డింకోసింగ్‌ ఇక లేడు

Jun 11 2021 @ 04:37AM

కేన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస

ఇంఫాల్‌: కేన్సర్‌తో పోరాడుతున్న ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత బాక్సర్‌ డింకోసింగ్‌ (42) గురువారం ఉదయం మణిపూర్‌లోని తన స్వగ్రామం సెక్తాలో మరణించాడు. 2017లో లివర్‌ కేన్సర్‌ బారిన పడిన ఈ మణిపురీ బాక్సర్‌ చికిత్స కూడా తీసుకున్నాడు. కానీ ఆ వ్యాధి తిరగబెట్టింది. గత ఏడాది కొవిడ్‌ నుంచి కూడా కోలుకున్నాడు. కానీ కేన్సర్‌ను మా త్రం అతడు జయించలేకపోయా డు. డింకోకు భార్య బబాయ్‌ గంగోమ్‌, కొడుకు, కూతురు ఉన్నారు. డింకోసింగ్‌ మరణంతో దేశ క్రీడారంగం విషాదంలో మునిగింది. అతడి మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడల మంత్రి రిజిజు, మణిపూర్‌ ముఖ్యమంత్రి బిరెన్‌ సింగ్‌, భారత బాక్సింగ్‌ సమాఖ్య సంతాపం తెలిపాయి.

1998 ఆసియాడ్‌ స్వర్ణం

1998లో జరిగిన బ్యాంకాక్‌ ఆసియా క్రీడల్లో డింకోసింగ్‌ స్వర్ణ పతకం గెలుపొందాడు. తద్వారా ఆసియాడ్‌లో 16 ఏళ్ల భారత పసిడి పతక కొరతను తీర్చాడు. అంతకుముందు 1982 న్యూఢిల్లీ ఆసియా క్రీడల్లో కౌర్‌సింగ్‌ చివరిసారి స్వర్ణ పతకం నెగ్గాడు. ఇక 1962 జకార్తా ఏషియాడ్‌లో పదమ్‌ బహదూర్‌ తొలి బంగారు పతకం అందుకున్న తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో బాక్సర్‌గా డింకోసింగ్‌ నిలిచాడు.  డింకో 1998లో అర్జున పురస్కారానికి, 2013లో పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యాడు. 


సూపర్‌స్టార్‌: ప్రధాని

డింకోసింగ్‌ క్రీడా సూపర్‌స్టార్‌. అద్భుత బాక్సర్‌ అయిన డింకో ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించాడు. అంతేకాదు దేశంలో బాక్సింగ్‌కు ఆదరణ పెరగడానికి తోడ్పడ్డాడు. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.


‘మణి’పూస: సీఎం బిరెన్‌సింగ్‌

మణిపూర్‌ అందించిన గొప్ప బాక్సర్‌ డింకోసింగ్‌. డింకో మృతితో దిగ్ర్భాంతి చెందా. అతడి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా.


ఎంతో విచారకరం: మంత్రి రిజిజు

డింకో మరణం ఎంతో విచారకరం. దేశ గొప్ప బాక్సర్లలో అతడు ఒకడు. 1998 ఆసియాడ్‌లో డింకో గెలిచిన స్వర్ణంతో దేశ బాక్సింగ్‌ రంగం రూపురేఖలు మారిపోయాయి.


నిజమైన హీరో: మేరీకోమ్‌

ఆయనే దేశానికి నిజమైన హీరో. డింకో ఈ లోకాన్ని వీడినా అతని జ్ఞాపకాలు కలకాలం నిలిచిపోతాయి.ఎందరికో స్ఫూర్తి.. 

