- ఆరుగురి అరెస్టు
చెన్నై: సంతానంలేని దంపతులకు మగబిడ్డను విక్రయించిన కేసులో ఆ బిడ్డను కొనుగోలు చేసిన దంపతులు సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. విరుదునగర్ జిల్లా అప్పయ్య నాయకన్పట్టికి చెందిన సుందరలింగం, గోమతి దంపతులు సంతానం లేక బాధపడుతుండటంతో ఆ ప్రాంతానికి చెందిన మహేశ్వరి తన సోదరుడికి ముగ్గురు మగబిడ్డలున్నారని, మూడో మగబిడ్డను పెంచేందుకు స్థోమతలేక బాధపడుతున్నారని చెప్పి ఆ బిడ్డను ఇప్పిస్తానని చెప్పింది. ఆ ప్రకారం మహేశ్వరి సోదరుడు అన్నామలై, ఆయన భార్య అంబికతో మాట్లాడింది. చివరకు గత డిసెంబర్లో అన్నామలై తన మూడో మగబిడ్డను సుందర లింగం దంపతులకు రూ.45 వేలకు విక్రయించారు. ఈ విషయం ఇటీవల విరుదునగర్ జిల్లా శిశు సంరక్షణ అధికారి మీనాక్షికి తెలిసింది. వెంటనే ఆమె రహస్యంగా విచారణ జరిపి వివరాలను సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి మగబిడ్డను కొనుగోలు చేసిన సుందరలింగం, గోమతి, బిడ్డను విక్రయించిన అన్నామలై సహా ఆరుగురిని అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి