క్రికెటర్‌ నటరాజన్‌కు ఘనస్వాగతం

ABN , First Publish Date - 2021-01-22T13:31:24+05:30 IST

ఆస్ట్రేలియాతో జరిగిన టి20, టెస్ట్‌ మ్యాచుల్లో భారత్‌ తరపున సత్తా చాటిన బౌలర్‌ నటరాజన్‌కు స్వగ్రామంలో అపూర్వ స్వాగతం లభించింది. అరంగేట్రంతోనే నటరాజన్‌ అద్భుతమైన ....

క్రికెటర్‌ నటరాజన్‌కు ఘనస్వాగతం

చిన్నంపట్టిలో భారీ ర్యాలీ

చెన్నై,(ఆంధ్రజ్యోతి): ఆస్ట్రేలియాతో జరిగిన టి20, టెస్ట్‌ మ్యాచుల్లో భారత్‌ తరపున సత్తా చాటిన బౌలర్‌ నటరాజన్‌కు స్వగ్రామంలో అపూర్వ స్వాగతం లభించింది. అరంగేట్రంతోనే నటరాజన్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. టెస్ట్‌లో తొలి వికెట్‌, తొలి రన్‌ నమోదు చేశాడు.  కెప్టెన్‌ అజింకా రెహానే టెస్ట్‌ ట్రోఫీని మొదటిగా నటరాజన్‌కు అందజేయడం విశేషం. వేగవంతమైన యార్కర్లు వేసి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ ముప్పుతిప్పలు పెట్టిన నటరాజన్‌ను సీనియర్‌ క్రికెటర్లు అభినందించారు. ఈ నేపథ్యంలో సిరీస్‌ ముగించుకున్న నటరాజన్‌ స్వగ్రామమైన సేలం జిల్లా చిన్నంపట్టికి గురువారం చేరుకున్నాడు. తొలుత నటరాజన్‌కు భారీ స్వాగతం పలకాలని అతని ఇంటి సమీపంలో వేదికను ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, ఆరోగ్య, పోలీసు శాఖల అధికారులు అక్కడకు చేరుకొని లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు ఉన్నాయంటూ వేదికను తొలగించారు. అధికారులు ఎన్ని చెప్పినా గ్రామస్తులు, అభిమానులను మాత్రం అడ్డుకోలేకపోయారు. గ్రామానికి చేరుకున్న నటరాజన్‌ను గుర్రపు బగ్గీలో, మంగళవాయిద్యాలు, కేరళ బ్యాండ్‌ నడుమ వీధుల్లో ఊరేగించారు. గ్రామమంతా నటరాజన్‌కు ఆహ్వానం పలుకుతూ గ్రామంలో భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేశారు.


క్వారంటైన్‌కు నటరాజన్‌..

నటరాజన్‌క్వారంటైన్‌లో ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన కారణంగా కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని, ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు నటరాజన్‌కు సూచించారు.

Updated Date - 2021-01-22T13:31:24+05:30 IST