బొత్స బ్రదర్స్‌ మంత్రాంగం!

ABN , First Publish Date - 2022-06-27T06:45:34+05:30 IST

ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రజాప్రతినిధులు అడ్డగోలు వ్యవహారాలకు తెరతీశారు.

బొత్స బ్రదర్స్‌ మంత్రాంగం!

టీచర్ల అడ్డగోలు బదిలీలకు సిఫారసు

15 మందికి లేఖలిచ్చిన విద్యాశాఖా మంత్రి, గజపతినగరం ఎమ్మెల్యే

మరో నలుగురైదుగురికి రాయలసీమ ప్రజాప్రతినిధి లేఖలు

ఉమ్మడి విశాఖ జిల్లాలో బదిలీలకు ఇతర జిల్లాల నేతల సిఫారసు

పైరవీలతో బదిలీకి 33 మంది టీచర్లు ప్రయత్నం

చక్రం తిప్పిన గోదావరి జిల్లా ప్రజాప్రతినిధి బావమరిది

విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపిన సీఎంవో అధికారులు 

సిఫారసు లేఖలపై మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు  


(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)


ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రజాప్రతినిధులు అడ్డగోలు వ్యవహారాలకు తెరతీశారు. పలుకుబడి, డబ్బు ఉన్న ఉపాధ్యాయులు తాము కోరుకున్న పాఠశాలలకు బదిలీ చేయించుకోవచ్చని నిరూపిస్తున్నారు. అక్రమాలకు చెక్‌ చెప్పాల్సిన విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, అతని సోదరుడు, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య జిల్లాలోని 15 మంది టీచర్లకు బదిలీలకు సంబంధించి సిఫారసు లేఖలు ఇవ్వడం విద్యాశాఖలో తీవ్ర దుమారం రేపుతోంది. దీనికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విద్యాశాఖకు పంపిన ప్రతిపాదన కాపీ బయట పడడంతో కలకలం రేగింది. 

విశాఖ నగర పరిసరాల్లో పోస్టింగ్‌ కోసం సిఫారసు లేఖలు ఇచ్చిన వారిలో రాయలసీమకు చెందిన ప్రజాప్రతినిధి, ఇతర జిల్లాల ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో చోడవరం ఎమ్మెల్యే ముగ్గురికి, పెందుర్తి ఎమ్మెల్యే ఇద్దరికి, మంత్రి అమర్‌నాథ్‌, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కేకేరాజు, జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌ శ్రీధర్‌, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి ఒక్కొక్కరికి ఇలా సిఫారసు లేఖలు ఇచ్చారు. అఽధికారపార్టీ నేతల ఒత్తిడితోనే మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ లేఖలు ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నప్పటికీ, కొందరి విషయంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి బావమరిది ఒకరు చక్రం తిప్పారని ఉపాధ్యాయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీనికి నగర పరిసరాల్లో ఏళ్లుగా పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడొకరు సహకరించారని చెబుతున్నారు.


దొడ్డిదారి బదిలీలకు 33 మంది ప్రయత్నం

టీచర్ల బదిలీలకు కసరత్తుచేస్తున్న తరుణంలోనే పాఠశాల విద్యాశాఖ అడ్డగోలు చర్యలకు తెరతీసింది. రాజకీయ అండదండలున్న వారిలో  33 మంది విశాఖ నగర పరిసరాలు, పరిసర మండలాల పాఠశాలల్లో బదిలీలకు సిఫారసు లేఖలు తెచ్చుకున్నారు. వీరిలో 31 మంది టీచర్లు, ఇద్దరు జూనియర్‌ లెక్చరర్లు ఉన్నారు. వీరంతా చినగదిలి, నగరం, పెందుర్తి, గాజువాక, ఆనందపురం, భీమిలి మండలాల్లో పాఠశాలలు కోరుకుంటున్నారు. వీరిలో ఉమ్మడిజిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు కొందరైతే.... నగర పరిసరాల్లో పనిచేస్తూ, బదిలీ తప్పనిసరి అయిన వారు మరికొందరు. సీఎంవో నుంచి విద్యాశాఖకు అందిందంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌చేస్తున్న జాబితా మేరకు జిల్లాకు సంబంధించి చినగదిలిమండలం ఆరిలోవ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న కె.విజయలక్ష్మి పక్కనే ఉన్న సంతపాలెం స్కూలుకు, అక్కడ పనిచేస్తున్న జి.కృష్ణవేణి ఆరిలోవకు, జోడుగుళ్లపాలెం ప్రాఽథమిక పాఠశాలలో పనిచేస్తున్న టి.కృష్ణ సమీప ఎస్‌ఐజీ నగర్‌ స్కూలుకు, అక్కడి ముత్యమమ్మ జోడుగుళ్లపాలెం పాఠశాలకు, పెందుర్తిమండలం రెల్లికాలనీ పాఠశాలలో పనిచేస్తున్న సీహెచ్‌ హేమలత పక్కనే ఉన్న దొగ్గవానిపాలెం పాఠశాలకు, అక్కడ పనిచేస్తున్న సీహెచ్‌ సూర్యనారాయణ రెల్లికాలనీకి, వి.జుత్తాడ పాఠశాల టీచరు ఎం.అనసూయ పక్కనే ఉన్న సౌభాగ్యపురం, అక్కడి ఎంవీఎం లలిత వి.జుత్తాడకు, కంపరపాలెం ప్రాథమిక పాఠశాల టీచరు బి.వెంకటరావు సమీప కృష్ణానగర్‌కు, అక్కడి బి.చిరంజీవులు కంపరపాలెంనకు బదిలీ చేయాలంటూ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు తెచ్చుకున్నారు. సాధారణంగా ఎస్జీటీలు, స్కూలు అసిస్టెంట్‌ కేడర్‌  టీచర్లు ఒకేచోట ఎనిమిదేళ్లు పనిచేసిన తరువాత వారికి బదిలీ తప్పనిసరి. 


నగరంపైనే మోజు 

ఉమ్మడి జిల్లాలో టీచర్లంతా నగర పరిసరాల్లో పనిచేయడానికే ఇష్టపడతారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో పనిచేస్తున్న టీచర్లంతా నిబంధనల మేరకు ఎనిమిదేళ్ల తరువాత శివారు ప్రాంతాలకు వెళ్లిపోవాలి. అయితే కొందరు టీచర్లు మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడక అడ్డగోలు బదిలీలకు యత్నిస్తున్నారు. తాజాగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఇచ్చిన సిఫారసుల్లో అనకాపల్లి మండలం ఎరుకునాయుడు పాలెం జడ్పీ ఉన్నత పాఠశాల జువాలజీ స్కూల్‌ అసిస్టెంట్‌ ఆడారి శ్రీలక్ష్మి తన కుటుంబంలో ఒకరు తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైనందున చినగదిలి మండలం హెచ్‌.వెంకటాపురం ఉన్నత పాఠశాలకు బదిలీ చేయాలని మెడికల్‌ గ్రౌండ్స్‌లో సిఫారసు లేఖను తెచ్చుకున్నారు. ఇది నిబంధనల ప్రకారం సవ్యంగానే ఉన్నప్పటికీ, మిగిలిన లేఖల్లో అడ్డగోలు వ్యవహారం వెలుగుచూస్తోంది. ఇక నర్సీపట్నం జూనియర్‌ కళాశాల నుంచి పెందుర్తి కళాశాలకు ఒకరు, ఎస్‌.కోట నుంచి నగరంలో మహిళా జూనియర్‌ కళాశాలకు ఒక జూనియర్‌ లెక్చరర్‌ సిఫారసు లేఖలు సంపాదించారు. సిఫారసుల మేరకు ఖాళీలపై నివేదిక ఇవ్వాలని సీఎంవో విద్యాశాఖను ఆదేశించింది. మూడేళ్ల క్రితం బదిలీలు చేసినపుడు నగర పరిసరాల్లో ఖాళీలను ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్లాక్‌ చేయడంతో మారుమూల ప్రాంతాల టీచర్లు గ్రామీణ ప్రాంతాలకే పరిమితమయ్యారు. తాజాగా సీఎంవో రంగంలోకి దిగడంతో విద్యాశాఖ నివేదిక పంపినట్టు తెలిసింది. అయితే దీనిపై విద్యాశాఖలో ఎవరూ మాట్లాడేందుకు సుముఖంగా లేకపోవడం గమనార్హం. దీంతో సిఫారసు లేఖలు తెచ్చుకున్న టీచర్లకు త్వరలో బదిలీలు జరిగిపోతాయని తెలుస్తోంది. 


చక్రం తిప్పిన గోదావరి జిల్లా వాసి

టీచర్ల అడ్డగోలు బదిలీల్లో తూర్పుగోదావరి జిల్లాలోని ఒక ప్రజాప్రతినిధి బావమరిది చక్రం తిప్పారనే ప్రచారం సాగుతోంది. దీనికి విశాఖ పరిసరాల్లో ఏళ్ల తరబడి తిష్ఠ వేసిన వ్యాయామ ఉపాధ్యాయుడొకరు సహకరించారనే గుసుగుసలు వినిపిస్తున్నాయి. బదిలీలు కోరుకునే టీచర్ల నుంచి వీరిద్దరు డబ్బు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీల్లో పారదర్శకత కోసం 20 ఏళ్ల  కిందట నుంచి అమలవుతున్న కౌన్సెలింగ్‌ విధానాన్ని ప్రభుత్వమే తిలోదకాలివ్వడం, విద్యాశాఖా మంత్రే సిఫారసు లేఖలు ఇవ్వడం దారుణమని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. 

Updated Date - 2022-06-27T06:45:34+05:30 IST