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం): కెరటం నాకు ఆదర్శం.. లేచి పడుతున్నందుకు కాదు..పడినా లేస్తున్నందుకు..  -స్వామి వివేకానంద ఈ సామెత.. బాక్సింగ్‌ స్టార్‌ డింకోసింగ్‌కు అతికినట్టు సరిపోతుంది. కష్టాలమయ బాల్యం..అతడి చిన్ననాటి జీవి తం ఎంత దుర్భరమంటే కనీసం ఒక్కపూట కూడా అన్నం పెట్టలేని దుస్థితిలో డింకోను తల్లిదండ్రులు అనాథ శరణాలయంలో చేర్పించేంతగా! ఆ కష్టాలు, కన్నీళ్లను అధిగమించి దేశం గర్వించే బాక్సర్‌గా ఎదిగిన అతడి జీవితం ఎందరికో స్ఫూర్తినిచ్చింది.. మేరీకోమ్‌, విజేందర్‌లాంటి నేటి మేటి తరం బాక్సర్లను తయారుచేసింది.


అనతి కాలంలోనే..:

ఈశాన్య ఇంపాల్‌ జిల్లాలోని మారుమూల గ్రామం సెక్తాలో పుట్టిన డింకో సింగ్‌ బాల్యం అనాథ శరణాలయంలో గడిచింది. మేజర్‌ ఓపీ భాటియా నేతృత్వంలో బాక్సింగ్‌ ఓనమాలు నేర్చుకున్న డింకో 10 ఏళ్లకే 1989లో జాతీయ సబ్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌ నెగ్గాడు. కొద్దికాలంలోనే జాతీయస్థాయికి ఎదిగిన డింకో..1997లో బ్యాంకాక్‌లో జరిగిన కింగ్స్‌ కప్‌లో టైటిల్‌ అందుకొని అంతర్జాతీయస్థాయిలో మెరిశాడు. 1998 ఏషియన్‌ గేమ్స్‌లో తలపడే భారత జట్టుకు ఎంపికయ్యాడు. అప్పుడు కారణాలేంటో తెలియదుకానీ అతడిని హఠాత్తుగా జట్టునుంచి తొలగించారు. దాంతో తీవ్ర నిరాశకు లోనైన డింకో మద్యానికి బానిసయ్యాడు. అనంతరం జట్టుకు ఎంపికై బ్యాంకాక్‌ వెళ్లినా రింగ్‌లో కింగ్‌లా విజృంభించాడు. 54 కిలోల విభాగంలో స్టార్‌ బాక్సర్లను చిత్తుచేసి పసిడి పతకం చేజిక్కిం చుకున్నాడు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్న డింకో..క్వార్టర్‌ఫైనల్‌ను దాటలేకపోయాడు. ఇండియన్‌ నేవీలో ఉద్యోగం చేసిన డింకో బాక్సింగ్‌ నుంచి రిటైరయ్యాక ఇంఫాల్‌ సాయ్‌ కేంద్రంలో కోచ్‌గా బాధ్యతలు చేట్టాడు.


2017లో అనారోగ్యం:

సాఫీగా సాగుతున్న డింకో జీవితంలో ఒక్కసారిగా కుదుపు. లివర్‌ కేన్సర్‌ నిర్ధారణ కావడంతో ఢిల్లీలో చికిత్స పొందాడు. ఈ క్రమంలో అతడు సొంత ఇంటిని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. గత ఏడాది కరోనా సమయంలో అతడిని ఎయిర్‌ అంబులెన్స్‌లో ఢిల్లీ తీసుకొచ్చి చికిత్స చేశారు. అప్పట్లో కొవిడ్‌నుంచి అతడు విజయవంతంగా బయటపడ్డాడు. తర్వాత కామెర్లు సోకడంతో పరిస్థితి విషమించింది. ‘పోరాటం నాకు సహజసిద్ధంగా అబ్బింది. కేన్సర్‌పై కూడా పోరాడి గెలుస్తా’ అని వ్యాధి నిర్ధారణ అయిన తొలిరోజుల్లో డింకోసింగ్‌ ఆత్మవిశ్వాసంతో చెప్పేవాడు. కానీ అతడిపై ఆ వ్యాధిదే పైచేయి అయింది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.