Boston Train Accident: వంతెనపైనున్న రైలులో మంటలు... నదిలో దూకిన మహిళ...

ABN , First Publish Date - 2022-07-22T16:45:00+05:30 IST

అమెరికా (America)లోని బోస్టన్‌ (Boston) శివారులో ఓ వంతెనపైన ప్రయాణిస్తున్న

Boston Train Accident: వంతెనపైనున్న రైలులో మంటలు... నదిలో దూకిన మహిళ...

బోస్టన్ :  అమెరికా (America)లోని బోస్టన్‌ (Boston) శివారులో ఓ వంతెనపైన ప్రయాణిస్తున్న రైలులో మంటలు చెలరేగాయి. దీంతో ఈ సబ్‌వే రైలులోని ప్రయాణికులు ఆత్రుతగా పట్టాలపైకి దిగిపోయారు. దాదాపు 200 మంది ప్రయాణికులు దిగిపోయినట్లు అధికారులు ప్రకటించారు. అత్యధిక ప్రయాణికులు ఈ రైలు కిటికీల గుండా బయటకు వచ్చి, ప్రాణాలను కాపాడుకున్నారని చెప్పారు. అయితే ఓ మహిళ ప్రాణభయంతో అకస్మాత్తుగా మిస్టిక్ నదిలోకి దూకేశారని తెలిపారు. 


శుక్రవారం ఉదయం వెల్లింగ్టన్-అసెంబ్లీ స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న ఆరంజ్ లైన్ ట్రైన్‌లోని హెడ్ కార్ నుంచి  పొగ, మంటలు చెలరేగినట్లు మసాచుసెట్స్ బే ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ (ఎంబీటీఏ) తెలిపింది. ఈ సంఘటనకు కారణాలను  దర్యాప్తు చేసి, ఎప్పటికప్పుడు వివరాలను తెలియజేస్తామని తెలిపింది. ఈ మార్గంలో రైళ్ళ రాకపోకలను పునరుద్ధరించినట్లు ప్రకటించింది.


ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం,  ఈ రైలులోని షీట్ మెటల్ ఒరిపిడికి గురికావడంతో నిప్పు రాజుకుని, మంటలు చెలరేగినట్లు తెలుస్తోందని అధికారులు చెప్పారు. 


ట్విటర్‌లో పోస్ట్ అయిన ఓ వీడియో ద్వారా తెలుస్తున్న వివరాల ప్రకారం, ఆరంజ్ లైన్ ట్రైన్‌లో పొగలు రావడంతో ప్రయాణికులు క్రిందకు దిగి, రైల్వే స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించింది. ఓ వ్యక్తి మిస్టిక్ నది (Mystic River)లో దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 


ఈ రైలు కిటికీల నుంచి ప్రయాణికులు పట్టాలపైకి దూకుతున్నట్లు కనిపిస్తున్న వీడియోలను చాలా మంది ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని అమెరికన్ మీడియా తెలిపింది.


ఇదిలావుండగా, ఈ రైలు నుంచి నదిలో దూకిన మహిళ చికిత్స చేయించుకోవడానికి నిరాకరించారు. 









Updated Date - 2022-07-22T16:45:00+05:30 IST