
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) జాయింట్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ సంఘం (ఏపీఓఏ) ప్రధాన కార్యదర్శి, శాప్ మాజీ చైర్మన్ పి.అంకమ్మచౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన ఏకైక వ్యక్తి అంకమ్మనే కావడం విశేషం. ఇటీవల గువాహటిలో జరిగిన బాయ్ సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుడిగా హిమంత బిస్వ శర్మ రెండోసారి ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడిగా పుల్లెల గోపీచంద్, జాయింట్ సెక్రటరీగా అంకమ్మతో పాటు ఎనిమిది మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన అంకమ్మ చౌదరిని ఆంధ్ర బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు టి.జి వెంకటేష్, ఏపీఓఏ ప్రతినిధులు పున్నయ్య చౌదరి, రాయపాటి రంగారావు, రామినేని రామ్మోహన్ తదితరులు అభినందించారు.