిన ఆలయం

వైరస్‌ బారిన ఉపాధ్యాయులు, విద్యార్థులు


రాపూరు, జనవరి 24 : పెంచలకోన క్షేత్రంలో 16 మంది బారిన పడినట్లు ప్రచారం జరగడంతో సోమవారం భక్తులు లేక వెలవెలపోయింది. వందమందిలోపు  మాత్రమే శ్రీవారిని దర్శించుకున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. ఆలయ ఉద్యోగులకు కరోనా రావడం, వైద్యాధికారులు మందుల కిట్‌ ఇచ్చి హోం ఐసొలేషన్‌లో ఉండాలని చెప్పడంతో భక్తులతోపాటు బాధిత కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది.  క్షేత్రం అటవీ ప్రాంతంలో ఉండటం, రాత్రి వేళ అత్యవసర పరిస్థితులు ఏర్పడితే చికిత్సకు అవకాశం లేకపోవడంతో కలవరపడుతున్నారు.  తాత్కాలిక వైద్యశిబిరం ఏర్పాటుచేసి అత్యవసర మందులు, ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.


విద్యాసంస్థల్లో..

గుండవోలు పాఠశాలలో ఒక టీచర్‌, ఇద్దరు విద్యార్థులు, గిలకపాడు పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా నిర్ధారణ అయినట్లు ఎంఈవో శ్రీనివాసులు సోమవారం తెలిపారు. అయితే, ఐదారుగురు విద్యార్థులు మాత్రమే రావడంతో గిలకపాడు పాఠశాలలో సీఆర్‌పీ విధులు నిర్వహించినట్లు వివరించారు. మంగళవారం నుంచి డిప్యుటేషన్‌పై ఉపాధ్యాయుడిని నియమిస్తామన్నారు. గుండవోలు పాఠశాలకు విద్యార్థులు రాకపోవడంతో క్లోరినేషన్‌, హైపో పిచికారీ చేయించినట్లు  హెచ్‌ఎం కృష్ణ ప్రకటించారు. గిలకపాడు పాఠశాలలో ఆదివారం 8 మంది విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. 


మర్రిపాడు : తహసీల్దారు అబ్దుల్‌అహ్మద్‌, మండ ల వైద్యాధికారి వెంకటకిషోర్‌లతోపాటు మర్రిపాడు హైస్కూల్‌లో ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా నిర్ధారణ అయ్యింది. మర్రిపాడు హైస్కూలుకు మంగళవారం సెలవు ప్రకటించారు. సుమారు 20 మంది విద్యార్థులకు తలనొప్పి, జ్వరం, ఒళ్లునొప్పులుగా ఉండటంతో వారిని ఇళ్లకు పంపినట్లు ఇన్‌చార్జి హెచ్‌ఎం కె.వెంకటయ్య తెలియజేశారు. 


జిల్లాలో 1198 పాజిటివ్‌లు

నెల్లూరు (వైద్యం) : జిల్లాలో సోమవారం కరోనా కేసులు 1198 నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,55,599లకు చేరుకున్నాయి. కరోనాతో బాధపడుతూ ఒకరు మృతి చెందారు. అలాగే కరోనా నుంచి కోలుకున్న 91 మందిని అధికారులు డిశ్చార్జ్‌ చేశారు. జిల్లావాప్తంగా 15,579 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. 



వైద్య శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు

నెల్లూరు(వైద్యం) జనవరి 24 : వైద్య ఆరోగ్యశాఖలో ఎన్‌హెచ్‌ఎంలో ఖాళీగా ఉన్న కార్డియాలజీ, జనరల్‌ మెడిసిన్‌ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవాలని డీఎంహెచ్‌వో  రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలియచేశారు. ఆత్మకూరు ఏరియా ఆసుపత్రిలో పనిచేసేందుకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 2వ తేదీలోపు ఇంటర్వ్యూలో పాల్గొనాలని, రూ.1,10,000 వేతనం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో ఎన్‌హెచ్‌ఎంలో ఖాళీగా ఉన్న ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌, ఆడియామెట్రిషన్‌ ఉద్యోగాలకు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 2వ తేదీలోగా ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేస్తామని డీఎంహెచ్‌వో తెలియచేశారు. 

Updated Date - 2022-01-25T05:35:12+05:30 IST