Gram panchayat Elections: విక్టరీ వీరులు తామేనని ప్రకటించుకున్న అధికార, విపక్ష కూటములు

ABN , First Publish Date - 2022-09-20T22:12:43+05:30 IST

రెండు కూటమిలు ఎన్నికల్లో తలపడితే విజయం ఎవరో ఒకరికి సొంతం కావడం సహజ..

Gram panchayat Elections: విక్టరీ వీరులు తామేనని ప్రకటించుకున్న అధికార, విపక్ష కూటములు

ముంబై: రెండు కూటమిలు ఎన్నికల్లో తలపడితే విజయం ఎవరో ఒకరికి సొంతం కావడం సహజ ప్రక్రియ. ఇందుకు భిన్నంగా రెండ్రోజుల క్రితం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Gram Panchayat elections) విజయం (Victory) తమదంటే తమదని అధికార ఏక్‌నాథ్ షిండే-బీజేపీ కూటమి (Eknath shinde-Bjp alliance), ఇటీవల అధికారం కోల్పోయిన మహా వికాస్ అఘాడి (MVA) వేర్వేరుగా సోమవారం ప్రకటించుకున్నాయి.


గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ అనేది పార్టీ గుర్తులపై ఉండదు. అభ్యర్థులకు ఆయా పార్టీలు మద్దతు మాత్రమే ఇస్తుంటాయి. ఆదివారం జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ మద్దతిచ్చిన 259 మంది అభ్యర్థులు, ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గం మద్దతిచ్చిన 40 మంది అభ్యర్థులు గెలిచారని మహారాష్ట్ర బీజేపీ ప్రకటించుకుంది. మహారాష్ట్రలో బీజేపీ తిరిగి ''నెంబర్ వన్ పార్టీ'' గా నిలిచిందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. 16 జిల్లాల్లోని 557 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో తమదే నిజమైన శివసేన అని ప్రకటించుకుంటున్న ఉద్ధవ్ థాకరే శివసేన వర్గం, ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గంతో పాటు బీజేపీకి ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మూడు నెలల క్రితమే అధికారంలోకి వచ్చిన అధికార కూటమికి గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు మరింత ప్రతిష్ఠాత్మకంగా ఉన్నాయి. సోమవారంనాడు వోట్ల లెక్కింపు జరిగింది. ఈ క్రమంలోనే ఫడ్నవిస్ ఒక ట్వీట్‌లో తమదే విజయమంటూ ప్రకటించారు. ''బీజేపీ, ఏక్‌నాథ్ షిండే శివసేన కూటమి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. బీజేపీ తిరిగి నెంబర్ వన్ పార్టీగా నిలిచింది'' అని ఆయన ట్వీట్ చేశారు.


భిన్నమైన లెక్కలు చెప్పిన ఎంవీఏ

కాగా, ఫడ్నవిస్ లెక్కలను విపక్ష ఎంవీఏ కొట్టివేసింది. ఆదివారం రాత్రి వరకూ వెలువడిన 497 గ్రామ పంచాయతీల్లో బీజేపీకి 144 సీట్లు, ఎన్‌సీపీకి 126, కాంగ్రెస్ 62 సీట్లు, షిండే వర్గం 41, ఉద్ధవ్ థాకరే వర్గం 37 సీట్లు గెలుచుకున్నాయని ఎంవీఏ ప్రకటించింది. దీనిపై ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ మాట్లాడుతూ, కొందరు తాము నెంబర్-1 అని, నెంబర్-2 అని ప్రకటించుకుంటున్నారని, నిజానికి పార్టీ గుర్తులపై ఈ ఎన్నికలు జరగలేదని అన్నారు. ప్రత్యర్థులు చెప్పిన నెంబర్ల ప్రకారం చూసినా,  ఎంవీఏకు ఎక్కువ సీట్లు వచ్చాయని అన్నారు. 300 సీట్లు గెలుచుకున్నట్టు ఫడ్నవిస్ ప్రకటించడంపై అడిగిన్పపుడు, ఆయన 300 సీట్లు గెలిచామని చెబితే, నేను 400 సీట్లు గెలిచామని చెబుతానని సమాధానమిచ్చారు. పార్టీ గుర్తులపై ఈ ఎన్నికలు జరగలేదనే విషయం మరోసారి తాను గుర్తు చేస్తున్నానని అజిత్ పవార్ అన్నారు.

Updated Date - 2022-09-20T22:12:43+05:30 IST