పాత కక్షతో బాక్సర్‌ సాయితేజా హత్య

ABN , First Publish Date - 2022-05-29T05:44:34+05:30 IST

పుట్టిన రోజు వేడుకలకు నమ్మకంగా ఆహ్వానించారు. పథకం ప్రకారం అక్కడ వివాదం సృష్టించారు. అనంతరం కత్తులు, ఇనుప రాడ్లతో వెంబడించి హత్య చేశారు.

పాత కక్షతో బాక్సర్‌ సాయితేజా హత్య
వివరాలు తెలియజేస్తున్న డీసీపీ సుమిత్‌

పుట్టిన రోజు వేడుకలకు పిలిచి అంతమొందించిన దుండగులు

ఏడుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

పరారీలో ఒక మైనర్‌

విశాఖపట్నం, మే 28: పుట్టిన రోజు వేడుకలకు నమ్మకంగా ఆహ్వానించారు. పథకం ప్రకారం అక్కడ వివాదం సృష్టించారు. అనంతరం కత్తులు, ఇనుప రాడ్లతో వెంబడించి హత్య చేశారు. మర్రిపాలెం గాంధీనగర్‌కు చెందిన బాక్సర్‌ రేపాక సాయితేజ (24)హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాతకక్షల నేపథ్యంలో కక్ష కట్టి ప్రత్యర్థులు సాయితేజాను మట్టుబెట్టారని పోలీసులు నిర్థారించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయం డీసీపీ సుమిత్‌ సునీల్‌ గరుడ శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వివరాలు తెలిపారు.


రేబాక సాయితేజా (23), మర్రిపాలెం గ్రీన్‌గార్డెన్స్‌ ప్రాంతానికి చెందిన బంగర్రాజుల మధ్య మూడు నెలల క్రితం ఘర్షణ జరిగింది. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. స్వతహాగా బాక్సర్‌ అయిన సాయితేజా తనను, తన స్నేహితులను నిత్యం అవమానిస్తున్నాడని, అజమాయిషీ చేస్తున్నాడని బంగార్రాజు భావించాడు. ఈ పరిస్థితుల్లో సాయితేజా అడ్డు తొలగించుకోవాలని అతను, అతని స్నేహితులు పథకం పన్నారు.


ఇందులో భాగంగా ఈనెల 26వ తేదీన బంగార్రాజు వర్గంలోని ఓ యువకుడు తన పుట్టిన రోజు వేడుకలకు రావాలంటూ సాయితేజాని ఆహ్వానించాడు. అక్కడే కూర్చుని మన మధ్య ఉన్న అపోహలు కూడా తొలగించుకుందామని నమ్మించారు. ఇది నిజమని నమ్మిన సాయితేజా ఆ రోజు రాత్రి వేడుకలకు వెళ్లాడు. అర్ధరాత్రి పన్నెండు గంటలకు వేడుకలు  నిర్వహించాక సమీపంలోని పాడుపడిన మర్రిపాలెం రైల్వేక్వార్టర్స్‌ మైదానానికి వెళ్లారు. అక్కడ పాత విషయాలు ప్రస్తావించుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది.


పథకం ప్రకారం అప్పటికే తమతో తెచ్చిన కత్తులు, ఇనుపరాడ్లతో సాయితేజాపై బంగార్రాజు వర్గం దాడికి దిగింది. దీంతో తప్పించుకునేందుకు సాయితేజా పరుగందుకున్నా వెంటపడి మరీ కొట్టి, పొడిచి చంపేశారు. అనంతరం నిందితులు పరారయ్యారు. ఉదయం హత్య విషయం వెలుగులోకి రావడంతో  పోలీసులు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలు పరిశీలించారు. పుటేజీలో నిందితులు హత్యకు పాల్పడిన దృశ్యాలు రికార్డు అయివుంది.


దీని ఆధారంగా బంగార్రాజుతోపాటు మహ్మద్‌ యూసఫ్‌ఖాన్‌ (20), వెంపల్లి రవికుమార్‌ (24), పరదేవ జయంత్‌ (20), బోనిశెట్టి మోహన్‌ (24), సంపతరావు సురేష్‌ (22), సీపాన సురేష్‌ (20)లను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు నేరం అంగీకరించడంతో అరెస్టుచేసి కోర్టు ముందు హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించారు. కాగా, నిందితుల్లో ఒక మైనర్‌ కూడా ఉండగా, అతను పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. 

Updated Date - 2022-05-29T05:44:34+05:30 IST